iDreamPost
iDreamPost
బీసీల సంక్షేమానికి సంబంధించి జగన్ ప్రభుత్వం ఏం చేసింది? చర్చకు సిద్ధమా! అంటూ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన సవాల్ భారతంలో ఉత్తర కుమారుడి ప్రగల్భాలను తలపిస్తున్నాయని వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన అయ్యన్న ప్రచారం కోసమే జగన్ 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేశారని విమర్శించారు. రాజకీయాలలో బీసీలకు 33శాతం రిజర్వేషన్లు ఎన్టీఆర్ చలవేనన్నారు. బీసీలకు ఇచ్చే పథకాలు ఎందుకు రద్దు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండున్నర సంవత్సరాల కాలంలో బీసీలను ఏమి ఉద్ధరించారో జగన్మోహన్ రెడ్డి చెప్పాలని సవాల్ చేశారు.
ఈ లెక్కలు తప్పులు చెప్పవు కదా..
బీసీలను ఆదుకున్నది ఎవరో బీసీ మంత్రి వేణుగోపాలకృష్ణ బహిరంగ చర్చకు సిద్ధమా? అని అయ్యన్న విసిరిన సవాల్ మరీ హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో బీసీల కోసం 118 హామీలు ఇచ్చి 10 శాతం కూడా అమలు చేయలేదని గుర్తు చేస్తున్నారు. ఏటా రూ.10 వేల కోట్లు బీసీల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చెప్పిన చంద్రబాబునాయుడు ఐదేళ్ల పదవీకాలంలో కేవలం రూ.19,329 కోట్లే ఖర్చు చేసిన సంగతి అయ్యన్నకు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సవాళ్లు విసురుతున్న అయ్యన్న అప్పట్లో చంద్రబాబును ఎందుకు ప్రశ్నించలేదు అని అడుగుతున్నారు.
ఈ ప్రభుత్వం బీసీలను గౌరవించింది..
రాష్ట్రంలో ఇన్ని సంక్షేమ పథకాలు అమలు జరుగుతుంటే రెండున్నర సంవత్సరాల కాలంలో బీసీలను ఏమి ఉద్ధరించారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని అనడానికి అయ్యన్నకు నోరెలా వచ్చిందని అధికార పార్టీ నేతలు అంటున్నారు. తమ ప్రభుత్వం బీసీలను బ్యాక్‌వర్డ్ క్లాస్‌గా కాకుండా బ్యాక్‌బోన్ క్లాసెస్‌గా గుర్తించి గౌరవించిందని చెబుతున్నారు. 136 కులాలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి 768 పదవులను వారికి కట్టబెట్టింది. రెండున్నరేళ్లలో 2.88 కోట్ల మంది బీసీలకు రూ. 69,841 కోట్లు వివిధ సంక్షేమ పథకాల కింద వెచ్చించింది. కేబినెట్‌లో 60 స్థానాలు బీసీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు తమ ప్రభుత్వం కేటాయించిందని వైఎస్సార్ సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. బీసీలకు ఇచ్చే పథకాలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రద్దు చేసింది అంటున్న అయ్యన్న ఆవేమిటో చెప్పాలని అడుగుతున్నారు. గొంతు పెంచేసి సవాళ్లు విసిరినంత మాత్రాన టీడీపీ నాయకులు చెప్పే అబద్ధాలను నమ్మడానికి బీసీలు సిద్ధంగా లేరని అంటున్నారు.
Also Read : ఇదేనా.. టీడీపీ స్ట్రాటజీ..!