P Krishna
P Krishna
దేశంలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఇక తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా ఎన్నికల హడావుడి కనిపిస్తుంది. అధికార పార్టీ బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతుంది. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ తరుపు నుంచి జాతీయస్థాయి నేతలు రాహూల్ గాంధీ, ప్రియంకలు నిన్నటి నుంచి ప్రచారం మొదలు పెట్టారు. ఎనిమిది నియోజవర్గాల్లో వీరి ప్రచారం సాగనుంది. బీజేపీ ఇతర పార్టీలు సైతం ఓట్ల కోసం ఇంటింటి ప్రచారాలకు శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఆవిర్భించిన కొత్త పార్టీలు సైతం ఈసారి పోటీలో తమ అభ్యర్థులను నిలబెట్టబోతున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాజ్య సమితి పార్టీ (టీఆర్ఎస్) రంగంలోకి దిగబోతుంది. తాజాగా ఈ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కొత్తగా ఏర్పడిన పార్టీ తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్). వాస్తవానికి తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) గా పార్టీ అధినేత మార్చిన విషయం తెలిసిందే. కాగా, పార్టీ పేరు మార్పును ఎన్నికల సంఘం ఆమోదించింది. అయితే ఎన్నికల నేపథ్యంలో తుపాకుల బాలరంగం అధ్యక్షతన తెలంగాణ రాజ్య సమితి పార్టీ ఎర్పాటు చేశారు. ఇదిలా ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు.. ఉమ్మడి గుర్తు కేటాయింపు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కార్యదర్శి జయదేబ్ లాహిరి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలుస్తున్న తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీకి ఎన్నికల గుర్తుగా గ్యాస్ సిలిండర్ ని కేటాయిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నీకల్లో గ్యాస్ సిలిండర్ గుర్తు పై మొత్తం 119 నియోజరవర్గాల్లో పోటీ చేస్తామని టీఆర్ఎస్ విజ్ఞప్తి చేయడంతో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత.. తెలంగాణ రాజ్య సమితి అనే పేరుతో రాష్ట్రంలో కొత్తగా పార్టీ పేరును నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించింది ఈసీ. కాగా, గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు వర్తింపజేసే ఫారం 10 బి అందజేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి గుర్తింపు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అయితే అసలు టీఆర్ఎస్ పార్టీ ఎవరిది? అన్న విషయానికి వస్తే.. సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం అనే వ్యక్తి ఆ పార్టీ పేరును రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఓల్డ్ అల్వాల్ లో తన ఇంటిని అడ్రస్ గా పేర్కొన్నారు. 1983 నుంచి సీఎం కేసీఆర్ తో పార్టీలో కొనసాగిన ఆయన రెండు సార్లు సర్పంచిగా, టీఆర్ఎస్ సిద్దిపేట మండలం పార్టీ అధ్యక్షుడిగా, జడ్పీటీసీగా కొనసాగారు. ఇటీవల సొంతగా కొత్తపార్టీ పెట్టి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి సిద్దమయ్యారు. ఈసీ తమ పార్టీ గుర్తుగా గ్యాస్ సిలిండర్ గుర్తు కేటాయించడంపై ఆ పార్టీ అధ్యక్షులు తుపాకల బాలరంగం సంతోషం వ్యక్తం చేశారు.