iDreamPost
android-app
ios-app

ఎన్టీఆర్, పవన్‌ ఇద్దరూ ఒక్కటేనంటున్న మాజీమంత్రి

ఎన్టీఆర్, పవన్‌ ఇద్దరూ ఒక్కటేనంటున్న మాజీమంత్రి

దివంగత సినీ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు, జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్‌ కల్యాణ్‌లు ఇద్దరూ ఒకటేనట. ఇద్దరూ ఆదర్శాల కోసం రాజకీయాల్లోకి వచ్చారట. మీరు చదువుతున్నది నిజమే. ఈ మాటలు అన్నది ఎవరో కాదు తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. తెలుగు సినీ ప్రేక్షకులను అలలారించి, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన ఎన్టీరామారావుకు తెలుగు చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయనకు మరొకరు సాటిరారని ఆయన అభిమానులు, వారసులు చెబుతుంటారు. ఎవరితోనూ ఆయన్ను పోల్చరు. భారత రత్న లాంటి బిరుదు కూడా ఎన్టీఆర్‌ కాలి చెప్పుతో సమానమని ఆయన కుమారుడు నందమూరి బాలకృష్ణ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు.

అలాంటిది టీడీపీ నేతలు ఎన్టీ రామారావుతో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను పోల్చుతున్నారు. పోల్చడం కాదు.. ఇద్దరూ ఒకటేనని ఢంకా భజాయించి మరీ చెబుతున్నారు మాజీ మంత్రి బండారు సత్యనారాయణ. రాజకీయాలలోకన్నా సినిమాల్లోనే డబ్బు, పేరు ఎక్కువగా వస్తాయని, వాటి కోసం ఎన్టీ రామారావు, పవన్‌ కల్యాణ్‌లు రాజకీయాల్లోకి రాలేదంటున్నారు. ఆదర్శాల కోసమే వచ్చారని అభివర్ణిస్తున్నారు. అంతేకాదు.. పవన్‌ కల్యాణ్‌ అంటే తమ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ప్రత్యేకమైన అభిమానం ఉందని కూడా చెబుతున్నారు.

Also Read : బద్వేలు ఉప ఎన్నిక : టీడీపీలో ఆశలు రేపుతున్న గోపవరం మండలం

ఇంతకీ బండారు సత్యనారాయణ పవన్‌పై ఈ స్థాయిలో ప్రశంసల వర్షం కురిపించడానికి కారణం వెతుక్కొవాల్సిన పనిలేదు. ఆయనే తన మాటలతో చెప్పారు. 2014లో పవన్‌ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకున్నామని, 2019లో వేరుగా పోటీ చేశామని గుర్తు చేశారు. 2024 ఎన్నికల్లో మళ్లీ పవన్, చంద్రబాబులు కలవాలన్న, ఏం చేయాలన్నా వారిద్దరిపైనే ఆధారపడి ఉందని చెప్పుకొచ్చారు బండారు సత్యనారాయణ.

బండారు వ్యాఖ్యలు.. జనసేనతో పొత్తు కోసం టీడీపీ ఎంతలా వెంపర్లాడుతుందో స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి పితాని సత్యనారాయణ కూడా జనసేనతో పొత్తు పెట్టుకోవాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. 2024 ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే పొత్తుల కోసం టీడీపీ అర్రులు చాస్తోంది. పొత్తులేకుంటే నెగ్గుకురావడం సాధ్యం కాదని బాబుకు ముందే తెలుసు. తమ్ముళ్లకు 2019లో అర్థమైంది. చరిత్ర గుర్తుకు వచ్చింది. చంద్రబాబు నేతృత్వంలోకి టీడీపీ వచ్చిన తర్వాత ఏర్పాటు చేసిన ప్రభుత్వాలన్నీ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాత్రమే సాధ్యమైందని తమ్ముళ్లు గుర్తించారు. పొత్తు లేకపోతే తమ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో 2019 ఎన్నికల్లో కళ్లారా చూశారు. అందుకే ఎన్నికలకు సమయం ఉన్నా.. ఇప్పటి నుంచే జనసేనతో పొత్తు కోసం తహతహలాడుతున్నారు టీడీపీ నేతలు.

Also Read : బద్వేల్‌ ఉప ఎన్నిక: చప్పుడు లేని బీజేపీ, జనసేన..!