iDreamPost
iDreamPost
ఎన్నికలు జరిగి నాలుగు నెలలు దాటినా పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి చల్లారకపోగా మరింత రాజుకుంటోంది. దాన్ని బొగ్గు కుంభకోణం మరింత ఆజ్యం పోసి మంటలు రాజేస్తోంది. ఏడాది క్రితం నాటి బొగ్గు కొంభకోణం కేసును ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మళ్లీ తిరగదోడుతోంది. ఈడీ అధికారులు దర్యాప్తు పేరుతో రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు సమన్లు పంపడంతో అధికార టీఎంసీ, బీజేపీ మధ్య ఆరోపణల నిప్పులు చెలరేగుతున్నాయి. ఈ కేసులో సీఎం మమత మేనల్లుడు అభిషేక్ పాత్ర ఉందని ఈడీ ఆరోపిస్తుంటే.. రాజకీయంగా తమను ఎదుర్కోలేని కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని మమతా బెనర్జీ ఆరోపిస్తున్నారు.
బొగ్గు నిక్షేపాలు మాయం
పశ్చిమ బెంగాల్లోని కునుస్తోరియా, కాజోరా, అసన్సోల్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సంస్థకు చెందిన రూ. 1352 కోట్ల విలువైన బొగ్గు నిక్షేపాలు మాయమైన ఉదంతంపై సీబీఐ గత ఏడాది నవంబరులో ఎఫైఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈడీ అధికారులు నిధుల దుర్వినియోగ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేశారు. వారిలో ఒకరు తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకుడు వినయ్ మిశ్రా సోదరుడు వికాస్ మిశ్రా కాగా రెండో వ్యక్తి మాజీ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్ మిశ్రా. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన కొందరు పెద్దల తరఫున మిశ్రా సోదరులకు బొగ్గు మాఫియా నుంచి రూ. 730 కోట్లు అందాయన్నది ఈడీ ఆరోపణ. ఆ మేరకు మే నెలలో వారిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.
మమత మేనల్లుడు, టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి వినయ్ మిశ్రా కుడిభుజంలా వ్యవహరించేవాడని ఈడీ పేర్కొంది. తాము స్వాధీనం చేసుకున్న పలు డాక్యుమెంట్ల ప్రకారం మాఫియా నుంచి అందిన నిధులను లండన్, థాయ్ ల్యాండ్లలోని అభిషేక్ సన్నిహిత బంధువుల ఖాతాల్లోకి బదిలీ చేసేవారని ఈడీ వెల్లడించింది.
కేసు విచారణలో భాగంగా అభిషేక్ బెనర్జీ, ఆయన సతీమణి రుజిరా తోపాటు పలువురు ఐపీఎస్ అధికారులు, ఒక న్యాయవాదికి ఈడీ సమన్లు జారీ చేసింది. సెప్టెంబర్ ఆరో తేదీన విచారణకు రావాలని అభిషేక్ ను, ఒకటో తేదీన విచారణకు రావాలని రుజిరాను ఆదేశించింది. కాగా గతంలో సీబీఐ కూడా రుజిరాను ప్రశ్నించింది. తాజా సమన్లతో రాజకీయం మళ్లీ రగులుకుంది.
బొగ్గు మాఫియాతో బీజేపీ బంధం
తమపై ఈడీ చేస్తున్న ఆరోపణలను ఎంపీ అభిషేక్ బెనర్జీ ఖండించారు. సమన్లు జారీ చేయడాన్ని తప్పుపట్టారు. మరోవైపు సీఎం మమతా బెనర్జీ దీన్ని తమపై జరుగుతున్న రాజకీయ దాడిగా అభివర్ణించారు. తమను రాజకీయంగా ఎదుర్కోలేని కేంద్రం.. దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ఈ చర్యను సమాఖ్య వ్యవస్థపై కేంద్రం జరుపుతున్న దాడిగా పేర్కొన్నారు.
వాస్తవానికి బొగ్గు మాఫియాతో బీజేపీ నేతలకే సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు బొగ్గు మాఫియాకు చెందిన హోటళ్లలో బస చేశారన్నారు. కేంద్రం తమపైకి ఈడీని ఉసిగొల్పితే.. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా తమ వద్ద ఉన్న సాక్ష్యాధారాలను బయటపెడతామని మమత హెచ్చరించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు మమత ప్రయత్నిస్తున్న తరుణంలో బొగ్గు రూపంలో రాజకీయ మంటలు అంటుకోవడం విశేషం.