iDreamPost
android-app
ios-app

ఆ రాజ‌కీయాలను సొంత పార్టీ నేత‌లే హ‌ర్షించ‌డం లేదు..!

ఆ రాజ‌కీయాలను సొంత పార్టీ నేత‌లే హ‌ర్షించ‌డం లేదు..!

రాజకీయాలు మతం రంగు పులుముకోవ‌డం ద‌శాబ్దాలుగా కొన‌సాగుతున్న‌దే. పార్టీ అధినాయ‌కుల రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌ల‌కు, పిలుపుల‌కు విధ్వంసాలు చోటుచేసుకుంటున్న ఘ‌ట‌న‌లు దేశంలో, రాష్ట్రంలో చాలానే ఉన్నాయి. అయితే, గ‌తంలో పార్టీ అధినాయ‌కుడు చెప్పిందే వేదంగా, కింది స్థాయి నాయ‌కులు జై కొట్టేవారు. ఆయ‌న చెప్పిందే నిజం, చేస్తోందే స‌రైంది అని వాళ్లు కూడా అనుస‌రించేవారు. కానీ, ఇటీవ‌లి కాలంలో మార్పు క‌నిపిస్తోంది. అధినాయ‌కుడి రాజ‌కీయాలు నచ్చ‌క‌పోతే బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్నారు. ఆ బాట‌లోనే అప్పుడు టీడీపీ నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులైన ఫిలిప్ తోచర్ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా ఏపీ స్టేట్ మైనార్టీస్ క‌మిష‌న్ చైర్మ‌న్, టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు జియా ఉద్దీన్ రాజీనామా చేయ‌డం.

ఏపీలో జ‌రిగిన పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం ఘ‌ట‌న‌ల‌కు రాజ‌కీయ రంగు పులుముతూ, తెలుగుదేశం పార్టీ చేసిన రాజ‌కీయాలు తెలిసిందే. ఈ క్రమంలోనే టీడీపీ జాతీయాధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రామతీర్థంను సందర్శించి కాషాయీక‌ర‌ణ జ‌పం చేశారు. ఎప్పుడూ లేనంతగా చంద్రబాబు తొలిసారిగా జైశ్రీరామ్ నినాదాలు చేశారు. అంతేకాదు క్రైస్తవులపై పరోక్ష విమర్శలు చేశారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా దీనిపై చర్చ జ‌రిగింది. ఇక టీడీపీ చేస్తున్న మత రాజకీయాలు నచ్చడం లేదని పేర్కొంటూ ఆ ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా నియమితులైన ఫిలిప్ తోచర్ టీడీపీకి రాజీనామా చేశారు. ఆయ‌న‌తో పాటు వంద‌లాది మంది క్రైస్త‌వ సోద‌రులు ఆ పార్టీకి వ్య‌తిరేకంగా తీర్మానాలు చేశారు. టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఎంతో అభిమానంతో కొనసాగుతున్నానని కానీ, ఈ మధ్య చోటుచేసుకున్న పరిణామాలతో తాని విసుగెత్తిపోయినట్లు ఆ సంద‌ర్భంగా తోచర్ చెప్పారు.

అదిలా ఉండ‌గా, ఎంపీ ర‌ఘురామ రాజు కులాల మధ్య చిచ్చు పెట్టేలా, మతాల మధ్య ఘర్షణలు రేకెత్తించేలా పనిగట్టుకుని మరీ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వంపై విషం చిమ్మి అస్థిరత పెంచేందుకు కుట్ర చేశారు. ముఖ్య మంత్రి జ‌గ‌న్ ను వ్య‌క్తిగ‌తంగా దూషించారు. దీనిపై సీఐడీ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కానీ, ఇది టీడీపీ అధినాయ‌కుడు చంద్ర‌బాబుకు న‌చ్చ‌లేదు. అరెస్టును ఖండించారు. అంత‌టితో ఆగ‌లేదు.. కేంద్రానికి లేఖ‌లు కూడా రాశారు. ఆయ‌న త‌ర‌ఫున ఢిల్లీలో కూడా లాబీయింగ్ చేస్తున్నారు. చంద్ర‌బాబు రాసిన రాత‌లు, చేస్తున్న చేష్ట‌లపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. సొంత పార్టీ నేత‌ల‌కే న‌చ్చ‌లేదు. దీంతో ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు జియా ఉద్దీన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అధికారం కోసం కుల‌, మ‌తాల మ‌ధ్య చిచ్చుపెడుతున్న మీ రాజ‌కీయాలు న‌చ్చ‌కే పార్టీ నుంచి వెళ్లిపోతున్న‌ట్లు జియా ఉద్దీన్ స్ప‌ష్టంగా చెప్పారు. నాడు ఫిలిప్ తోచర్ కూడా అవే వ్యాఖ్య‌లు చేశారు.

వీటిని గ‌మ‌నిస్తే.. త‌మ ప‌బ్బం గ‌డుపుకోవ‌డానికి అధినాయ‌కుడు ఏం చేసినా చెల్లుబాట‌య్యే రోజులు పోయాయ‌ని అర్థం అవుతోంది. స‌రైన రాజ‌కీయాలు చేయ‌క‌పోతే సొంత పార్టీ నేత‌ల నుంచే నిర‌స‌న‌లు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని మ‌రో సారి స్ప‌ష్ట‌మైంది. చంద్ర‌బాబు దుష్ట రాజ‌కీయాలు చేస్తున్న ప్ర‌తీసారీ కొంత మంది నేత‌ల‌ను దూరం చేసుకుంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఇప్ప‌టికైనా పునఃప‌రిశీలించుకుంటారా, లేదా చూడాలి.