iDreamPost
android-app
ios-app

న్యాయ కోవిదుడుని తీసుకెళ్లిన కోవిడ్

న్యాయ కోవిదుడుని తీసుకెళ్లిన కోవిడ్

కొవిడ్‌ మహమ్మారితో మరో ప్రముఖుడు ప్రాణాలు కోల్పోయారు. ప్రఖ్యాత న్యాయనిపుణుడు, మాజీ అటార్నీ జనరల్‌ సోలీ జహంగీర్‌ సోరాబ్జీ(91) శుక్రవారం ఉదయం దిల్లీలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.

1930లో ముంబయిలో జన్మించిన సోరాబ్జీ 1953లో బాంబే హైకోర్టులో న్యాయవాదిగా చేరారు. 1971లో సుప్రీంకోర్టు ఆయనను సీనియర్‌ అడ్వొకేట్‌గా గుర్తించింది. 1989-90, 1998-2004 మధ్య భారత అటార్నీ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. సోరాబ్జీ మానవ హక్కులపై విశేష కృషి చేశారు. 1997లో నైజీరియాలో మానవ హక్కుల పరిస్థితిపై అధ్యయనం కోసం ఐక్యరాజ్య సమితి ఆయనను ప్రతినిధిగా పంపింది. అనంతరం ఐరాస ‘ప్రమోషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ హ్యూమన్‌ రైట్స్‌’ ఉప సంఘానికి ఛైర్మన్‌గా వ్యవహరించారు.

1998-2004 మధ్య ఐరాస నియమించిన ‘ప్రివెన్షన్‌ ఆఫ్‌ డిస్క్రిమినేషన్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ మైనారిటీస్‌’ ఉప సంఘంలో సభ్యుడిగానూ ఉన్నారు. ‘ది హేగ్‌’లోని మధ్యతర్తిత్వ న్యాయస్థానంలో 2000-2006 మధ్య శాశ్వత సభ్యుడిగా కొనసాగారు. కేంద్రంలో ఉన్నది ఏ ప్రభుత్వమైనా ఆయన నిక్కచ్చిగా తన అభిప్రాయాలను వెల్లడించే వారు. వివాదాస్పద నిర్ణయాలపై కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేవారు.

ఆర్టికల్ 370 రద్దుపై ఆయన తన అభిప్రాయాన్ని సూటిగా వ్యక్తం చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయం గొప్పవిషయమేమీ కాదని, ఈ రద్దుతో కశ్మీర్ ప్రజల జీవన స్థితిగతుల్లో ఎలాంటి మార్పులు రావని తన అభిప్రాయాన్ని వెల్లడించి చర్చనీయాంశంగా మారారు. అలాగే రద్దు నిర్ణయం కేవలం రాజకీయ నిర్ణయమేనని వ్యాఖ్యానించారు. ఆ రాష్ట్రానికి చెందిన పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లాలను గృహ నిర్బంధం చేయడం సరికాదని, ఇటువంటి చర్యలు కశ్మీరీ ప్రజల్లో అలజడిని, ఆందోళనను రేకెత్తిస్తాయని మాట్లాడి, హాట్ టాపిక్ గా మారారు.

Also Read : వైఎస్ ప్రభంజనానికి ఎదురొడ్డి గెలిచిన చిట్టబ్బాయి ఇకలేరు

వాజపేయి ప్రభుత్వంలోనూ సొరార్జీ ఏజీగా పనిచేశారు. జెఠ్మలానీ కేంద్ర న్యాయ మంత్రిగా ఉండగా, సోలీ సొరాబ్జీ అటార్నీ జనరల్‌గా ఉన్నారు. అదే సమయంలో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎ.ఎస్.ఆనంద్ ఉన్నారు. కొన్ని న్యాయపరమైన విషయాలపై రామ్ జెఠ్మలానీ, ఎ.ఎస్.ఆనంద్‌ల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. దీని కారణంగా సోలీ సొరాబ్జీతోనూ జెఠ్మలానీకి విభేదాలు పెరిగాయి. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అగాధం ఏర్పడే స్థాయికి ఈ ఉద్రిక్తతలు పెరిగాయి. దీంతో సొరాబ్జీతో కలిసి పనిచేయకూడదనే నిర్ణయానికి జెఠ్మలానీ వచ్చేశారు. ఈ ఉద్రిక్తతలను ఆపేందుకు జెఠ్మలానీని రాజీనామా అడగాలని జస్వంత్ సింగ్‌కు వాజ్‌పేయి సూచించారు. జెఠ్మలానీ కూడా వెంటనే రాజీనామా చేశారు.

వాక్‌ స్వాతంత్ర్యం, భావ ప్రకటనా స్వేచ్ఛకు సంబంధించిన పలు కీలక కేసుల్లోనూ సొరాబ్జీ తన వాదనలు బలంగా వినిపించారు. అందులో భాగంగా అనేక ప్రచురణలపై నిషేధాన్ని ఎత్తివేయించారు. దీనిపై విస్తృత స్థాయిలో అధ్యయనం చేసిన ఆయన ‘లా ఆఫ్‌ ప్రెస్‌ సెన్సార్‌షిప్‌ ఇన్‌ ఇండియా’, ‘ద ఎమర్జెన్సీ, సెన్సార్‌షిప్‌ అండ్‌ ది ప్రెస్‌ ఇన్‌ ఇండియా’ వంటి పుస్తకాలను రచించారు. మనేకా గాంధీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1978), ఎస్‌ఆర్‌ బొమ్మై వర్సెస్ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(1994), బీపీ సింఘాల్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా(2010) వంటి ల్యాం`డ్‌మార్క్‌ కేసుల్లో సోరాబ్జీ తన వాదనలు వినిపించారు. ఆయన సేవల్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2002లో పద్మవిభూషణ్‌తో సత్కరించింది.

Also Read : బొమ్మ‌ల మ‌నిషి చంద్ర‌

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి