Idream media
Idream media
ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ రేపు రాజీనామా చేయనున్నారని శుక్రవారం ఉదయం వార్త వెలువడింది. ఆయన రాజీనామా చేస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం. అందుకు ఆరు నెలల సమయం ఉంటుంది. సాధారణంగా ఉప ఎన్నిక అంటే రాజకీయ పార్టీలు పెద్దగా పట్టించుకోవు. ధీమాగా కార్యాచరణ ప్రారంభిస్తాయి. కానీ ఇక్కడ హుజూరాబాద్ కాబట్టి, ఈటల ఆత్మ గౌరవానికి, ప్రభుత్వ ప్రతిష్ఠకు మధ్య జరుగుతున్న ఎన్నిక కాబట్టి కాస్త దూకుడు ఉండడం సహజమే. అయితే, అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ శుక్రవారం రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయాలను పరిశీలిస్తే ఈ ఉప ఎన్నికను ఇరు పార్టీలూ ఎంత ప్రెస్టేజ్ గా తీసుకున్నాయో అర్థం అవుతుంది.
చెప్పినట్లుగానే ఈటల రాజేందర్ టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవికి ఈరోజు ఉదయం (జూన్ 12న) రాజీనామా చేశారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం మధ్యాహ్నమే రాజీనామాను ఆమోదించేశారు. రాజీనామా పత్రం స్పీకర్ ఫార్మాట్‌లోనే ఉండడంతో ఆమోదానికి అడ్డంకులు కలగలేదు. దీంతో ఈ నెల 14న బీజేపీలో చేరేందుకు రాజేందర్ సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా, ఈటల రాజీనామాకు ముందు రోజు రాత్రే టీఆర్ఎస్, బీజేపీ ఉప ఎన్నికకు సిద్ధమైపోయాయి. నేతలను కూడా సిద్ధం చేశాయి.
ఉప ఎన్నిక ఖాయమని తేలిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌తో మంత్రి గంగుల కమలాకర్ శుక్రవారం రాత్రి భేటీ అయ్యారు. హుజూరాబాద్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి, టీఆర్‌ఎస్ ముఖ్య నేతలు మండలాల వారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాలు, టీఆర్‌ఎస్ శ్రేణుల వైఖరి తదితర అంశాలను సీఎంకు వివరించినట్లు సమాచారం. మండలాల వారీగా సమావేశాలు జరుపుతున్నప్పుడు ప్రజల్లో టీఆర్‌ఎస్ పట్ల కనిపిస్తున్న అభిమానం, ఈటలపై వ్యతిరేకతను కూడా ఆయన వివరించినట్లు తెలిసింది. హుజూరాబాద్‌లో విజయమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో పనిచేయాలని సీఎం సూచించినట్లు సమాచారం.
ఈటల బీజేపీలో చేరేందు ముందే హుజూరాబాద్ నియోజకవర్గంలో మండలాల వారీగా చేపట్టబోయే కార్యక్రమాల రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే టీఆర్‌ఎస్ నాయకులు సిద్ధం చేశారు. మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యేలు వి.సతీశ్, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, నారదాసు లక్ష్మణ్‌రావు, రమేశ్, చల్లా ధర్మారెడ్డి ఐదు మండలాల్లో పర్యటిస్తూ ప్రజలను, కార్యకర్తలను టీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మలుచుకునే పనిలో ఉన్నారు.
మరోవైపు బీజేపీ అధిష్ఠానం కూడా రాత్రికి రాత్రే ఉప ఎన్నిక ప్రణాళికలను సిద్ధం చేసింది. బాధ్యులను కూడా ఎంపిక చేసేసింది. ఈటల ఢిల్లీలో బీజేపీలో చేరిన వెంటనే హుజూరాబాద్‌లో కార్యరంగంలోకి దిగాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులను రంగంలోకి దింపాలని నిర్ణయించారు. శుక్రవారం రాత్రి నియోజకవర్గంలో మండలాల వారీగా బీజేపీ ఇన్‌చార్జీలను నియమించారు. కమలాపూర్‌కు ధర్మపురి అర్వింద్, హుజూరాబాద్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, వీణవంకకు సోయం బాపూరావు, జమ్మికుంట, ఇల్లంతకుంటలకు ఎమ్మెల్యే రాజాసింగ్‌లను నియమించారు. పర్యవేక్షకులుగా బండి సంజయ్, కిషన్‌రెడ్డి వ్యవహరిస్తారు.
.. ఇలా రెండు పార్టీల నాయకులూ ఒకేరోజు.. రాత్రికి రాత్రే భేటీలు కావడం, పలు నిర్ణయాలు తీసుకోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఉప ఎన్నిక ఎప్పుడో ఇంకా తెలీదు. రోజులో, నెలలో కూడా ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. కానీ ఇంత ముందస్తుగా ఆయా పార్టీలు ఎన్నికలకు బాధ్యులను కూడా నియమించాయంటే, ఎన్నికలు ఎలా జరగనున్నాయో అర్థం చేసుకోవచ్చు.
Also Read : ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా.. హుజురాబాద్‌లో మరో వార్