iDreamPost
android-app
ios-app

రాజకీయాల్లోకి ఈటల సతీమణి జమున

రాజకీయాల్లోకి ఈటల సతీమణి జమున

భూ కబ్జా ఆరోపణల నేపథ్యంలో అవమానకరమైన రీతిలో మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ అయిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ సతీమణి జమున రాజకీయాల్లోకి రాబోతున్నారా..? భర్తకు మద్ధతుగా, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఆమె ప్రజా క్షేత్రంలోకి వస్తున్నారా..? ఈటల రాజేందర్‌ మొదలు పెట్టిన తెలంగాణ ఆత్మగౌరవ పోరాటంలో ఆమె కూడా పాల్గొనబోతున్నారా..? అంటే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ సందేహాలకు బలం చేకూరుస్తున్నాయి.

తమను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్‌ ప్రభుత్వం ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతోందని ఈటల రాజేందర్‌ సతీమణి జమున మండిపడ్డారు. సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతికామని, ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని అవమానాలేనంటూ ఆమె వాపోయిన తీరు.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లోకి ఆమె ఎంట్రీకి సూచనగా భావిస్తున్నారు. తెలంగాణ ఉద్యమం కోసం తమ ఆస్తులను అమ్ముకున్నామని, ఉద్యమకారులను జైళ్ల నుంచి విడిపించేందుకు ఎవరు డబ్బులు చెల్లించారో గుర్తు చేసుకోవాలని పరోక్షంగా కేసీఆర్‌ను ఉద్దేశించి అనడంతో ఆమె సీఎం కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకోబోతున్నారని తెలుస్తోంది. బంగారు తెలంగాణ కోసం, తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడేందుకు తమ ఆస్తులను ఆమ్మేందుకైనా సిద్ధంగా ఉన్నామని ఆమె చెప్పడం.. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఈటల కుటుంబం కీలక పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

తమ ఆస్తులు, భూములపై కావాలనే కుట్ర చేస్తున్నారని, ప్రగతి భవన్‌ కేంద్రంగా ఈ కుట్రలు సాగుతున్నాయన్న జమున.. తమ ఆస్తులు, కేసీఆర్‌ కుటుంబ ఆస్తులపై విచారణ సిద్ధమా అంటూ ఆమె బహిరంగంగా సవాల్‌ చేయడం టీఆర్‌ఎస్‌ చర్చనీయాంశమవుతోంది. అధికారులు తప్పుడు నివేదికలు ఇస్తున్నారంటూ కూడా ఆమె మండిపడ్డారు. తాము కొనుగోలు చేసిందాని కంటే ఒక్క ఎకరా ఎక్కువ ఉన్నా ముక్కు నేలకు రాస్తామని ఆమె సవాల్‌ చేయడం, హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని కోరడం తెలంగాణ ప్రజలను ఆలోచింపజేస్తోంది.

తమకు లగ్జరీలు అవసరం లేదని, శ్రమ చేసి బతుకుతామన్న జమున.. ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరింపులకు భయపడేదిలేదని స్పష్టం చేశారు. ఆత్మగౌరవ పోరాటం, ప్రభుత్వ వేధింపులు, బెదరింపులకు భయపడబోమని ఆమె చెప్పడం, ఆత్మగౌరవ ఉద్యమం కోసం ఆస్తులు ఆమ్మేందుకైనా సిద్ధమని ప్రకటించడంతో… జమున రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో తనవంతు పాత్ర పోషిస్తారనే చర్చ సాగుతోంది. ఈటల రాజేందర్‌ రాజకీయ పయనం ఎలా సాగుతుందనే అంశంపై క్లారిటీ వచ్చిన తర్వాత.. తెలంగాణ రాజకీయాల్లో ఈటల ఎపిసోడ్‌ ఆసక్తికరంగా మారే అవకాశం లేకపోలేదు.