Idream media
Idream media
ప్రజాస్వామ్య దేశంలో అన్ని ప్రభుత్వాలు ప్రజలు ఎన్నుకొన్నవే. అయితే వాటిలో ప్రజల అభీష్టం మేరకు పాలన సాగించేవి మాత్రం వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ప్రజలకు మెరుగైన సేవలు, సంక్షేమ పథకాలు అందించడంపై కొన్ని ప్రభుత్వాలు నిరంతరం ఆలోచన చేస్తున్నాయి. ప్రజల అభీష్టం మేరకు పాలన సాగించిన నేతగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చరిత్రలో నిలిచిపోయారు. 2004 ఎన్నికల్లో ప్రచారంలో చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలే కాదు.. చెప్పనివి అయిన 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్‌మెంట్ పథకాలను ప్రవేశపెట్టి ప్రజల జీవన ప్రమాణాలను పెంచారు. ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కూడా తండ్రి బాటలోనే నడుస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టోను పవిత్రమైన మత గ్రంథాలతో పోల్చిన సీఎం జగన్.. అందులో పెట్టిన ప్రతి అంశాన్ని అమలు చేసేందుకు యత్నిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 98 శాతం హామీలను అమలు చేశారు.
మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలనే కాదు.. ప్రజల అభీష్టం మేరకు కొత్త పథకాలను కూడా ప్రవేశపెడుతూ.. నిజమైన ప్రజాపాలన ఎలా ఉంటుందో చూపిస్తున్నారు. ఈ నెల 9వ తేదీన ఈబీసీ నేస్తం పథకానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఇందుకు సంబంధించిన అర్హుల జాబితాను తాజాగా జగన్ సర్కార్ విడుదల చేసింది. ఈబీసీ నేస్తం కింద.. అగ్రవర్ణాల్లోని 45–60 ఏళ్ల వయస్సు ఉన్న మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పన రాబోయే మూడేళ్లలో 45 వేల రూపాయలు అందించబోతున్నారు. ఈ పథకం కింద 3,92,674 మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 589 కోట్ల రూపాయలు వెచ్చించబోతోంది. ఈ నెల 9వ తేదీన నగదును.. మహిళల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేయబోతోంది.
ఎన్నికలకు రెండు ఏళ్ల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలలోని 45 ఏళ్లు దాటిన మహిళలకు నెల వారీ పింఛన్ ఇస్తామని జగన్ ప్రకటించారు. ఆయా కులాల్లోని మహిళలు.. పిల్లలను చూసుకోవడం, ఇంటి పని చేయడం, కుటుంబ పోషణ కోసం కూలి పని చేయడం వల్ల ఆ వయస్సుకే వారు నిస్సత్తువ అవుతారని, తమ పార్టీ అధికారంలోకి వస్తే.. వారికి ఆర్థికంగా అండగా ఉంటామని చెప్పారు. అయితే ప్రతిపక్ష పార్టీలు.. 45 ఏళ్లకే పింఛన్ ఏమిటంటూ.. అవహేళన చేయడం ప్రారంభించాయి. ఈ పరిస్థితిని గమనించిన జగన్.. ఎలాగైనా సరే ఆయా వర్గాల మహిళలకు అండగా ఉండాలని, పింఛన్ బదులు.. వైఎస్సార్ చేయూత పథకం పేరుతో.. ప్రతి మహిళకు నాలుగేళ్లలో 75 వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది 18,750 రూపాయల చొప్పున నాలుగేళ్లలో 75 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించి ఆ మేరకు ఇప్పటికే రెండేళ్లు అమలు చేశారు.
వీరికి సాయం అందుతుండడంతో.. ఇతర అగ్ర కులాల్లోని పేదలు కూడా ప్రభుత్వ సాయాన్ని ఆశించారు. దీంతో మొదట కాపు సామాజికవర్గంలోని 45–60 ఏళ్ల మహిళలకు ఏడాదికి 15 వేల రూపాయల చొప్పన అందించేలా కాపు నేస్తం పేరుతో జగన్ సర్కార్ పథకం ప్రారంభించింది. తాజాగా అగ్రవర్ణాల్లోని ఇతర రెడ్డి, కమ్మ, క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య కులాలలోని 45–60 ఏళ్ల మహిళలకు 15 వేల రూపాయల చొప్పున ఈబీసీ నేస్తం పేరుతో ఆర్థిక సాయం అందించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది.
Also Read : చివరికి రైతు సంక్షేమం పైనా విషం కక్కుతున్న ఏబీఎన్ ..