iDreamPost
android-app
ios-app

నిమ్మ‌గ‌డ్డ తీరుపై ఉద్యోగుల ఫెడ‌రేష‌న్ ఆగ్ర‌హం

నిమ్మ‌గ‌డ్డ తీరుపై ఉద్యోగుల ఫెడ‌రేష‌న్ ఆగ్ర‌హం

ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ఏం చేసినా అది వివాదాల‌కు దారి తీస్తోంది. ఎటువంటి ఇబ్బందులూ లేకుండా స్థానిక ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్ర‌శాంతంగా సాగిపోతున్న క్ర‌మంలో వాయిదా వేసి విమ‌ర్శ‌ల పాల‌య్యారు. అప్ప‌టితో పోల్చుకుంటే ఇప్పుడే క‌రోనా కేసులు ఎక్కువ‌గా న‌మోదు అవుతున్నాయి. దీనికి తోడు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో ప్ర‌భుత్వం, ఉద్యోగులు నిమ‌గ్న‌మై ఉండ‌గా.. హ‌ఠాత్తుగా ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ విడుద‌ల చేయ‌డం, కోడ్ పేరుతో ప్ర‌భుత్వ‌ సంక్షేమ ప‌థ‌కాల‌కు బ్రేక్ వేయాల‌ని ప్ర‌య‌త్నించ‌డం వంటి కార‌ణాల‌తో మ‌రోసారి వివాదాస్ప‌దంగా మారారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన నేత‌గా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. అయితే ఈ విష‌యంలో నిమ్మ‌గ‌డ్డ జోరుకు హైకోర్టు క‌ళ్లెం వేసింది. ఎన్నిక‌ల షెడ్యూల్ ను ర‌ద్దు చేసింది. ఇదిలా ఉండ‌గా.. కోర్టు తీర్పున‌కు ముందు ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌పై ఉద్యోగుల ప‌ట్ల క‌ఠినంగా ఉన్న నిమ్మ‌గ‌డ్డ మెడికల్‌ లీవ్‌లో వెళ్లిన అధికారిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఇప్పుడు మ‌రో వివాదానికి దారి తీస్తోంది. దీనిపై ఉద్యోగ సంఘాల నుంచి నిర‌స‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇలాంటి చ‌ర్య ఎప్పుడూ చూడ‌లేదు…

రాష్ట్ర ఎన్నికల సంఘం జాయింట్ డైరెక్టర్ జీవీ సాయి ప్రసాద్‍ అనారోగ్య సమస్యలతో నెలరోజులపాటు మెడికల్ లీవు పెట్టారు. సాయి ప్రసాద్‌తో పాటు రాష్ట్ర ఎన్నికల‌ కమిషనర్‌కు పీఎస్‌గా వ్యవహరిస్తున్న అసిస్టెంట్ సెక్రటరీ రామారావు, మరో అసిస్టెంట్ సెక్రటరీ సాంబమూర్తి కూడా లీవ్‌ పెట్టారు. అయితే ముగ్గురు లీవ్‌ పెట్టినప్పటికీ జేడీ సాయి ప్రసాద్‌పైనే నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ఛార్జి మెమో కూడా ఇవ్వకుండా ఏకంగా ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. పదవీ విరమణ బెనిఫిట్స్ కూడా ఇవ్వకూడదన్న ఎస్‌ఈసీ ఉత్తర్వులపై ఉద్యోగ సంఘాలు విస్మయం చెందాయి. ఉద్యోగులను బెదిరించడం ద్వారా పంచాయితీ ఎన్నికలు నిర్వహించడానికే ఈ తరహా ఉత్తర్వులు జారీ చేశారంటూ వాపోతున్నాయి. నిమ్మగడ్డ రమేష్‌ కుమార్ ది చాలా దుర్మార్గ‌మైన చర్యని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్ కే.వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యానించారు. లీవ్ దరఖాస్తు చేసినందుకు డిస్మిస్ చేయడం ఎప్పుడూ చూడలేదని, నిమ్మగడ్డ ఉద్యోగులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నాడో అందరికి తెలుసునని అన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ ఉద్యోగుల మనోభావాలను ఆయన ఎందుకు పరిగణలోకి తీసుకోవడం లేదు. ఎప్పుడు ఎన్నికలు జరపాలి…ఎప్పుడు జరుపుతున్నారు?. ఆయనకు నచ్చిన ప్రభుత్వం ఉంటే ఎన్నికలు అవసరం లేదా. ఇంతటి ఘర్షణ వాతావరణం ఎప్పుడూ లేదు. మేము కూడా ఇలా బయటకు వచ్చి మాట్లాడలేదు. 9 నెలల నుంచి ఉద్యోగులు కరోనాపై పోరాటం చేస్తుంటే ఎందుకిలా చేస్తున్నారు. ఇన్ని రోజులు వదిలేసి ఇప్పుడు మొండి పట్టుదల పడుతున్నారు ఈ రోజు హై కోర్ట్‌కు వెళ్లాము…ఇంప్లీడ్ పిటిషన్ వేశాం. ఎస్‌ఈసీ ఇప్పటికైనా మొండి పట్టుదల వదిలేసి కోవిడ్ వాక్సినేషన్ అయ్యాక ఎన్నికలు పెట్టాల’’న్నారు.