iDreamPost
android-app
ios-app

కరీంనగర్‌లో ఈటల వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

కరీంనగర్‌లో ఈటల వర్సెస్‌ టీఆర్‌ఎస్‌

కరోనా విజృంభణ సమయంలోనూ కరీంనగర్‌ జిల్లాలో రాజకీయ కాక రగులుతోంది. ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసినప్పటి నుంచీ జిల్లాలో రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. మొదట్లో ఈటలపై సానుభూతి పవనాలు వీచినా, రానురాను అవి దిశ మళ్లుతున్నాయి. టీఆర్‌ఎస్‌ అధిష్ఠానం ఆదేశాలు మేరకు మంత్రి గంగుల కమలాకర్‌ రంగప్రవేశం చేసి ఈటలకు వ్యతిరేకంగా మద్దతు కూడగడుతున్నారు. మండలాల వారీగా నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ రాజేందర్‌ బలాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఈటలపై వ్యతిరేక స్వరాలు పెరుగుతున్నాయి. దీంతో ఈటల వర్గీయులు కూడా దూకుడు పెంచుతున్నారు.

రెండు వర్గాలుగా టీఆర్‌ఎస్‌

జిల్లాలోని చాలా మండలాల్లో టీఆర్‌ఎస్‌లో వర్గాలు ఏర్పడుతున్నాయి. కొందరు ఈటల రాజేందర్‌ వైపు ఉంటే, మరికొందరు టీఆర్‌ఎస్‌లోనే ఉంటామని చెబుతున్నారు. దీంతో రాజకీయాలు ఉప్పు, నిప్పుగా మారాయి. రెండు వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలే కాదు.. ఏకంగా బాహాబాహీకి కూడా దిగుతున్నారు. ఈ పరిణామాలన్నీ జిల్లాలో రాజకీయ వేడిని పెంచుతున్నారు. సొంత నియోజకవర్గంలోనే తనకు వ్యతిరేక వర్గం తయారుకావడంతో అలర్ట్‌ అయిన ఈటల అప్రమత్తమయ్యారు. తన వర్గాన్ని పెంచుకుంటున్నారు. అవసరమైతే టీఆర్‌ఎస్‌తో గట్టిగానే ఢీ కొట్టండి అంటూ వారికి సూచనలు చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ఢీ అంటే ఢీ

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్‌ వద్ద టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా జమ్మికుంట మార్కెట్‌ చైర్మన్‌ వాల బాలకిషన్‌రావు తన అనుచరులతో కలిసి ప్రెస్‌మీట్‌ పెడుతుండగా ఈటల వర్గీయులు ఆ సమావేశాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో టీఆర్‌ఎస్‌ శ్రేణులు, ఈటల వర్గీయుల మధ్య తోపులాట, వాగ్వాదం జరిగాయి. కరోనా నిబంధనలకు విరుద్ధంగా మధ్యాహ్నం వేళ లాక్‌డౌన్‌ పాటించకుండా ప్రెస్‌మీట్‌ పెట్టడం ఏంటని ఈటల వర్గీయులు ప్రశ్నించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ వర్గీయులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, మాకు ప్రెస్‌మీట్లకు ఉదయం 10గంటలలోపే అనుమతి ఉంటే వారికి టీఆర్‌ఎస్‌ నేతలకు మాత్రం ఎప్పుడైనా సరే సహకరిస్తున్నారని మండిపడ్డారు. వీణవంక మండలంలో టీఆర్‌ఎస్‌ పార్టీ రెండు వర్గాలుగా చీలిపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.