Idream media
Idream media
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఒకేసారి 14 శాసన మండలి ఖాళీలు భర్తీ జరగబోతున్నాయి. 58 స్థానాలు గల ఆంధ్రప్రదేశ్ శానన మండలిలో 3 స్థానాలు ఎమ్మెల్యే కోటాలోనూ, 11 స్థానాలు స్థానిక సంస్థల కోటాలోనూ ఆరు నెలలుగా ఖాళీగా ఉన్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఎమ్మెల్యే కోటా స్థానాలు, పరిషత్ ఎన్నికలు వాయిదా పడుతూ రావడంతో.. స్థానిక సంస్థల కోటాలోని ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు విఘాతం ఏర్పడింది. అయితే గత నెలలో దేశ వ్యాప్తంగా అసెంబ్లీ, లోక్‌సభ ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడం, కోర్టు తీర్పుతో పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతో.. శాసన మండలిలోని 14 ఖాళీల భర్తీకి మార్గం సుగమమైంది.
అన్ని సీట్లు వైసీపీకే..
స్థానిక సంస్థల కోటాలో విశాఖ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో రెండేసి చొప్పన, విజయనగరం, తూర్పుగోదావరి, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పన ఖాళీలు ఉన్నాయి. శాసన సభలోనూ, స్థానిక సంస్థల్లోనూ వైసీపీకి తిరుగులేని మెజారిటీ ఉండడంతో భర్తీ చేయబోయే 14 ఎమ్మెల్సీ స్థానాలు వైసీపీకే దక్కబోతున్నాయి. ఇందులో ఎలాంటి సమీకరణాలకు, ఓటింగ్‌కు అవకాశం లేదు. పోటీ చేసే ఆలోచన కూడా తెలుగుదేశం పార్టీ చేసే అవకాశం లేదు.
Also Read : రెండున్నరేళ్ల జగన్ పాలన – సమాజం కేంద్రంగా జరుగుతోన్న అభివృద్ధి ఇదే
ఎంపిక సులువు..
ఉప ఎన్నికలు ముగిసేలోపు మండలి స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ సీట్లు ఎవరెవరికి ఇవ్వాలన్న అంశంపై వైసీపీ నాయకత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. అయితే ఇటీవల రాష్ట్ర, జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు భర్తీ చేయడం, తాజాగా జిల్లా పరిషత్ పాలక మండళ్లు ఏర్పడడంతో.. వైసీపీలోని ముఖ్యనేతలందరికీ పదవులు దక్కాయి. పార్టీలో ఆది నుంచి ఉంటూ పని చేస్తున్న వారికి, ఎన్నికల్లో వివిధ సమీకరణాల నేపథ్యంలో పోటీకి దూరంగా ఉన్న వారికి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి.. నామినేటెడ్ పదవులు దక్కాయి.
నామినేటెడ్ పదవుల భర్తీలో అన్ని జిల్లాలకు సీఎం వైఎస్ జగన్ సమప్రాధాన్యతనిచ్చారు. ఫలితంగా ఎమ్మెల్సీ ఆశావాహుల జాబితా తగ్గిపోయింది. దీంతో ఎమ్మెల్సీ సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం వైసీపీకి నల్లేరు మీద నడకే. గత ఎన్నికల్లో టిక్కెట్ ఆశించి దక్కని వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని సీఎం వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సమయంలో చెప్పారు. హామీలు అమలు చేయడంతోపాటు పార్టీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వైసీపీ అధినాయకత్వం ఎమ్మెల్సీ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉంది.
Also Read : ‘స్వేచ్ఛ’తో తన సంకల్పాని మరోసారి చాటిన జగన్