iDreamPost
android-app
ios-app

కాషాయ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్‌

కాషాయ తీర్థం పుచ్చుకున్న ఈటల రాజేందర్‌

 తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ పయనం ఎలా సాగబోతోందనే అంశంపై స్పష్టత వచ్చింది. ఈటల ఈ రోజు కాషాయం కప్పుకున్నారు. టీఆర్‌ఎస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఈటల 20 ఏళ్లపాటు ఆ పార్టీలో కొనసాగారు. ఇకపై ఆయన రాజకీయ జీవితం బీజేపీతో సాగబోతోంది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఈటల రాజేందర్‌ హస్తినలో బీజేపీలో చేరారు. ఆయనతోపాటు ఏనుగు రవీందర్‌ రెడ్డి, తుల ఉమ, అదిలాబాద్‌ ఎంపీ రమేష్‌ రాఠోడ్, ఆర్టీసీ కార్మిక సంఘం మాజీ నేత అశ్వత్థామరెడ్డి కషాయ కండువా కప్పుకున్నారు.

కేసీఆర్‌పై పోరు..

భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన ఈటల రాజేందర్‌.. ఆ వెంటనే కేసీఆర్‌ లక్ష్యంగా విమర్శలు చేశారు. మంత్రి అయినా కనీస గౌరవం తనకు దక్కలేదని వాపోయారు. తనలాగే అందరిదీ అదే పరిస్థితన్నారు. తనపై నిరాధారమైన ఆరోపణలు చేసి బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఆస్తులు అమ్మి అయినా ఆత్మగౌరవం కోసం పోరాటం చేస్తామని ఈటల, ఆయన సతీమణి జమున స్పష్టం చేశారు. తమ ఆస్తులు, కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై విచారణ చేయాలని సవాల్‌ చేశారు.

సొంత పార్టీ ఏర్పాటు నుంచి…

ఈ క్రమంలో ఈటల రాజకీయ పయనంపై అనేక ఊహాగానాలు వెలువడ్డాయి. ఈటల సొంతంగా పార్టీ పెట్టబోతున్నారనే చర్చ విస్తృతంగా సాగింది. బీసీలను ఏకం చేసేలా పార్టీ నిర్మాణం ఉంటుందనే వార్తలు వెలువడ్డాయి. అయితే కొన్ని రోజులకే ఈ ప్రచారం తేలిపోయింది. ఈటలకు కాంగ్రెస్, బీజేపీల నుంచి ఆహ్వానం అందింది. పార్టీ నుంచి బయటకు వచ్చినా.. కేసీఆర్‌ వేధింపులు, ఆర్థికంగా దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తారనే సంకేతాలు రావడంతో జాతీయ పార్టీల మద్ధతు అవసరం అని ఈటల గుర్తించారు. సొంత పార్టీ ఏర్పాటు ఆలోచనను పక్కనపెట్టి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరారు. పైగా తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుండడం కూడా ఈటల కషాయం కండువా కప్పుకోవడానికి ఓ కారణం.

ఉప ఎన్నిక.. అగ్ని పరీక్ష..

ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న ఈటల రాజేందర్‌.. 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కేసీఆర్‌ కుటుంబం తర్వాత టీఆర్‌ఎస్‌లో కీలకమైన నేతగా ఎదిగారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. రెండో దఫాలో ఆరోగ్యశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఓటమి ఎరుగని నేతగా.. 17 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పని చేసిన ఈటల రాజేందర్‌కు… త్వరలో హుజురాబాద్‌లో జరగబోయే ఉప ఎన్నిక అగ్ని పరీక్షలాంటిది. ఉప ఎన్నికలో రాజేందర్‌ గెలిస్తే.. తెలంగాణ రాజకీయాల్లో, బీజేపీలో ఆయన హవా కొనసాగుతుంది. లేదంటే రాజకీయంగా ఎత్తుపల్లాలు తప్పవు.

Also Read : బీజేపీలో చేరి త‌ప్పు చేశాం క్ష‌మించండి… బెంగాల్ నాయకుల బ‌హిరంగ ప్ర‌చారం