iDreamPost
android-app
ios-app

ప్రధాని మోడీ హత్యకు కుట్ర?

  • Published Apr 01, 2022 | 5:17 PM Updated Updated Apr 01, 2022 | 6:21 PM
ప్రధాని మోడీ హత్యకు కుట్ర?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ హత్యకు ఉగ్రవాద సంస్థలు కుట్ర పన్నాయా?.. ఆయనను హత్య చేస్తామంటూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అందిన ఒక ఈమెయిల్ ఇదే అనుమానాన్ని, ఆందోళనను రేకెత్తిస్తోంది. భద్రతావర్గాల్లో సదరు ఈమెయిల్ కలకలం రేపింది. ప్రధానమంత్రిని హతమార్చడానికి స్లీపర్ సెల్స్ ను రెడీగా ఉంచామని దుండగులు మెయిల్ ద్వారా హెచ్చరించారు. దాంతో అప్రమత్తమైన ఎన్ఐఏ అధికారులు ఆ ఈమెయిల్ ను కేంద్ర హోంశాఖకు, ఇతర అన్ని భద్రతా విభాగాలకు పంపారు. అప్రమత్తమైన హోంశాఖ దీనిపై అత్యున్నత దర్యాప్తుకు ఆదేశించింది.

20 స్లీపర్ సెల్స్ సిద్ధంగా ఉన్నాయి

ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం ఢిల్లీలోని తల్కతోరా స్టేడియంలో పాఠశాల విద్యార్థులతో పరీక్షాపే చర్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే సమయంలో ముంబైలోని ఎన్ఐఏ కార్యాలయానికి ఒక ఈమెయిల్ వచ్చింది. దాన్ని చదివిన అధికారులు ఉలిక్కిపడ్డారు. ప్రధాని మోడీని హత్య చేస్తామని దుండగులు అందులో హెచ్చరించారు. ఆయన్ను హతమార్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. 20 స్లీపర్ సెల్స్ 20 కిలోల ఆర్డీఎక్స్ తో సిద్ధంగా ఉన్నారని, కుట్ర ప్రణాళికను ఆచరణలో పెట్టడమే మిగిలి ఉందని పేర్కొన్నారు. ఈ కుట్ర వివరాలు బయటపడకుండా తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మెయిల్ పంపిన దుండగుడు పేర్కొన్నాడు.

భద్రత కట్టుదిట్టం

బెదిరింపు మెయిల్ ను ఎన్ఐఏ అధికారులు కేంద్ర హోంశాఖకు, మిగతా అన్ని భద్రతా విభాగాలకు పంపారు. సైబర్ సెక్యూరిటీ విభాగం అధికారులు ఐపీ అడ్రస్ ఆధారంగా ఈమెయిల్ పంపిన వారి వివరాలు సేకరించడంలో నిమగ్నం అయ్యారు. మరోవైపు అప్రమత్తమైన హోంశాఖ దీనిపై ఉన్నత దర్యాప్తుకు ఆదేశించింది. ప్రధానమంత్రి భద్రతను పెంచాలని ఆదేశించింది.

సుమారు మూడు నెలల క్రితం ప్రధాని మోడీ పంజాబ్ పర్యటనలో ఫిరోజ్పూర్ జిల్లాలో భద్రతా ఏర్పాట్లలో తలెత్తిన లోపాలు కలకలం రేపాయి. హెలికాప్టర్లో వెళ్లాల్సిన మోడీ భారీ వర్షం కారణంగా చివరి నిమిషంలో రోడ్డు మార్గంలో ప్రయాణించాల్సి వచ్చింది. అయినా సరే ఫిరోజ్ పూర్ ఫ్లై ఓవర్ వద్ద రైతు సంఘాలు ప్రధాని కాన్వాయ్ ని అడ్డుకోవడం.. అరగంట సేపు మోడీ వంతెన మీదే చిక్కుకుని చివరికి వెనుదిరగడం నాడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మళ్లీ ఇప్పుడు బెదిరింపు మెయిల్ రావడం వెనుక ఖాలిస్తానీ, ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.