Idream media
Idream media
మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజకీయ వ్యవహారాల్లో వేడి పెరుగుతోంది. ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీ పెద్దలను కలవనున్నారు. తన రాజకీయ భవిష్యత్ పై చర్చలు జరపనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే రాజకీయ జీవితాన్ని మరో మలుపు తిప్పే రోజుగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2న ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది.
కేసీఆర్ తో పాటు ఉద్యమంలో కీలక వ్యక్తిగా పేరొందిన ఈటల ఆ రోజున అమరులకు నివాళులు అర్పించి తన కార్యాచరణను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలాఉండగా, ఈటల వ్యవహారాలను నిశితంగా గమనిస్తున్న టీఆర్ఎస్ అధిష్ఠానం కూడా వేగంగా పావులు కదుపుతోంది. ఈటల రాజేందర్ బీజేపీలో చేరితే హుజూరాబాద్ లో జరిగే రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తోంది.
వరుసగా ఫోన్లు
స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలోకి వెళ్లడం ఖాయమైనట్టు తేలడంతో టీఆర్ఎస్ అలర్ట్ అయింది. హుజూరాబాద్ నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ ఎదుర్కోవాలంటే గట్టిగానే ఢీ కొనాలని యోచిస్తోంది. ఆయన ఎమ్మెల్యే గా రాజీనామా చేస్తే, వచ్చే ఉప ఎన్నికలో ఈటలను ఢీకొనే స్థాయి వ్యక్తి కోసం తగిన రీతిలో విచారణలు చేపట్టాలని అధినాయకత్వం మంత్రులకు బాధ్యతలు అప్పగించింది. దీంతో వారు హుజూరాబాద్ నియోజకవర్గంలోని గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఓ మోస్తరు పేరున్న నాయకుల నుంచి బలమైన నేతల వరకూ అందరితోనూ ఫోన్లలో మాట్లాడడం ప్రారంభించారు. ఆయన ఢిల్లీలో రాజకీయాలు నడిపితే, టీఆర్ఎస్ నాయకత్వం హుజూరాబాద్ లో ఈటల కు చెక్ పెట్టేందుకు తగిన విధంగా కసరత్తు చేస్తోంది.
అసంతృప్తులపై కన్ను
2004లో కమలాపూర్ నుంచి, 2009 తరువాత హుజూరాబాద్ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న ఈటలకు ప్రతి గ్రామంతో సంబంధాలున్నాయి. పార్టీ కేడర్‌తో సంబంధం లేకుండా వ్యక్తిగత పరిచయాలు ఎక్కువ. ఈ పరిస్థితుల్లో ఈటలను ఢీకొనే స్థాయి నాయకుడు ఎవరా అని హుజూరాబాద్‌తోపాటు కరీంనగర్ జిల్లాలోనూ చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో ఉన్న నాయకుల కన్నా ఎక్కువగా.. కాంగ్రెస్, బీజేపీకి చెందిన వారి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఈటల ఇప్పుడు బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ పార్టీలోని పెల్లుబికే అసంతృప్తులను టీఆర్ఎస్ అధిష్ఠానం తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది.
ఈటల బీజేపీలోకి.. పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి..?
1994, 1999లో హుజూరాబాద్ టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేసిన పెద్దిరెడ్డి 2004లో కెప్టెన్ లక్ష్మికాంతరావు చేతిలో ఓడిపోయారు. 2009 ఎన్నికల నాటికి ప్రజారాజ్యంలో చేరి హుస్నాబాద్ నుంచి పోటీ చేసి పరాజయం చెందారు. 2014లో టీడీపీ అభ్యర్థిగా రామగుండం నుంచి పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ఈ నేపథ్యంలో 2019లో ఆయన బీజేపీలో చేరారు. హుజూరాబాద్ నుంచి కమలం అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తూ వచ్చారు.
అయితే.. ఈటల బీజేపీలో చేరుతారనే ప్రచారంపై పెద్దిరెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. తనను సంప్రదించకుండా ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించారు. ఈటల బీజేపీలో చేరిన పక్షంలో పెద్దిరెడ్డి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడం ఖాయమనే తెలుస్తోంది. హుజూరాబాద్‌కు చెందిన పెద్దిరెడ్డి అనుయాయుడు పోరెడ్డి శంతన్ రెడ్డితోపాటు ఇద్దరు కౌన్సిలర్లు శోభ, మంజుల మూడు రోజుల క్రితం టీఆర్‌ఎస్‌లో చేరడం ఈ అనుమానాల కు తావిస్తోంది. టీడీపీలో ఉన్నప్పుడు కేసీఆర్‌తో పెద్దిరెడ్డికి ఉన్న సంబంధాలు కూడా ఆయనకు కలిసి వస్తాయని భావిస్తున్నారు. ఈటల ఎపిసోడ్ వెలుగులోకి వచ్చిన నాటినుంచే టీఆర్‌ఎస్ నుంచి పోటీకి పెద్దిరెడ్డి సిద్ధంగా ఉన్నారని వస్తున్న వార్తలను నిజం చేసే పనిలో టీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు.