Idream media
Idream media
దేశంలో కోట్లకు పడగలెత్తిన రాజకీయ నాయకులకు కొదవ లేదు. ఒక్కసారి రాజకీయాల్లోకి వస్తే చాలు.. తరతరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తులు సంపాదించుకోవచ్చని నమ్మే వారెందరో.., కోట్లు సంపాదించుకునే అవకాశం ఉన్నా విలువలకు కట్టుబడి జీవితాన్ని అంకితం చేసిన నేతలు కొందరే. ఆ కోవకు చెందిన నాయకుడే చేకూరి కాశయ్య. ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ చైర్మన్ గా పని చేశారు. చివరి వరకూ ప్రజా జీవితంలో కొనసాగారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం కన్నుమూశారు.
స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేసిన నిస్వార్థ రాజకీయనేతగా చేకూరి ముద్ర వేసుకున్నారు. నిరాండబర జీవితానికి చేకూరి కాశయ్య పెట్టింది పేరు. అజాతశత్రువుగా ఆయనకు పేరుంది. సుదీర్థకాలంలో రాజకీయాల్లో ఉన్నప్పటికీ తన పేరున సొంత కారు కానీ, ఇల్లు కానీ లేదు. ఖమ్మం జిల్లా రాజకీయాలపై ఆయన చెరగని ముద్ర వేశారు. సుదీర్ఘ కాలం పాటు ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. 1978లో కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి వనమా వెంకటేశ్వర రావుపై గెలుపొందిన ఆయన దశాబ్దాలు తరబడి అదే అసెంబ్లీ స్థానంలో కొనసాగుతున్నారు.
ఇదే అసెంబ్లీ స్థానం నుండి కోనేరు నాగేశ్వరరావు చేతిలో 1983లో ఆయన ఓటమి పాలయ్యాడు. సుజాతనగర్ అసెంబ్లీ స్థానం నుండి 1994 ఎన్నికల్లో కూడ ఆయన ఓటమి పాలయ్యాడు. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్ధి రజబ్ అలీ చేతిలో చేకూరి కాశయ్య ఓడిపోయారు. ఎర్రుపాలెం మండలంలోని తక్కెళ్లపాడు గ్రామంలో ఆయన జన్మించారు. 1946 లో ఖమ్మం జిల్లాలో జరిగిన సభలో గాంధీ పాల్గొన్నారు. ఈ సభలో గాంధీ ప్రసంగం విన్నారు.ఈ ప్రసంగం తన జీవితాన్ని మలుపు తిప్పిందని కాశయ్య తరచూ చెబుతుండేవారు. సమకాలీన రాజకీయాలకు ఆయన ఎప్పుడూ దూరం కాలేదు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నేతలకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు.
మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి ఖమ్మం జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య మరణం పట్ల ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. స్వాతంత్ర సమరయోధుడుగా, తెలంగాణ అభ్యుదయవాదిగా, ఖమ్మం జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్రవేశారని సీఎం కొనియాడారు. కాశయ్య మరణంతో నిజాయితీ కలిగిన ఒక సీనియర్ రాజనీతిజ్జున్ని రాష్ట్రం కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత చేకూరి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆయనతో రాజకీయంగా ముడి పడి ఉన్న వసంత నాగేశ్వరరావు, తుమ్మల, మాజీ ఎంపీ ఎలమంచిలి శివాజీ, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ స్నేహశీలి కాశయ్య మృతి మనస్తాపానికి గురి చేసిందన్నారు. కాశయ్య గొప్ప మానవతావాదని, అందరి వాడిగా గుర్తింపు పొందారని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. బీజేపీ నేత, మాజీమంత్రి విజయరామారావు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా కాశయ్య అందరివాడిగా గుర్తింపు పొందారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపినట్లు చెప్పారు.
Also Read : ఈటలను ఎమ్మెల్యే గా కూడా తీసేస్తారా..?