Idream media
Idream media
ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన అచ్చెం నాయుడు ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? రెండు నెలలు అవుతున్నా ఆయన మొలలు ఇంకా తగ్గలేదా..? చేసిన శస్త్రచికిత్స తాలుకూ గాయం ఇంకా మానలేదా..? బెయిల్ వచ్చే వరకు ఆయన గుంటూరులోని రమేష్ ఆస్పత్రిలోనే జుడిషియల్ రిమాండ్‌లో ఉంటారా..?.. ఇవీ ప్రస్తుతం అందరిలోనూ మెదులుతున్న ప్రశ్నలు.
150 కోట్ల రూపాయల ఈఎస్‌ఐ స్కాంలో అచ్చెం నాయుడు అరెస్ట్ అయి ఈ రోజుకు రెండు నెలలు అవుతోంది. జూన్ 12వ తేదీన అచ్చెం నాయుడను ఆయన నివాసంలో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకు కొన్ని రోజులు ముందు అచ్చెం నాయుడు మొలలకు ఆపరేషన్ చేయించుకుని, ఇంట్లోనే ఉంటున్నారు. ఆయన్ను అధికారులు రోడ్డు మార్గాన విజయవాడకు తరలించారు. గాయం పచ్చిగా ఉండడంతో రక్తస్రావం అయిందని ఏసీబీ కోర్టు ఆయనను ఆస్పత్రికి తరలించాలని ఆదేశిస్తూ జుడిషియల్ రిమాండ్ విధించింది. గుంటూరు జీజీహెచ్‌లో అచ్చెం నాయుడుకు వైద్యం అందించారు. మళ్లీ చిన్నపాటి ఆపరేషన్ అవసరం అయితే జీజీహెచ్ వైద్యులు చేశారు. గాయం మానిందని జూలై 1వ తేదీన డిశ్చార్జి చేశారు.
అయితే తనకు ఇంకా మొలలు తగ్గలేదని, వ్యక్తిగత సహాయకుడు కూడా అవసరమని పిటిషన్ దాఖలు చేయగా.. అచ్చెం నాయుడు కోరిన విధంగా గుంటూరులోని రమేష్ ఆస్పత్రికి తరలించేలా హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో వారం రోజుల పాటు విజయవాడ సబ్ జైలులో ఉన్న అచ్చెం నాయుడు గత నెల 8వ తేదీన రమేష్ ఆస్పత్రికి వెళ్లారు. అప్పటి నుంచి ఆయన అక్కడే ఉంటున్నారు. అచ్చెం నాయుడు రమేష్ ఆస్పత్రికి వెళ్లి ఈ రోజుకు 34 రోజులవుతోంది. రాష్ట్రంలోనే పేరొందిన కార్పొరేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నా.. అచ్చెం నాయుడుకు ఇంకా నయం కాలేదా..? అనే ప్రశ్న వినిపిస్తోంది.
రెండు నెలల కాలంలో మొదటి 18 రోజులు జీజీహెచ్‌లో ఉన్న అచ్చెం నాయుడు, ఆ తర్వాత ఓ వారం రోజులు విజయవాడ జైలులో ఉన్నారు. మళ్లీ మొలలు సమస్య చెబుతూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లారు. జీజీహెచ్ లో ఆపరేషన్ జరిగిన తర్వాత వెళ్లికలా పడుకోలేక.. బెడ్‌పై ఓ పక్కకు తిరిగి పడుకున్న అచ్చెం నాయుడు.. డిశ్ఛార్జి సమయంలో మాత్రం వీల్ చైర్‌లో సౌకర్యవంతంగా కూర్చుకున్నారు. మొలలకు చేసిన శస్త్రచికిత్స తాలుకూ గాయం మానకపోతే ఆయన అలా కూర్చునే అవకాశమే లేదని వైద్యులు చెబుతున్నారు. జీజీహెచ్‌లో చేరిన వారం రోజులకే అచ్చెం నాయుడుకు మళ్లీ ఆపరేషన్ చేశారు. అంటే.. ఇప్పటికి ఆపరేషన్ జరిగి 53 రోజులు అవుతోంది. 53 రోజుల్లో ఆ గాయం మానకుండా ఉందా..? అనే ప్రశ్న వైద్య నిపుణుల నుంచి వినిపిస్తోంది.
అసలు అచ్చెం నాయుడు ఆరోగ్య పరిస్థితి ఏమిటి..? ప్రస్తుతం ఆయన ఎలా ఉన్నారు..? మొలలు కాకుండా మరేమైనా ఆరోగ్య సమస్యలు కొత్తగా తలెత్తాయా..? ప్రస్తుత కరోనా సమయంలో ఆయన పరిస్థితి ఎలా ఉంది..? అనే ఆందోళన వారి కుటుంబ సభ్యుల్లోనూ, అభిమానుల్లోనూ వ్యక్తమవుతోంది. ఈనేపథ్యంలో ప్రజల్లోనూ, ఆయన అభిమానుల్లోనూ నెలకొన్న సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పోలీసు శాఖపై ఉంది. అచ్చెం నాయుడు ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై సమగ్రమైన హెల్త్ బులిటిన్ విడుదల చేయాల్సిన అవసరం ఎంతో ఉంది.