iDreamPost
iDreamPost
ఆయన గోదావరి జిల్లాల్లోనే బలమైన కాపు కులానికి చెందిన బలమైన నాయకుడు. మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్నారు. ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే పదవులు అనుభవించారు. కానీ చివరకు ఇటీవల ఆయన చెప్పుతో కొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆరంభం నుంచి స్థిరత్వం లేని రాజకీయాలు, అవకాశాలు ఉపయోగించుకోలేని తీరుతో ఆయన తన ప్రాభవాన్ని కోల్పోయారు. దాంతో కొత్తపల్లి సుబ్బారాయుడి రాజకీయ ప్రస్థానంలో కీలక స్థానానికి చేరినప్పటికీ వైకుంఠపాళి మాదిరిగా అనూహ్యంగా పతనాన్ని చవిచూశారు. ప్రస్తుతం జిల్లాల విభజన పేరుతో మరోసారి వార్తల్లో కనిపించాలని ఆయన చేసిన ప్రయత్నం కూడా బెడిసికొట్టింది. దాంతో అయ్యో కొత్తపల్లి అంటూ అనుచరులు సైతం ఆయన్ని జాలిగా చూడాల్సిన స్థితి దాపురించింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం కాపులకు బలమైన స్థానం. పలుమార్లు కాపు కులస్తులే ఇక్కడి నుంచి గెలిచారు. అందులోనూ కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ, కాంగ్రెస్ టికెట్లపై సైతం విజయం దక్కించుకున్నారు. చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పనిచేశారు. ఓసారి లోక్ సభకి కూడా గెలిచారు. అలాంటి నాయకుడు పదే పదే పార్టీలు మారుతూ వచ్చారు. టీడీపీ నుంచి ప్రజారాజ్యం, అక్కడి నుంచి కాంగ్రెస్, వైఎస్సార్సీపీ, మళ్లీ టీడీపీ చివరకు వైసీపీ ఇలా సాగిన ఆయన ప్రస్థానంలో ఇప్పుడు అత్యంత గడ్డుస్థితిని ఎదుర్కొంటున్నారు.
మొత్తంగా ఐదుసార్లు శాసనసభ్యుడిగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన సుబ్బారాయుడు నిలకడలేనితనం ఆయన్ను నిలువునా ముంచేసింది. టీడీపీ, ప్రజారాజ్యం, వైఎస్సార్సీపీ ఇలా మూడుపార్టీలకు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన ఘనత ఆయనది. కానీ గతమంతా ఘనంగా ఉన్నా వర్తమానంలోనే ఉనికి కోసం పాకులాడాల్సి వస్తోంది. చివరకు నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజుతో సఖ్యత లేకపోవడంతో విబేధాలతో రోడ్డున పడాల్సివచ్చింది.
ఎమ్మెల్యే ప్రసాదరాజు తనను చిన్న చూపు చూస్తున్నారనే అభిప్రాయంలో సుబ్బారాయుడు ఉన్నారు. ఈ సమస్యను అధిష్టానంతో చర్చించి పరిష్కరించుకోవాల్సి ఉండగా అందుకు భిన్నంగా రోడ్డున పడ్డారు. పార్టీ నాయకత్వం మీద కూడా కొన్ని విమర్శలు చేసే స్థాయికి వెళ్లారు. అయితే ఆయన త్వరలో జనసేన తీర్థం పుచ్చుకోవాలని నిర్ణయించుకున్నట్టు ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తనకు వైఎస్సార్సీపీలో అవకాశం రాదని భావించి జనసేన టికెట్ రేసులో భాగంగా ఇటీవల జిల్లాల విభజన అంశాన్ని తెరమీదకు తెచ్చినట్టు తెలుస్తోంది. కానీ అది కూడా ఆయనకు కలిసిరాలేదని సమాచారం. పైగా సొంత పార్టీలో ఆయన తీరు మీద అధిష్టానం కూడా సీరియస్ అయ్యింది. ప్రసాదరాజుతో విబేధాలను పరిష్కరించుకునే ప్రయత్నంలో హద్దుమీరిన కొత్తపల్లిని ఇక వైఎస్సార్సీపీ నాయకత్వం ఖాతరు చేసే అవకాశం కూడా లేదు. దాంతో ఆయన పరిస్థితి అగమ్యగోచరంగా మారుతోంది. పువ్వులమ్మిన చోటే కట్టెలమ్ముకోవాల్సిన దుస్థితికి చేరుకున్నారు.