Idream media
Idream media
సౌమ్యులు, అజాతశత్రువుగా పేరొందిన నెల్లూరు నగర మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో గత కొంతకాలంగా బాధపడుతున్న ఆయన ఈ రోజు మధ్యాహ్నం తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా ఆయన క్యాన్సర్‌తో పోరాడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.
శ్రీధర్ కృష్ణారెడ్డి రాజకీయ ఆరంగేట్రం ఎన్టీఆర్ టీడీపీ నుంచి ఆరంభమైంది. ఎన్టీఆర్ అభిమానిగా రాజకీయాల్లోకి వచ్చిన ఆయన పార్టీలో పలు బాధ్యతలు నిర్వర్తించారు. రెండు సార్లు నెల్లూరు మున్సిపాలిటీలో కౌన్సిలర్‌గా పని చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీ టిక్కెట్ తనకే వస్తుందని ఆయన భావించేవారు. అయితే ఆప్పట్లో ఎన్టీఆర్ అభిమానిగా ఉన్న తాళ్లపాక రమేష్‌రెడ్డికి అవకాశాలు వచ్చేవి. 1994లో ఎమ్మెల్యేగా గెలిచి కొంత కాలం మంత్రిగా కూడా రమేష్‌రెడ్డి పని చేశారు. రమేష్‌రెడ్డి తర్వాత ఆయన సతీమణికి టీడీపీ నుంచి అవకాశం దక్కింది. అయినా శ్రీధర్ కృష్ణారెడ్డి పార్టీనే నమ్ముకుని ఉన్నారు.
అయితే 2009లో మారిన రాష్ట్ర రాజకీయాలు శ్రీధర్ కృష్ణారెడ్డిని ఎమ్మెల్యేని చేశాయి. పీఆర్‌పీ ఆవిర్భావంతో.. శ్రీధర్ కృష్ణారెడ్డి ఆ పార్టీలోకి వెళ్లారు. చిరంజీవితో ఉన్న పరిచయం, స్నేహం ఆయన్ను నెల్లూరు పీఆర్‌పీ అభ్యర్థిగా నిలబెట్టాయి. ప్రస్తుత మంత్రి, తొలిసారి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిల్‌కుమార్ యాదవ్‌పై శ్రీధర్ కృష్ణారెడ్డి కేవలం 90 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. పీఆర్‌పీని చిరంజీవి కాంగ్రెస్‌లో విలీనం చేసే సమయంలో.. శ్రీధర్ కృష్ణారెడ్డి తిరిగి టీడీపీ గూటికి వచ్చారు.
2014 ఎన్నికల్లోనూ శ్రీధర్ కృష్ణారెడ్డి మరోసారి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన ఈ సారి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన అనిల్‌కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత ఆయన అనారోగ్యం పాలయ్యారు. క్రమంగా రాజకీయాలకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉన్నారు. దీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడిన ఆయన ఈ రోజు కన్నుమూశారు.
శ్రీధర్ కృష్ణారెడ్డికి నెల్లూరు రాజకీయాల్లో సౌమ్యుడుగా పేరుంది. అందరితోనూ మంచి సంబంధాలు కొనసాగించారు. ప్రతి ఒక్కరితో వ్యక్తిగత పరిచయాలున్నాయి. 30 ఏళ్లపాటు రాజకీయాల్లో ఉన్నా.. ఎవరితోనూ విభేధాలు లేకుండా పని చేసి మంచి నేతగా గుర్తింపు పొందారు.
Also Read : కోటి మందికిపైగా పిల్లలు మోడీకి పోస్టుకార్డులు..