Idream media
Idream media
మాజీ మంత్రి మూలింటి మారెప్ప రాజకీయంగా తన అదృష్టాన్ని ఇంకా పరీక్షించుకుంటున్నారు. తాజాగా ఆయన బహుజన సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ)లో చేరారు. ఆదివారం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాలో ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ బీఎస్పీలో చేరిక సందర్భంగా నిర్వహించిన సభలో మారెప్ప కూడా బీఎస్పీ కండువా కప్పుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న మారెప్ప.. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ జీవితం ప్రారంభించి.. ఆ పై వైసీపీ, బీజేపీ, భారతీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ (ఐపీసీ)లలో ప్రయాణించి చివరకు బీఎస్పీ గూటికి చేరారు.
ప్రభుత్వ ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి..
ఇంజనీరింగ్ చదివిన మూలింటి మారెప్పను మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. ఇరిగేషన్ శాఖలో ఇంజనీర్‌గా పని చేస్తున్న మారెప్పను ఆ ఉద్యోగానికి రాజీనామా చేయించి 1994లో కర్నూలు జిల్లా ఆలూరు నుంచి పోటీ చేయించారు. ఆ ఎన్నికల్లో మారెప్ప ఓడిపోయారు. తిరిగి ఉద్యోగం ఇప్పిస్తానని విజయభాస్కర్ రెడ్డి చెప్పినా.. రాజకీయాల్లోనే కొనసాగుతానని 1999 ఎన్నికల్లో సీటు కేటాయించాలని మారెప్ప కోరారు. గత ఎన్నికల్లో ఓటమితో ఈ సారి సీటు రావడం కష్టమైంది. ఓడిపోయిన చోటనే గెలుస్తానని, మరో అవకాశం ఇవ్వాలన్న మారెప్ప వినతి మేరకు కోట్ల సూర్యప్రకాశరెడ్డి తన కోటాలో మరోసారి మారెప్పకు అవకాశం కల్పించారు. ఈ సారి మారెప్ప విజయం సాధించారు.
వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా.. వైసీపీలో ప్రయాణం..
2002లో కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరణం వరకు ఆయన అనుచరుడిగా, కోట్ల వర్గం నేతగా ఉన్న మారెప్ప ఆ తర్వాత వైఎస్ వర్గంలోకి మారారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశరెడ్డి వ్యవహారశైలి నచ్చక ఆయన వైఎస్ పంచన చేరారు. వైఎస్ రాజశేఖరరెడ్డే తనకు అధిష్టానమని చెప్పిన మూలింటి మారెప్ప కోట్ల వర్గానికి పూర్తిగా దూరమయ్యారు. 2004 ఎన్నికల్లోనూ ఆలూరు నుంచి పోటీ చేసి రెండోసారి గెలిచారు. ఈ సారి ఏకంగా వైఎస్ కేబినెట్‌లో మంత్రి పదవి దక్కించుకున్నారు. అయితే జడ్పీటీసీ ఎన్నికల్లో సొంత మండలాల్లో ఓడిపోవడంతో సీఎం వైఎస్ ఆదేశాల మేరకు మంత్రి పదవులకు మాగంటి బాబుతోపాటు మారెప్ప కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మాగంటి బాబు టీడీపీలో చేరినా.. మారెప్ప మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగారు.
2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆలూరు నియోజకవర్గం జనరల్ కావడంతో మారెప్పకు కష్టాలు మొదలయ్యాయి. ఆలూరు పక్కనే ఉన్న కోడుమూరులో పోటీ చేయాలని భావించినా కోట్ల సూర్యప్రకాశరెడ్డి అడ్డుపడ్డారు.
బీజేపీ వయా వైసీపీ…
వైఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి మారెప్ప ఆయన వెంట నడిచారు. వైసీపీలో కేంద్ర పాలక మండలి సభ్యుడుగా పని చేశారు. పలు కారణాల వల్ల అక్కడ కూడా పోటీ చేసే అవకాశం రాకపోవడంతో 2014లో బీజేపీలో చేరారు. ఆ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం రాకపోయినా 2018 వరకు కొనసాగారు. ఆ తర్వాత ఆ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ నేతలు పిలిస్తే ఆ పార్టీలోకి వెళతానన్నారు. అక్కడ నుంచి ఎలాంటి పిలుపు రాకపోవడంతో మిన్నుకుండిపోయారు.
బీఎస్పీ ద్వారా వెలుగులోకి వస్తారా..?
దాదాపు మూడేళ్ల వరకు రాజీయంగా కనిపించని మారెప్ప.. తిరుపతి ఉప ఎన్నికల వేళ వెలుగులోకి వచ్చి ఢిల్లీ వెళ్లి భారతీయ ప్రజా కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఆ ఎన్నికల్లో మారెప్ప ఎక్కడా కనిపించలేదు. మళ్లీ ఇప్పుడు చడీచప్పుడు లేకుండా బీఎస్పీలో చేరారు. మళ్లీ రాజయోగం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న మారెప్ప ఆశ.. బీఎస్పీ ద్వారా నెరవేరుతుందా..? లేదా..? కాలమే నిర్ణయించాలి.
Also Read : ఆర్ఎస్ పి + బీఎస్ పి : అంచనాలు పెంచిన అరంగేట్రం