Idream media
Idream media
టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు ఇళ్లు, కార్యాలయాల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కొనసాగుతుండడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికార పార్టీకి చెందిన ఎంపీ కావడంతో ఈ సోదాలు చర్చనీయాంశంగా మారాయి. నామాకు చెందిన హైదరాబాద్ మధుకాన్ గ్రూప్ కంపెనీ ఆఫీసుల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది. హైదరాబాద్‌లో ఐదు ప్రాంతాల్లో ఏక కాలంలో ఈడీ దాడులు నిర్వహిస్తోంది. రుణాల పేరుతో బ్యాంకులను మోసం చేసినట్టు ఆరోపణలు వచ్చాయి.. అంతేకాదు రూ.వెయ్యి కోట్లకు పైగా రుణాలు పొందినట్టు అభియోగాలు ఉన్నాయి. విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారని అభియోగాలు ఉన్నాయి.
దాదాపు రూ.1064 కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ముమ్మర సోదాలు జరుగుతున్నాయి. నామా ఇంట్లో, ఆఫీసులోనూ సోదాలు చేస్తున్నారు ఈడీ అధికారులు. మధుకాన్ కంపెనీ పేరుతో పలు బ్యాంకుల్లో భారీగా లోన్స్ తీసుకున్నారు నామా. పలు విదేశీ కంపెనీలకు డబ్బులు మళ్లించారన్న అభియోగాలు ఉన్నాయి. మధుకాన్ డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. రాంకీ ఎక్స్‌ప్రెస్ హైవే ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో తీసుకున్న రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై తనిఖీలు జరుగుతున్నాయి. ఆ సంస్థల బ్యాంకు ఖాతాలు, డాక్యుమెంట్లు, కాంట్రాక్టులకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నట్లు సమాచారం. అధికార పార్టీ ఎంపీ ఆస్తులపై ఈడీ సోదాలు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. నామాతో పాటు రాంచీ ఎక్స్‌ప్రెస్‌వే సీఎండీ కె. శ్రీనివాస్, కంపెనీ డైరెక్టర్లు సీతయ్య, పృథ్వీ తేజ నివాసాల్లోనూ ఈడీ సోదాలు చేస్తోంది.
ఈ సోదాల వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని కాచుకుని కూర్చున్న బీజేపీ కీలక నేతలపై కన్నేసింది. దానిలో భాగంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన బడా కాంట్రాక్టర్.. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మంచి అనుచరగణం, అభిమానులున్న నేతగా పేరున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి ని కూడా గతంలో తమ వైపు లాక్కునేందుకు కమలం నేతలు శతవిధాలా ప్రయత్నాలు చేశారు.
రాజ్యసభ స్థానం కోసం ఎదురు చూసిన పొంగులేటికి ఆ పదవి దక్కకపోవడంతో ఆయన పార్టీ మారతారని అనుచరగణం ప్రకటిస్తూ వచ్చింది. పొంగులేటిని టీఆర్ఎస్ పక్కకు నెట్టడంతో కమలదళం పార్టీలోకి లాగేందుకు శతవిధాలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఢిల్లీ పెద్దలు కూడా రంగంలోకి దిగి మంతనాలు జరిపారు. తమ పార్టీలో చేరితే మంచి భవిష్యత్ కల్పిస్తామని, తనతో పాటు జిల్లాలోని తన అనుచరులకు కూడా సీట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పొంగులేటితో పాటు మరో సీనియర్ నేత కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇదే జిల్లాకు చెందిన పువ్వాడ అజయ్ కు, పొంగులేటికి మధ్య వివాదాలు కూడా ఈ ప్రచారానికి ఊతం ఇచ్చాయి. అనూహ్యంగా టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇద్దరూ వేదికను పంచుకున్నారు. ఆ తర్వాత పార్టీని వీడేది లేదని పొంగులేటి ప్రకటన ఇవ్వడంతో కమలం ఆశ నిరాశైంది.
అదలా ఉంటే, తెలంగాణ రాజకీయాల్లో నామా నాగేశ్వర్‌రావు బలమైన నేత. కుల, వర్గ పరంగానూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పట్టున్న నేత. టీఆర్ఎస్ లో కూడా కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అతనిపై దాడుల పేరుతో ఉచ్చు బిగుస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు రూ.1064 కోట్ల బ్యాంక్ కుంభకోణం ఆరోపణలతో ఆయన ఇల్లు, ఆఫీసుల్లో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఆరోపణలు రుజువైతే నామా కేసుల్లో ఇరుక్కునే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే వాటి నుంచి బయటపడేందుకు జాతీయ స్థాయిలో చక్రం తిప్పే పార్టీ అండ అవసరం. దీంతో ఆయన ఇంట్లో సోదాలు జరుగుతున్న క్రమంలో.. పార్టీ మారిపోతే సరి అన్న వార్తలు హల్ చల్ చేస్తుండడం గమనార్హం.
Also Read : మాజీ కాబోతున్న బీద రవిచంద్ర .. టీడీపీలో కలవరం..!