iDreamPost
iDreamPost
దేనికైనా సమయం కలిసి రావాలి అంటుంటారు పెద్దలు.. ఇప్పుడు కోడిగుడ్డుకు సమయం కలిసొచ్చింది. దీంతో వినియోగదారులకు కష్టమే అయినప్పటికీ ఉత్పత్తిదారులకు మాత్రం కాసులు మిగులుస్తోంది. ప్రస్తుతం కోడిగుడ్డ ఆరు రూపాయలు ధర పలుకుతూ, రికార్డు సృష్టించింది. ఇటీవలి కాలం వరకు రూ. 3–5ల మధ్య ఊగిసలాడే కోడిగుడ్డ ధర ఒక్కసారిగా ఆరు రూపాయలకు చేరడంతో ఉత్పత్తిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే సామాన్యుడికి పోషకాలు అందించడం కీలకం అయిన గుడ్డు ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో జనం మాత్రం ఇబ్బంది పడుతున్నారు.
భారీగా పెరిగిన వినియోగం..
కోవిడ్ 19 నేపథ్యంలో ప్రొటీన్ ఫుడ్‌కు ప్రాధాన్యం పెరిగింది. వైద్య నిపుణుల సూచనల మేరకు రోగ నిరోధకశక్తిని పెంపొందించుకోవడంలో గుడ్డు కీలకం అన్నది సామాన్యులకు కూడా అర్ధమైంది. లాక్డౌన్ ప్రారంభంలో ధరలు అథఃపాతాళానికి పడిపోయినప్పటికీ ప్రస్తుతం పుంజుకోవడానికి ఇదే కారణమైందన్న భావన వ్యక్తమవుతోంది.
సాధారణంగా గుడ్ల వినియోగంతో పోలిస్తే ప్రస్తుత వినియోగం రెట్టింపుకంటే పైమాటే పెరిగిందన్న అంచనాలున్నాయి. మరోవైపు పౌష్టికత పెంచే కార్యక్రమాల్లో భాగంగా చిన్నారులకు అంగన్‌వాడీ సెంటర్ల ద్వారా కోడిగుడ్లను ఇళ్ళకే అందజేస్తోంది. ఒక పక్క సామాన్యుల నుంచి డిమాండ్‌పెరగడం, మరో పక్క ప్రభుత్వ సేకరణ వెరసి కోడిగుడ్ల ధరలు పెంపుదలకు తోడ్పడుతున్నాయని వ్యాపారులు అభిప్రాయపడుతున్నారు.
ఒక అంచనా ప్రకారం దేశంలో గుడ్ల వినియోగం గత పదేళ్ళ కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే 34బిలియన్లు నుంచి ప్రస్తుతం 106 బిలియన్ల చేరిందని నివేదికలు చెబుతున్నాయి. అంటే దాదాపు దేశ వ్యాప్తంగా కూడా రెండు రెట్లకుపైగా గుడ్ల వినియోగం పెరిగినటై్టంది. ఇది మున్ముందు మరింతగా పెరిగుతుందని పౌల్ట్రీ సంబంధిత సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు కోడిగుడ్డు మాంసాహారమా?, శాఖాహారమా? అన్న చర్చ ఇంతకు ముందే తలెత్తింది. ఇది పూర్తిగా తేలనప్పటికీ పలువురు శాఖాహారులు కూడా కోడిగుడ్లను తినేందుకు మొగ్గుచూపారు. వినియోగం పెరగడంలో ఇది కూడా కీలకమేనని చెబుతున్నారు. పౌల్ట్రీ ఉత్పత్తుల్లో అగ్రస్థానంలో ఉన్న మొదటి అయిదు రాష్ట్రాల్లో ఏపీ కూడా ఒకటి. ప్రతియేటా దేశ వ్యాప్తంగా ఆరుశాతం గ్రోత్‌తో పౌల్ట్రీ పరిశ్రమ ముందుకు సాగుతోంది.