iDreamPost
android-app
ios-app

ఐశ్వ‌ర్యరాయ్ కి ఈడీ స‌మ‌న్లు : బీజేపీ పై అత్త జ‌యాబ‌చ్చ‌న్ ఫైర్‌

ఐశ్వ‌ర్యరాయ్ కి ఈడీ స‌మ‌న్లు : బీజేపీ పై అత్త జ‌యాబ‌చ్చ‌న్ ఫైర్‌

“మీ ప్ర‌భుత్వానికి రోజులు ద‌గ్గ‌ర ప‌డ్డాయి. త‌మ కుటుంబంపై అనుచిత వ్యాఖ్య‌లు చేస్తారా? కుటుంబ స‌భ్యుల పేర్ల‌తో మాట్లాడ‌తారా.. వ్య‌క్తిగ‌తంగా మాట్లాడితే ఊరుకునేది లేదు” అంటూ రాజ్యసభలో స‌మాజ్ వాదీ పార్టీ ఎంపీ జయాబచ్చన్ బీజేపీపై విరుచుకుప‌డ్డారు. స‌భ‌లో ఐశ్వర్యరాయ్ పేరు ఎత్త‌డంతో కేంద్ర ప్ర‌భుత్వానికి శాపనార్థాలు పెట్టారు. జ‌యాబ‌చ్చ‌న్ వీరావేశానికి స‌భ మొత్తం నిశ్శ‌బ్దంగా మారిపోయింది. ఎంపీలంద‌రి చూపూ ఆమెపైనే.

జ‌యాబ‌చ్చ‌న్ కోపానికి కార‌ణ‌మిదే..

పనామా పేపర్స్‌ కేసు లో ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ ఐశ్వ‌ర్యరాయ్ కు నోటీసులు జారీ చేసింది. ఈ మేర‌కు ఆమె విచార‌ణ‌కు హాజ‌రైంది. ఓవైవు ఢిల్లీలో విచార‌ణ కొన‌సాగుతుండ‌గా.. మ‌రోవైపు దీనిపై రాజ్య‌స‌భ‌లో దుమారం రేగింది. ఈ కేసు అంశాన్ని రాజ్యస‌భ‌లో లేవ‌నెత్తుతూ బీజేపీ ఎంపీలు ఐశ్వ‌ర్యరాయ్ కు దీంట్లో సంబంధం ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. దీంతో జ‌యాబ‌చ్చ‌న్ ఒక్క‌సారిగా ఆగ్ర‌హానికి గుర‌య్యారు. తన కోడలిని ఈడీ విచారిస్తుండగానే రాజ్యసభలో బీజేపీపై విరుచుకుపడ్డారు. బీజేపీకి త్వరలోనే చెడ్డరోజులు రాబోతున్నాయని జోస్యం చెప్పారు. తన కుటుంబంపై బీజేపీ ఎంపీలు అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. విపక్షాలు మాట్లాడకుండా కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జయబచ్చన్‌. తనను బీజేపీ ఎంపీలు వ్యక్తిగతంగా టార్గెట్‌ చేయడం మంచిది కాదన్నారు.

ప‌నామా కేసు పూర్వాప‌రాలేంటంటే..

పనామా దేశానికి చెందిన మొసాక్‌ ఫోన్సెకా అనే కార్పొరేట్‌, న్యాయ సేవల సంస్థ దేశదేశాల్లో నెలకొల్పిన వేలాది డొల్ల కంపెనీల బాగోతాన్ని 2016లో ఐసీఐజే బయటపెట్టింది. ఆయా సంస్థ‌లు వేలాది కోట్లు న‌ల్ల‌ధ‌నాన్ని కూడ‌బెట్టాయ‌ని తెలిపింది. ఈ వ్యవహారంపై అప్ప‌ట్లో పెద్ద దుమారం రేపింది. పలువురు ప్రముఖులపై కూడా కేసులు న‌మోద‌య్యాయి. 136 కోట్ల డాలర్ల అక్రమ ధనాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా. దేశవిదేశాల్లోని రాజకీయ నాయకులు, కార్పొరేట్‌ అధిపతులు, సినీరంగానికి చెందిన వారు అక్రమ ధనాన్ని రహస్య ఖాతాల్లోకి మ‌ళ్లించిన వైనం వెలుగులోకి వ‌చ్చింది. ఈ కేసులో మన దేశానికి చెందిన ప్రముఖుల పేర్లు ఉండడంతో మనీలాండరింగ్ కింద ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో భారత్‌కు చెందిన 500 మందికి ప్రేమయం ఉన్నట్టు సమాచారం.

ఇందులో అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్‌తో సహా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు. వీరంతా పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే తాను భారతీయ నిబంధనల ప్రకారమే విదేశాలకు డబ్బు పంపినట్టు అమితాబ్ బచ్చన్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పనామా పేపర్స్‌లో కనిపించిన కంపెనీలతో తమకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ఇప్పుడు ఇదే కేసులో అభిషేక్, ఐశ్వర్య రాయ్‌లను ఈడీ విచారిస్తుండటం ఆసక్తికరంగా మారింది.

ఐశ్వ‌ర్య‌కు గ‌తంలోనే స‌మ‌న్లు

పనామా పేపర్స్‌ కేసు ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపగా, ఒక్కో పేరు బయటకి వస్తోంది. తాజాగా బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్‌కి నోటీసులు జారీ చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. ఐశ్వర్యరాయ్‌ విచారణకు రావాలని గతంలోనే సమన్లు జారీ చేశారు ఈడీ అధికారులు. అయితే అప్పుడు ఐశ్వర్యరాయ్‌ వాయిదా కోరింది. కొన్ని రోజులు సమయం కావాలని కోరడంతో ఇప్పటి వరకు వాయిదా పడింది. తాజాగా ఢిల్లీలోని జామ్‌నగర్‌లో ఉన్న ఈడీ కార్యాలయంలో అధికారుల ఎదుట విచార‌ణ‌కు హాజరయ్యారు ఐశ్వర్యరాయ్‌. దీంతో ఈ కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. విదేశాల్లో నల్లధనం దాచుకున్న విషయంపై ఐశ్వర్యరాయ్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారు. తన ఖాతాల నుంచి విదేశాలకు డబ్బు మళ్లింపుపై ఈడీ అధికారులకు ఐశ్వర్యరాయ్ వివ‌ర‌ణ ఇచ్చిన‌ట్లు తెలిసింది. ఫేమా చట్టం ఉల్లంఘించడంపై ఈడీ అధికారులు ప్రశ్నించిన‌ట్లు స‌మాచారం. ఈ కేసులో ఇంకెంత మంది ప్ర‌ముఖుల‌ను ఈడీ ప్ర‌శ్నిస్తార‌నేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.