iDreamPost
android-app
ios-app

ఏలూరు మిస్టరీ వీడేది అప్పుడే : మంత్రి ఆళ్ల నాని

ఏలూరు మిస్టరీ వీడేది అప్పుడే  : మంత్రి ఆళ్ల నాని

పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరు నగరంలో వెలుగులోకి వచ్చిన అంతుచిక్కని వ్యాధి ఏమిటన్నది రేపు శుక్రవారం సాయంత్రానికి తెలుస్తుందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. విజయవాడలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి ఆళ్ల నాని.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. డబ్ల్యూహెచ్‌వో, కేంద్ర సంస్థలైన సీసీఎంబీ, ఐసీఎంఆర్, ఢిల్లీ ఎయిమ్స్‌ తదితర సంస్థల తమ తుది నివేదికను రేపు సాయంత్రానికి ఇవ్వనున్నట్లు మంత్రి చెప్పారు. తుది నివేదిక వచ్చిన తర్వాతే వింత వ్యాధి రావడానికి గల కారణాలు తెలుస్తాయని పేర్కొన్నారు.

ప్రాథమిక నివేదిక ఆధారంగా ఒక నిర్థారణకు రాలేమని మంత్రి నాని పేర్కొన్నారు. తుది నివేదిక రాకుండానే ఊహాగానాలు వ్యాపింపజేయడం సరికాదన్నారు. నివేదికలతో పని లేకుండా బాధితులకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని చెప్పారు. దీని ఫలితంగా బాధితులు గంటల వ్యవధిలోనే కోలుకుని ఇళ్లకు వెళుతున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 592 మంది ఈ వింత వ్యాధి లక్షణాలతో ఆస్పత్రులకు వచ్చారని, ప్రస్తుతం 45 మంది ఏలూరు ఆస్పత్రిలోనూ, 23 మంది విజయవాడ ఆస్పత్రిలోనూ చికిత్స తీసుకుంటున్నారని చెప్పారు. మిగతా వారు కోలుకుని ఇళ్లకు వెళ్లారని తెలిపారు. చికిత్స తీసుకుంటున్న వారిలోనూ అధిక మంది డిశ్చార్జి అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. విజయవాడలో చనిపోయిన ఇద్దరు ఈ వింత వ్యాధి వల్ల కాదని మంత్రి తెలిపారు. విజయవాడలో చికిత్స తీసుకుంటున్న 23 మందిలో ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయని, వాటికి చికిత్స అందించిన తర్వాత వారిని కూడా డిశ్చార్జి చేస్తామని చెప్పారు.

ప్రాథమిక నివేదికల్లో తాగునీటిలో ఇకోలి, కలుషితం అయినట్లు నిర్థారణ కాలేదని మంత్రి తెలిపారు. తుది నివేదిక వచ్చే వరకూ ఊహాగానాలు వ్యాపింపజేయరాదని మంత్రి కోరారు. తుది నివేదిక వచ్చిన తర్వాత వ్యాధి గల కారణాలను తెలుసుకుని, భవిష్యత్‌లో మళ్లీ రాకుండా చర్యలు చేపడతామని నాని చెప్పారు. నగరంలోని 22 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులను పరిశీలించామని తెలిపారు. ఏలూరులో ఎలాంటి పరిస్థితి అయినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. కేసులు వచ్చే చోట 67 మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చేశామని, 30 అంబులెన్స్‌లు సిద్ధంగా ఉంచామని నాని వెల్లడించారు.