iDreamPost
android-app
ios-app

పంపకాలు మొదలెట్టిన ఈటల రాజేందర్‌..!

పంపకాలు మొదలెట్టిన ఈటల రాజేందర్‌..!

దాదాపు 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో అత్యంత క్లిష్టమైన సమయాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ ఎదుర్కొంటున్నారు. ఇన్నాళ్లు సాగిన రాజకీయ జీవితం ఒక ఎత్తు.. ఇకపై సాగబోయే జీవితం మరో ఎత్తు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌ను నుంచి బయటకు వచ్చిన రాజేందర్‌.. హుజురాబాద్‌ ఉప ఎన్నిక రూపంలో టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌కు సవాల్‌ విసిరారు. ఈ ఉప ఎన్నికలో గెలిస్తేనే.. ఈటల రాజేందర్‌ తదుపరి రాజకీయ జీవితం సాఫీగా సాగుతుంది. లేదంటే ఎత్తు పల్లాలు తప్పవు. అందుకే ఉప ఎన్నిక ఎప్పుడు జరుగుతుందనే అంశంపై క్లారిటీ లేకపోయినా.. ఈటల రాజేందర్‌ హుజురాబాద్‌లో ఎన్నికల వాతావరణంలోకి వెళ్లిపోయారు.

నియోజకవర్గంలోని గ్రామాల్లో పర్యటిస్తూ.. ప్రజలను నేరుగా కలుస్తున్నారు ఈటల రాజేందర్‌. ఆ సమయంలో తనదైన శైలిలో పంపకాలను కూడా చేస్తున్నారు. ప్రతి ఇంటికి గోడ గడియారాలను ఈటల రాజేందర్‌ అందిస్తున్నారు. రాజకీయ పుట్టుక, 20 ఏళ్ల ప్రయాణం అంతా టీఆర్‌ఎస్‌ లో సాగగా.. రాజేందర్‌ అంటే కారు గుర్తు అనేలా నిలిచిపోయింది. ఇప్పుడు పార్టీ, గుర్తు మారడంతో.. ప్రజలు తికమక పడకుండా ఉండేందుకు.. తనను, తాను పోటీ చేయబోయే పార్టీని, గుర్తును ఓటర్లు గుర్తుపెట్టుకునేలా.. గోడ గడియారాన్ని రూపొందించారు. కాషాయ రంగు, ఈటల రాజేందర్‌ ఫొటో, బీజేపీ గుర్తు అయిన కమలం ఫొటోను గోడ గడియారంలో పొందుపరిచారు. ఉపయోగకరమైన ఈ గడియారాన్ని ప్రజలు తమ నివాసంలో ఉంచుకుంటారు. నిత్యం సమయం చూస్తుంటారు కాబట్టి.. సహజంగానే ఈటల ఫొటో, కమలం గుర్తు కనిపిస్తుంది. చూడగా చూడగా.. రాజేందర్‌ పార్టీ, గుర్తు ప్రజల మెదళ్లలో నిలిచిపోతుందనేది ఈటల భావన కావచ్చు.

2018 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకూ తెలంగాణలో మూడు ఉప ఎన్నికలు జరిగాయి. హుజురాబాద్‌లో జరగబోయేది నాలుగోది. ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్న ఈ ఉప ఎన్నికను.. అటు టీఆర్‌ఎస్, ఇటు ఈటల రాజేందర్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోబోతున్నారు. ఈటల గెలిస్తే.. కేసీఆర్‌ను సవాల్‌ చేసే నాయకుడుగా రాజేందర్‌ తెలంగాణ సమాజంలో నిలుస్తారు. అదే టీఆర్‌ఎస్‌ గెలిస్తే.. కేసీఆర్‌ను ఎదిరించేందుకు ఎవరూ సాహచించరు. ఇలాంటి సమీకరణాలు ఉన్న నేపథ్యంలో ఇరు పక్షాలు హోరాహోరీగా పోరాడతాయనడంలో సందేహం లేదు. ముఖ్యంగా ఈటల రాజేందర్‌కు ఈ ఎన్నిక.. చావో రేవో లాంటిది. మరి ఇలాంటి ఎన్నిక కోసం ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టిన రాజేందర్‌.. విజయ తీరాలకు చేరుకుంటారా..? లేదా..? వేచి చూడాలి.

Also Read : లోకేష్‌ను లేపేందుకు వారి వాయిస్ నొక్కేస్తున్నార‌ట‌!