iDreamPost
android-app
ios-app

జీడీపీ అభివృద్ధి భారీగా ఉంటుంది- ఎకనామిక్ సర్వే

  • Published Jan 31, 2022 | 8:36 AM Updated Updated Mar 11, 2022 | 10:20 PM
జీడీపీ అభివృద్ధి భారీగా ఉంటుంది- ఎకనామిక్ సర్వే

కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనామిక్ సర్వే వివరాలు వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటుని భారీగా అంచనా వేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9.2 శాతం ఉంటుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాది కూడా 8 నుంచి 8.5 శాతం వరకూ ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఇటీవల నియమితులైన అనంత నాగేశ్వరన్ తొలి ఆర్థిక అంచనాల నివేదిక ఇదే కావడం విశేషం. భారీగా అంచనాలు ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలకు ముందు ఎకనామిక్ సర్వే విడుదల చేస్తుంది. వివిధ రంగాలలో అభివృద్ధి అంచనాలను ప్రస్తావిస్తుంది. దేశ ఆర్థిక పరిస్థితికి అద్దంపట్టే నివేదికగా దానిని భావిస్తారు. దానికి తగ్గట్టుగా ఈసారి ఎకనామిక్ సర్వే రిపోర్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది.

పార్లమెంట్ లో ఈ నివేదికను వెల్లడించిన నిర్మలా సీతారామన్ పలు అంశాలు ప్రస్తావించారు. ముఖ్యంగా వ్యవసాయ, పారిశ్రామిక వృద్ధి రేటు కారణంగా దేశ జీడీపీ పెరుగుదలకు తోడ్పడుతోందని అన్నారు. వ్యవసాయ రంగంలో 3.8 శాతం, పారిశ్రామిక రంగంలో 11.8 శాతం, సర్వీసు రంగంలో 8.2 శాతం చొప్పున వృద్ధి ఉంటుందని అంచనా వేశారు. దాంతో జీడీపీ వృద్ధి రేటు ఆశాజనకంగా ఉండబోతోందని మంత్రి వివరించారు. 2020-21లో జీడీపీ 7.3 శాతంగా ఉంది. అంతకుముందు కోవిడ్ పరిస్థితుల కారణంగా ఆర్థిక పరిస్థితి దెబ్బతినడంతో ఈసారి జీడీపీ లెక్కల్లో పెరుగుదలకు ఆస్కారం ఏర్పడింది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థికరంగంలో వచ్చిన పరిణామాలతో దేశ జీడీపీ కొన్నేళ్లపాటు తగ్గుముఖం పట్టింది. ముఖ్యంగా కోవిడ్ కారణంగా 2020 మొదటి త్రైమాసికంలో అది భారీగా పతనమయ్యింది. అప్పట్లో పూర్తి లాక్ డౌన్ అమలుచేయడంతో ఏకంగా -24 శాతం వరకూ జీడీపీ నమోదయ్యింది. ఆ తర్వాత కోవిడ్ తీవ్రత కొనసాగుతున్నప్పటికీ కఠినమైన ఆంక్షల నుంచి సడలింపులు లభించడంతో ఆర్థికరంగం పుంజుకోవడానికి దోహదపడింది. ప్రస్తుతం 8 శాతం పైబడి ఉంటుందని అంచనాలతో ఆశాజనకంగా భావిస్తున్నారు.

Also Read : కోటి మందికిపైగా పిల్లలు మోడీకి పోస్టుకార్డులు..