iDreamPost
android-app
ios-app

సంచలనం రేపుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్లు..!

  • Published Jan 16, 2021 | 4:07 AM Updated Updated Jan 16, 2021 | 4:07 AM
సంచలనం రేపుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే కామెంట్లు..!

విజయనగరం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పడాల అరుణ చేస్తున్న కామెంట్లు ఆ పార్టీ నాయకులతో పాటు, విజయనగరం రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు విజయనగరం రాజకీయాల్లో అంతా తానై నడిపించిన అశోక గజపతిరాజుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న పడాల ఇప్పుడు ఆ జిల్లాలో సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా మారారనే చెబుతున్నారు. ఇప్పటి వరకు అక్కడ సాగిన రాజుగారి ఏకఛత్రాధి పత్యాన్ని ప్రశ్నించడం రాజుగారివ్యతిరేక వర్గం ఏకమవుతున్న సూచనలు కన్పిస్తున్నాయంటున్నారు.

పడాల ఆవేదనకు కూడా కారణం లేకపోలేదని ఆమెపై సింపతీ చూపించేవారు కూడా లేకపోలేదు. గత ఎన్నికల్లో అరుణకు రావాల్సిన సీటును అశోక్‌ తన కుమార్తె అదితికి ఇప్పుంచుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. సర్వేలు, పబ్లిక్‌ ఒపీనియన్‌ అంటూ టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన జిమ్మిక్కులను అడ్డుపెట్టుకుని తన వారికి టిక్కెట్టు ఇప్పించుకోవడంలో అశోక్‌ గజపతిరాజు సఫలమయ్యారు. దీంతో అప్పట్నుంచి అక్కడ ఆయనకు వ్యతిరేక వర్గం ఏకమయ్యే ప్రయత్నాలను తీవ్రమయ్యాయి. ఇది ఏకంగా విజయగనరం జిల్లా టీడీపీ తరపున రెండో కార్యాలయాన్ని పడాల అరుణ ఏర్పాటు చేసేంత వరకు వెళ్ళింది. సూటిగా అశోక్‌గజపతిరాజునే లక్ష్యంగా చేసుకుని ఈ మాజీ ఎమ్మెల్యే చేస్తున్న వ్యాఖ్యలకు సమాధానం చెప్పేవారు కూడా కరువయ్యారంటే అక్కడి పరిస్థితి ఏ స్థాతికి చేరిందో అంచనా వేయొచ్చంటున్నారు. అశోకుడికి మద్దతుగా కనీసం ఏ ఒక్కురు మాట్లాడకపోవడాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. వ్యతిరేకవర్గం చేస్తున్న విమర్శల్లో బలం ఉండబట్టే ఎవ్వరు వ్యతిరేక వ్యాఖ్యల ప్రయత్నాలు చేయడం లేదనే వారు కూడా లేకపోలేదు.

రాజకుటుంబానికి చెందిన వ్యక్తిగా ఆయనకు గతంలో ఆ గౌరవం దక్కేది. అయితే రాన్రాను ఏకపక్ష ధోరణులతో వ్యవహరిస్తుండడంతోనే ప్రస్తుత పరిస్థితి ఎదుర్కొవాల్సి వస్తోందన్న విమర్శలు విన్పిస్తున్నాయి. ఈ విమర్శలకు ప్రస్తుతం ఆ పార్టీ నుంచే అసమ్మతి వర్గం కూడా తోడవ్వడంతో జిల్లాలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారిపోతోందని ఆ పార్టీ నాయకులే ఆఫ్‌ది రికార్డుగా చెబుతున్నారు. గతంలో టీడీపీకి కంచుకోటగా ఉన్న విజయనగరం జిల్లాలో గత ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తన ఆధిక్యాన్ని చాటుకుంది. క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఎన్నికల ఫలితాల తరువాత నుంచి టీడీపీకి సొంత కార్యకర్తలే ముఖం చాటేసేపరిస్థితి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణంగా అశోక్‌గజపతిరాజే నంటూ ఆయన వైపే వేలెత్తిచూపే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీకి ఎదురుగాలి వీస్తుండడం, సొంతం అనుకున్న నాయకులు, కార్యకర్తలు ప్రస్తుతం బైటకు వచ్చేందుకు ఆసక్తిచూపకపోవడంతో పార్టీకి పునర్‌వైభవం తీసుకువద్దామని చేసే ప్రయత్నాలేవీ కలిసి రావడం లేదంటున్నారు. రాజుగారికి మద్దతుగా టీడీపీ సోషల్‌ మీడియా వింగ్‌ అనుకూల కామెంట్లు చేయడం, పోస్టులు పెట్టడం తప్పితే ప్రాక్టికల్‌గా జనం ముందుకు వచ్చేవారెవ్వరూ లేకపోవడం గమనార్హం.

ఆత్మహత్యా సదృశ్యమైన మతం అంశాన్ని కూడా టీడీపీ నాయకులు వాడేసారు. అయినప్పటికీ ప్రజల నుంచి తగిన స్పందన కరువవ్వడంతో వారంతా తీవ్ర అంతర్మధనంలో పడ్డారంటున్నారు. విగ్రహ విధ్వంసం ఎక్కడ జరిగినా దానిని తీవ్రంగానే ఖండించాలి. కానీ రామతీర్ధంలోని ఉప ఆలయంలో జరిగిన విగ్రహ ధ్వంసాన్ని ఏకంగా ప్రధాన ఆలయంలోనే జరిగినట్లుగా టీడీపీ నాయకులు, వారి అనుచర మీడియా వర్గం ఫోకస్‌ చేసేందుకు తీవ్రంగానే ప్రయత్నించారు. కానీ విజయనగరం జిల్లాలోనే ఆ ప్రయత్నం తేలిపోయింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ప్రభావం చూపి ఉంటుందో అంచనా వేయొచ్చంటున్నారు.

సొంత పార్టీ నుంచి రోజురోజుకూ పెరిగిపోతున్న వ్యతిరేక గళాలు, జనం నుంచి పార్టీ పట్ల కానరానీ స్పందన నేపథ్యంలో విజయగనరం జిల్లాలో టీడీపీ కోలుకోవడం ఇకపై కష్టంగానే మారుతుందన్న అంచనాలు వేస్తున్నారు. మున్ముందు ఇటువంటి వ్యతిరేక గళాలు ఇంకెన్ని వెలుగులోకొస్తాయో భవిష్యత్తే తేల్చాల్సి ఉంటుందంటున్నారు.