iDreamPost
iDreamPost
రాత్రి వేళల్లో మహిళా ఉద్యోగులు… విద్యార్థినులకు తోడుగా ఉండేందుకు… వారిని సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు తూర్పు పోలీసులు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్’ పేరుతో వారికి రాత్రివేళల్లో రక్షణగా నిలవనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా రక్షణకు తీసుకుంటున్న చర్యలకు ప్రేరణగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇప్పటికే ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా దిశ పోలీస్టేషన్లు ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అలాగే గ్రామ సచివాలయాల్లో మహిళా పోలీసులను నియమించింది.
ఇటువంటి మహిళా ప్రయోజిత కార్యక్రమాలకు కొనసాగింపుగా తొలి దశలో కాకినాడ సిటీ పరిధిలో దీనిని ప్రవేశపెడుతున్నట్టు జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రబాబు మంగళవారం కాకినాడలో విలేకరులకు తెలిపారు. రాత్రి వేళల్లో కార్యాలయాల నుంచి వెళ్లే మహిళా ఉద్యోగులు.. కళాశాలలు నుంచి వెళ్లే విద్యార్థినీలకు ఆకతాయిల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా పట్టణాలలో రాత్రి వేళల్లో ఇళ్లకు చేరడంలో మహిళలు భయపడుతూ రాకపోకలు సాగిస్తున్నారు.
హైదరాబాద్ సమీపంలో దిశ ఘటన ఉదంతం తరువాత ఉద్యోగినీలు కార్యాలయాల నుంచి, విద్యార్థినిలు కళాశాలలు, శిక్షణా సంస్థల నుంచి రాత్రి వేళల్లో సురక్షితంగా ఇళ్లకు వెళ్లడం ఇప్పుడు పెద్ద టాస్క్‌గా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని తూర్పు పోలీసులు సురక్షితంగా ఇళ్లకు చేర్చేందుకు ఉమెన్ డ్రాప్ ఎట్ హోమ్ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు.
కాకినాడలో ఇది విద్యార్థినీలకు ఎక్కువగా ఉపయోగపడనుంది. ఇక్కడ మెడికల్, ఇంజనీరింగ్ కాలేజీలతోపాటు కాంపిటేటివ్ పరీక్షలకు కోచింగ్ సెంటర్లు ఎక్కువ. రాత్రి వేళల్లో ఈ వాహనానికి సమాచారం అందిస్తే మహిళలను వారి ఇంటి వద్ద సురక్షితంగా చేరుస్తారు. ఈ వాహనంలో ఒక డ్రైవర్ తోపాటు మహిళా కానిస్టేబుల్‌ను నియమించారు. రాత్రి పది గంటల నుంచి తెల్లవారు జాము 5 గంటల వరకు వాహన సేవలు అందుబాటులో ఉంటాయి. మహిళలు అత్యవసర సమయాల్లో 94949 33233, 94907 63489కు కాల్ చేయాల్సి ఉంది. ఈ వాహనానికి జీపీఎస్ ఏర్పాటు చేసి జిల్లా పోలీసు కంట్రోల్ రూమ్‌కు అనుసంధానం చేశారు. అక్కడ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పర్యవేక్షణ ఉండేలా చూస్తున్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్‌లో మిగిలిన ప్రాంతాలకు సైతం విస్తరించేందుకు తూర్పు పోలీసులు సిద్ధంగా ఉన్నారు.
Also Read : Ap Cm Ys Jagan – పేదల గుండెల్లో “గూడు” కట్టుకుంటున్న జగన్