iDreamPost
android-app
ios-app

ఏపీలో మళ్లీ స్థానిక ఎన్నికల హడావుడి..

ఏపీలో మళ్లీ స్థానిక ఎన్నికల హడావుడి..

ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ ఎన్నికల కోలాహలం నెలకొంది. దాదాపు నాలుగు నెలల తర్వాత ఏలూరు కార్పొరేషన్‌ ఫలితాలు వెల్లడికాబోతున్నాయి. ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కాబోతోంది. ఏలూరు సమీపంలోని సీఆర్‌ రెడ్డి కాలేజీలో ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఏడాది మార్చి 10వ తేదీన రాష్ట్రంలో మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. కోర్టు ఆదేశాలతో ఏలూరు కార్పొరేషన్‌ ఓట్ల లెక్కింపు నిలిచిపోయింది. విచారణ తర్వాత అన్ని అంశాలను పరిశీలించిన కోర్టు ఓట్ల లెక్కింపునకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

కార్పొరేషన్‌ పరిధిలో 50 డివిజన్లు ఉండగా.. మూడు డివిజన్లు ఏకగ్రీవయమ్యాయి. మిగతా 47 డివిజన్లకు పోలింగ్‌ జరిగింది. నాలుగు నెలలుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆ చింత ఈ రోజుతో తీరిపోనుంది. ఓట్ల లెక్కింపునకు 47 టేబుళ్లు ఏర్పాటు చేశారు. రెండు రౌండ్లలో లెక్కింపు పూర్తి చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల కల్లా తుది ఫలితం వెలువడేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.

గ్రామ పంచాయతీల విలీనం, ఓట్లర్ల జాబితాలో అవకతవకలు, డివిజన్ల పునర్విభజన అంశాలపై వివాదాలు నెలకొనడంతో ఎన్నికలను నిలిపివేయాలని పలువురు కోర్టును ఆశ్రయించారు. ఫలితంగా ఎన్నికలు జరుగుతాయా..? లేదా..? అనే ఉత్కంఠ నాడు నెలకొంది. వ్యయ, ప్రయాసలకొర్చి ప్రచారం చేసిన అభ్యర్థుల్లో నెలకొన్న ఆందోళనలను తొలగించేలా ఎన్నికలకు ఒక్క రోజు ముందు మార్చి 9వ తేదీన పోలింగ్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఫలితాలను తుది తీర్పునకు లోబడి వెల్లడించాలని ఆదేశాలు జారీ చేసింది.

మార్చి 10వ తేదీన జరిగిన మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు 14వ తేదీన వెల్లడయ్యాయి. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు గాను టీడీపీ కేవలం తాడిపత్రి మున్సిపాలిటీని మాత్రమే గెలుచుకోగలిగింది. మిగతా అన్ని చోట్లా వైసీపీ జెండా రెపరెపలాడింది. భారీ మెజారిటీతో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైసీపీ పాగా వేసింది. పలు కార్పొరేషన్లలో టీడీపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమైంది. పలు మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో ఖాతానే తెరవలేదు. ఈ ఫలితాల నేపథ్యంలో ఏలూరులో కూడా వైసీపీ హవానే సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష టీడీపీ కూడా ఏలూరుపై ఆశలు పెట్టుకోలేదు. వైసీపీ ఎన్ని డివిజన్లు గెలుచుకుంటుందనేదే ఆసక్తికర అంశం.

Also Read : ఏలూరు కార్పొరేషన్‌: ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌