Idream media
Idream media
ఎన్నికలు ముగిశాయి.. ఇప్పట్లో కూడా ఏమీ లేవు.. అందులోనూ ఇప్పుడు ఎక్కడ చూసినా కరోనా కల్లోలమే. ఇక రాజకీయ మాటలు, మంటలు పెద్దగా ఏమీ ఉండవనుకునేలోపు తెలంగాణ రాజకీయాల్లో ఈటల రాజేందర్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. భూ కబ్జా ఆరోపణలతో కీలక సమయంలో ఆరోగ్య మంత్రి పదవి నుంచి ఈటలను తప్పించిన కేసీఆర్ సర్కార్.. రాజకీయ వేడిని రగిల్చింది. దీంతో తెలంగాణ మలిదశ పోరాటంలో ఉద్యమ నాయకుడు సీఎం కెసిఆర్ కు కుడి భుజమై నిలిచి, చివరిదాకా వెంట నడిచి, తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించిన ఈటల రాజేందర్ ప్రభుత్వానికి ఈటెగా మారారు. ఆత్మ గౌరవ పోరాటం పేరుతో కేసీఆర్ పై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటి నుంచీ ఈటల పలువురు రాజకీయ ప్రముఖులతో చర్చలు జరుపుతూ ఉన్నారు. మద్దతు కూడబెట్టుకుంటున్నారు. ఇదంతా కొత్త పార్టీ కోసమా, లేదా ఏదైనా ప్రముఖ పార్టీలో చేరుతున్నారా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
టీఆర్ఎస్ సర్కార్ పై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాజేందర్.. అదే పార్టీ ప్రభుత్వంలో రెండు సార్లు మంత్రి పదవి చేపట్టారు. అలాంటి కీలక నేతపై కబ్జా ఆరోపణలు రాగానే కేసీఆర్ వేటు వేశారు. వేటు పడటం ఆలస్యం లేదు.. ఈటల కూడా కెసిఆర్ పై విమర్శలు చేశారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. వేటు పడ్డ తర్వాత ఈటల తన దూకుడును పెంచారు. వరుసగా ఉద్యమ నేతలు, ఇతర పార్టీ నేతలను ఈటల కలుస్తున్నారు. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ ను గద్దె దించే దిశగా పావులు కడుపుతున్నారు. ఇప్పటికే కొండా విశ్వేశ్వర్ రెడ్డి తో కలిసిన ఈటల.. టీఆర్ఎస్ లోని కీలక నేతలకు గాలం వేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ ఎమ్యెల్యే భట్టి విక్రమార్కను కూడా ఈటల కలిశారు. ఈ సందర్బంగా తెలంగాణ ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై
వారిద్దరూ చర్చించినట్లు సమాచారం. తనకు జరిగిన అన్యాయాన్ని భట్టితో ఈటల చెప్పినట్లు తెలుస్తోంది.
ఇది ఆత్మగౌరవ సమస్య అని, తన విషయంలో దుర్మార్గంగా, అన్యాయంగా వ్యవహరించారని ప్రతి ఒక్కరితోనూ ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు వినిపిస్తున్నారట. సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారట. కరోనా వేవ్ లోనూ ఈటల తన పోరు తీవ్రస్థాయికి తీసుకెళ్లేలా పని చేస్తున్నారు. టీఆర్‌ఎస్‌తో గట్టిగానే ఢీకొట్టేందుకు సమాయత్తం అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రధానంగా ఉద్యమకారులను కలుపుకుని ప్రభుత్వంపై ఆత్మ గౌరవ ఉద్యమానికి శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా త్వరలో టీజేఎస్ అధినాయకుడు కోదండరామ్ ను కూడా కలిసేందుకు ఈటల ప్లాన్ చేస్తున్నారు.