iDreamPost
android-app
ios-app

మళ్లీ కాలుదువ్వుతున్న అమరనాథ్ రెడ్డి

  • Published Jan 24, 2022 | 2:15 AM Updated Updated Mar 11, 2022 | 10:22 PM
మళ్లీ కాలుదువ్వుతున్న అమరనాథ్ రెడ్డి

రాష్ట్రంలో టీడీపీ ఆవిర్భావం తర్వాత చాలా జిల్లాలు ఆ పార్టీకి కంచుకోటలుగా మారాయి. అయితే చిత్తూరు జిల్లాలో మాత్రం కాంగ్రెస్, టీడీపీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉండేది. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పట్టు బిగించగలిగింది. అటువంటి వాటిలో పలమనేరు ఒకటి. 1999లో తప్ప 1983 నుంచి 2009 వరకు ఇక్కడ ఆ పార్టీయే విజయం సాధించింది. అయితే వైఎస్సార్సీపీ  వచ్చిన తర్వాత పరిస్థితి తిరగబడింది. నియోజకవర్గంలో ఆ పార్టీ పాగా వేసింది. వరుసగా 2014, 2019 ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులే విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఓటమిపాలై నియోజకవర్గంపై పట్టు కోల్పోయిన మాజీమంత్రి ఎన్. అమరనాథ్ రెడ్డి తిరిగి పట్టు సాధించేందుకు నానాపాట్లు పడుతున్నారు. అయితే వైఎస్సార్సీపీ నానాటికీ బలం పెంచుకుంటుండటంతో ఆయన ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు.

పుంగనూరు నుంచి పలమనేరుకు షిఫ్ట్

మూడు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న అమరనాథ్ రెడ్డి వాస్తవానికి పుంగనూరు నియోజకవర్గానికి చెందిన వారు. ఆయన తండ్రి ఎన్. రామకృష్ణారెడ్డి ఆ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి చిత్తూరు ఎంపీగా గెలిచారు. ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకున్న అమరనాథ్ రెడ్డి 1996 ఉప ఎన్నికల్లో తొలిసారి పుంగనూరు నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1999లో ఓడిపోయి.. మళ్లీ 2004లో గెలిచారు. ఆ తర్వాత ఆయన పలమనేరు నియోజకవర్గానికి మారారు. 2009 ఎన్నికల్లో అక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికయ్యారు. వైఎస్సార్సీపీ ఏర్పాటైన తర్వాత 2012లో టీడీపీని వీడి ఆ పార్టీలో చేరి 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

మంత్రి పదవి కోసం మళ్లీ టీడీపీలోకి జంప్

2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైంది. టీడీపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కు లొంగిపోయిన అమరనాథ్ రెడ్డి 2016లో మంత్రి పదవికి ఆశపడి వైఎస్సార్సీపీకి ద్రోహం చేసి టీడీపీలోకి ఫిరాయించారు. 2017లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో నిబంధనలకు విరుద్ధంగా మంత్రి పదవి చేపట్టారు. ఈ చర్యతో ఆయన నియోజకవర్గంలో పరువు కోల్పోయారు. దానికి తోడు జగన్ వేవ్ కారణంగా 2019 ఎన్నికల్లో పలమనేరు నుంచే టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి బొక్కబోర్లా పడ్డారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి వెంకట గౌడ్ చేతిలో 32 వేల పైచిలుకు భారీ ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

మళ్లీ పట్టుకు పాట్లు

గత ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గాన్ని అమరనాథ్ రెడ్డి పెద్దగా పట్టించుకోలేదు. సొంత నియోజకవర్గాన్ని వదిలి జిల్లా పెత్తనం చేయడంతో పలమనేరు లో టీడీపీ పూర్తిగా దెబ్బతింది. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఇంఛార్జిగా వ్యవహరించి అక్కడా విఫలమయ్యారు. తిరిగి ఇన్నాళ్లకు ఆయనకు పలమనేరు గుర్తుకొచ్చినట్లుంది. కొన్నాళ్లుగా గ్రామాల్లో పర్యటిస్తూ హడావుడి చేస్తున్నారు. చెదిరిపోయిన పార్టీ క్యాడర్ ను తిరిగి చేరదీసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ప్రజలను పలకరిస్తున్నారు. అయితే ఇంటింటికీ సంక్షేమ పథకాలతో ఈ రెండున్నరేళ్లు కాలంలో వైఎస్సార్సీపీ ప్రజల్లో మరింత పాతుకుపోవడంతో అమరనాథ్ రెడ్డి ప్రయత్నాలన్నీ వృథా అవుతున్నాయి. నియోజకవర్గంపై మళ్లీ పట్టు సాధించడం.. వైఎస్సార్సీపీని ఢీ కొట్టడం అంత ఈజీ కాదని క్షేత్ర పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి.