Idream media
Idream media
తెలంగాణ మాజీ మంత్రి, హుజూరాబాద్ శాసన సభ్యుడి పదవికి ఇటీవలే రాజీనామా చేసిన ఈటల రాజేందర్ మరికొద్ది గంటల్లో బీజేపీలో చేరనున్నారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన ఉదయం 11:30కి కాషాయ కండువా కప్పుకోనున్నారు. తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌తో కలిసి ఈటల ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు.
ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ ఛైర్మన్ తుల ఉమ తదితరులు బీజేపీలో చేరనున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినప్పటికే హుజూరాబాద్ లో టీఆర్ ఎస్, బీజేపీ యుద్ధానికి సిద్ధమైపోయాయి. ఇరు పార్టీల నాయకులు హుటాహుటిన సమావేశమై శ్రేణులను సిద్ధం చేశారు. ఇప్పుడు అధికారికంగా రాజేందర్ బీజేపీలో చేరాక ఆయనతో కలిసొచ్చేదెవరు అనేది ఆసక్తిగా మారింది.
ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ తో మాత్రం ఎనలేని అనుబంధం ఉంది. ప్రజల్లో కూడా మంచి పేరే ఉంది. 2004, 2008లో జరిగిన ఉప ఎన్నికలలో కమలాపూర్ నియోజకవర్గం నుంచి రెండు సార్లు విజయం సాధించిన ఈటల ఆ తర్వాత డీలిమిటేషన్ లో భాగంగా2009 లో కమలాపూర్ నియోజకవర్గాన్ని హుజురాబాద్ లో విలీనం చేశారు. 2009, 2011 జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ ఈటల విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014, 2018లో జరిగిన ఎన్నికలలోను ఈటల సునాయాసంగా గెలిచారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పలు పదవుల్లో కొనసాగుతున్న వారిలో అత్యధిక మంది ఈటల అనుచరులే. ఇప్పుడు రాజేందర్ బీజేపీలో చేరడంతో ఆయనతో ఎవరు కలిసి వస్తారో చూడాలి.
కాగా, రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మాజీమంత్రి ఈటల రాజేందర్ తరఫున ప్రత్యక్షంగా ప్రచారం చేస్తానని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు. రూ.వెయ్యి కోట్లు ఖర్చు చేసైనా అక్కడ విజయం సాధించేందుకు టీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ కలసి రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు విప్పేస్థితిలో లేరని, టీఆర్‌ఎస్‌లో కట్టుబానిసత్వం కొనసాగుతోందని అన్నారు. తండ్రీ, కొడుకులను ఎదిరించే వారిని అణచివేస్తు న్నారని, అది ఈటల వ్యవహారంతో బట్టబయలైందని పేర్కొన్నారు. తాను ఇంకా ఏ పార్టీలోకి వెళ్లాలనేది నిర్ణయించుకోలేదని, టీఆర్‌ఎస్‌ను మంత్రి హరీశ్‌రావు వంటి వారికి అప్పగిస్తే మళ్లీ అందులో చేరేందుకు తాను సిద్ధమని ఆయన స్పష్టం చేశారు. సుస్థిరాభివృద్ధిలో ఏపీ 3వ స్థానంలో ఉండగా, తెలంగాణ మాత్రం 11వ స్థానంలో ఉందని తెలిపారు.
రాజేందర్ కు బహిరంగంగా మద్దతు ఇచ్చిన కీలక నేతల్లో ప్రస్తుతానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రమే కనిపిస్తున్నారు. కొందరు సర్పంచ్ లు ఇప్పటికే తమ పదవులకు రాజీనామా చేసి రాజేందర్ కు మద్దతు ప్రకటించారు. అయితే, ఇప్పటికిప్పుడు బహిరంగంగా రాజేందర్ కు మద్దతు ఇవ్వకపోయినా.., మున్ముందు బయటకు వస్తారని ఆయన వర్గీయులు నమ్ముతున్నారు. ఈటల మాత్రం నాయకులను కాకుండా ప్రజలనే నమ్ముకున్నారు. ఈటల పూర్తి స్థాయి బీజేపీ నాయకుడిగా మారిన తర్వాత రాజకీయాలు ఎలా ఉండాయో చూద్దాం.