నిఖిల్ గౌడ గుర్తున్నాడా.. అదేనండి జాగ్వార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నిఖిల్ కుమార స్వామి వివాహం సాదాసీదాగా అతికొద్దిమంది అతిథుల సమక్షంలో జరిగింది.
వివరాల్లోకి వెళితే మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవేగౌడ మనవడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారుస్వామి తనయుడు, నటుడు నిఖిల్ కుమారస్వామి వివాహం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కర్ణాటక గృహ నిర్మాణశాఖ మంత్రి ఎం కృష్ణప్ప మనవరాలు రేవతితో అత్యంత నిరాడంబరంగా సాదాసీదాగా జరిగింది.
రామనగర జిల్లాలోని కేతగాన హళ్లిలో గల ఫామ్‌హౌస్‌లో అతి కొద్ది మంది అతిథుల సమక్షంలో ఈ వివాహాన్ని సాదాసీదాగా నిర్వహించారు. ఈ వివాహాన్ని రామనగర జిల్లాలో టీవీల ద్వారా లైవ్ టెలికాస్ట్ చేశారు. కాగా లాక్ డౌన్ నిబంధనలు అమల్లో ఉన్నందున అతికొద్దిమంది మాత్రమే వివాహానికి హాజరయ్యారు. కానీ లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించి వివాహాన్ని జరిపించినట్లు కర్ణాటక ప్రభుత్వం భావించడంతో విచారణకు ఆదేశించింది. రామ నగర పోలీసులు నివేదిక అందజేసిన తరువాత లాక్ డౌన్ నిబంధనలు అతిక్రమించినట్లు తేలితే తగిన చర్యలు తీసుకోవాలని యడ్యూరప్ప ప్రభుత్వం భావిస్తుంది.
తన కుమారుడి వివాహానికి కేవలం 70 మంది లోపు అతిధులు మాత్రమే హాజరయ్యారని వివాహ సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు మీరలేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వివరణ ఇచ్చారు.
నిఖిల్ గౌడ 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాండ్యా నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీచేసిన నటి సుమలత మీద రెండు లక్షల ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు .