Idream media
Idream media
ఈటల రాజేందర్ టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన అనంతరం హుజూరాబాద్ లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నిన్న, మొన్నటి వరకూ ఈటలే మా నాయకుడు అన్నవాళ్లు కూడా ఇప్పుడు స్వరం మారుస్తున్నారు. ఈ నెల 14న బీజేపీలో చేరే సన్నాహాల్లో ఈటల ఉండగా, ఆయన సొంత నియోజకవర్గంలోనే ఈటలకు పొగ బెట్టే ప్రయత్నాల్లో టీఆర్ఎస్ ఉంది. అందుకు గతంలో ఈటల అనుచరులుగా పేరున్న వారినే ఎంచుకుంటోంది. వారి ద్వారానే ఆయనపై ఆరోపణలు చేయిస్తోంది.
మంత్రి పదవి నుంచి బర్తరఫ్ అయిన రెండు రోజులకు ఆయన మకాం రాజధాని శివారుకు మార్చిన విషయం తెలిసిందే. అప్పుడు ఏకంగా ఇక్కడి వరకూ వచ్చి ఈటల రాజేందర్ కు మద్దతు పలికిన వారు కూడా ఇప్పుడు యూ టర్న్ తీసుకుంటున్నారు. ఆయన గతంలో టీఆర్ఎస్, కేసీఆర్ కుటుంబంపై చేసిన విమర్శలను తిప్పికొడుతున్నారు. ఈ పరిణామాలన్నీ రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి.
ఈటలను ఆయన అనుచరుల ద్వారానే టీఆర్ఎస్ టార్గెట్ చేయిస్తోంది. రాజేందర్ కు అనుచరుడనే పేరున్న పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు తాజాగా ఈటలపై సంచలన విమర్శలు చేశారు. టీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్తున్న సమయంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు కవిత ,సంతోష్ రావులపై ఘాటు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.
ఈ వ్యాఖ్యలపై పుట్ట మధు స్పందించారు. కవిత ముఖ్యమంత్రి కూతురుగా కాకుండా ప్రజల పక్షాన పని చేస్తున్న నేతగా కృషి చేశారన్నారు. మంథని నియోజకవర్గంలో చీకటి పాలనను అంతమొందించడానికి కవిత చేసిన కృషి మరువలేమన్నారు. సమస్యలపై స్పందించే విధానాన్ని చూసి టిబిజికెఎస్ నేతలు కవితను గౌరవ అధ్యక్షురాలు ఎన్నుకున్నారు. కవితకు సంపూర్ణ మద్దతు ఉంటుందని పుట్ట మధు తెలిపారు. ఆమె నాయకత్వాన్ని అందరూ కోరుకుంటున్నారని పేర్కొంటూ ఆమె సారథ్యంలోనే పనిచేస్తామని పుట్ట మధు తెలిపారు.
ఎంపీ సంతోష్ కుమార్ పార్టీ అభివృద్ధికి తెలంగాణ ఆవిర్భావ కోసం ఎంతో కృషి చేశారని పుట్ట మధు తెలిపారు. ఈటల రాజేందర్ తనపై వచ్చిన ఆరోపణలపై జవాబు చెప్పాలి కానీ టీఆర్ఎస్ పార్టీ నేతలపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజల కోసం పని చేస్తుంటే పదవులు అవే వస్తాయనే విషయాన్ని ఈటల రాజేందర్ గుర్తించాలని పుట్ట మధు వ్యాఖ్యానించారు.
టీఆర్ఎస్ నేతలపై ఈటెల రాజేందర్ చేసిన విమర్శలు తిరిగి వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే హుజూరాబాద్ నియోజకవర్గంలోని 23 గ్రామాల సర్పంచ్ లు కూడా గతంలో ఈటలకు మద్దతు పలికారు. వారిలో కొందరు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ కు రాజీనామా చేయగా, అత్యధిక మంది మాత్రం ఈటలపై విమర్శలు చేస్తున్నారు. మంత్రులు హరీశ్‌రావు, గంగుల వరుస సమావేశాల అనంతరం చాలా మందిలో ఈ మార్పు కనిపిస్తోంది.