iDreamPost
iDreamPost
రాజకీయ వర్గాల్లో మహారాష్ట్ర సెమీ ఫైనల్స్ గా చెబుతున్న స్పీకర్ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి రాహుల్ నార్వేకర్ 164 ఓట్లు సాధించారు. విపక్షాల అభ్యర్థి రాజన్ సాల్వికి 107 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఓటింగ్ రిజల్ట్ బట్టి, రేపు ఏం జరగబోతోందో అందరికీ ఓ అంచనా వచ్చేసింది. షిండేకి తిరుగులేదు. ఉద్ధవ్ ఠాక్రేకి ఆశలేదు.
ఏక్నాథ్ షిండే ప్రభుత్వం రేపు తన మెజారిటీని నిరూపించుకోవాలి. కాని ఈరోజే దానికి రిజల్ట్ వచ్చేసింది.
షిండే తిరుగుబాటు చేయడంతో షిండే శిబిరంలోని 16 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయాలంటూ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన వర్గం, సుప్రీంకోర్టులో కేసు వేసింది. అలాంటప్పుడు, మెజారిటీ మార్క్ 137కి తగ్గుతుంది. ఒకవిధంగా ఇది షిండే వర్గానికి మేలు జరిగినట్లే. 16 తక్కువ ఓట్లతో, ఏక్నాథ్ షిండే-దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం మెజారిటీ మార్కును దాటగలదు. ఎందుకంటే దానికి 148 ఓట్లున్నాయి.
శివసేన కోరుకొన్నట్లు మొత్తం 39 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడినా, అధికార కూటమి మ్యాజిక్ నెంబర్‌ను దాటిపోతుందనడానికి నేటి స్పీకర్ రిజల్టే సాక్ష్యం. 39 మంది ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారనే అనుకొందాం. వాళ్లంతా శివసేన సభ్యులేకదా. అప్పుడు మెజారిటీ 125కి తగ్గుతుంది. బీజేపీ ఎమ్మెల్యే నార్వేకర్‌కు 164 ఓట్లు వచ్చాయి. 39 తక్కువ ఉన్నా, షిండే వర్గానికి వచ్చిన సమస్య ఏదీలేదు. ఆయన గుండెలమీద చేయి వేసుకొని ప్రశాంతంగా నిద్రపోవచ్చు. బీజేపీ దెబ్బతీస్తే తప్ప వచ్చే ఎన్నికల వరకు ఆయనే సీఎం!
ఇక, షిండే వర్గంలో చీలికల్లేవ్. కనుక ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి అసెంబ్లీ బలపరీక్షలో గెలిచే ఎమ్మెల్యేలు లేనట్లే. ఇక ఇప్పటిదాకా ఉన్న దింపుడు కళ్లెం ఆశకూడా పోయినట్లే.
ఇంకోసంగతి, ఈ ఎన్నికలో సమాజ్‌వాదీ పార్టీ, ఏఐఎంఐఎం ఎమ్మెల్యేలు ఓటు వేయలేదు. ఒకవేళ రేపు ఓటు వేసినా, ఉద్ధవ్ ఠాక్రేకు వర్గం గెలిచే అవకాశమే లేదు.