Idream media
Idream media
సులభతర వాణిజ్య అవకాశాలను కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండి కేంద్రం ప్రకటించిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్’లో మొదటి స్థానం పొందిన విషయం తెలిసిందే. ఇటీవల ప్రకటించిన ర్యాంకులతో ఏపీ ఘనత దేశానికి తెలిసింది. ఈ ర్యాంకింగ్ ద్వారా పలు పెట్టుబడులను ఆకర్షించేందుకు దోహదపడతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో వ్యాపార సంస్కరణలలోని కార్యాచరణ ప్రణాళిక అమలుపై ఆధారపడి ఈ ర్యాంకులు పొందే అవకాశం ఉంటుంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు దోహదపడే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో వచ్చే ఏడాదిలో నైనా మెరుగైన ర్యాంకు పొందేందుకు దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ మొదటి ర్యాంకు ఎలా పొందింది..? అందుకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
ఏపీ ప్రణాళికలపై ఫోకస్
వ్యాపార అవకాశాలను పంపొందించేందుకు ఏపీలో అమలు చేస్తున్న సంస్కరణలను పరిశీలించి అందుకు దీటుగా ప్రణాళికల రూపకల్పనకు పలు రాష్ట్రాలు కసరత్తు చేస్తున్నాయి. కొత్త పరిశ్రమలను ఆహ్వానించడం.. ఉన్న పరిశ్రమలు మరింత పురోగతి సాధించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై చర్చ మొదలైంది. ప్రధానంగా పక్కనే తెలంగాణ రాష్ట్రం కూడా ఏపీని అనుసరించే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేకంగా సిటిజన్ సర్వీసెస్ మేనేజ్ మెంట్ పోర్టల్ ఏర్పాటు చేయనుంది. దీని ద్వారా ఏ సేవ అయినా ఆన్ లైన్ లో పొందేలా ప్రణాళికలు రచిస్తోంది. సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలు, నైపుణ్యం కలిగిన మానవ వనరుల అవసరాలను గుర్తించేందుకు సమాయాత్తం అవుతోంది. ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలతో పాటు టాప్ 10లో ఉన్న ఛత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ కూడా మరింత మెరుగైన ర్యాంకు సాధనకు పోటీ పడుతున్నట్లు తెలిసింది.
ర్యాంక్ పదిలం దిశగా ఏపీ…
ఇతర రాష్ట్రాలు ఏపీ పై ఫోకస్ పెడితే.. ఏపీ కూడా వాటితో పోటీ పడుతూ తన ర్యాంక్ పదిలం చేసుకునేందుకు మరింత దృష్టి సారించింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) కోసం 301 సంస్కరణలు అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. ఈ మేరకు డీపీఐఐటీ డిపార్ట్ మెంట్ ఆదేశాలు ఇచ్చింది. 2020-21 ర్యాంకుల కోసం మొత్తం 15 విభాగాల్లో నవంబర్ లోగా ఈ సంస్కరణలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఏపీ పరిశ్రమ శాఖ కొత్త మార్గదర్శకాల అమలుకు పకడ్బందీగా ముందుకెళుతోంది. నవంబర్ లోపే సంస్కరణలు అమలు చేయాల్సి ఉండడంతో ఏపీ పరిశ్రమల శాఖ నంబర్ 1 ర్యాంకును కాపాడుకోవాలని అన్ని శాఖల కార్యదర్శులు విభాగ అధిపతులతో సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలపై అవగాహన కల్పిస్తోంది. సంస్కరణలు అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది కొత్తగా టెలికాం పర్యాటకం ట్రేడ్ లైసెన్స్ ఆతిథ్యం హెల్త్ కేర్ తూనికొలు కొలతలు సినిమా హాళ్లు సినిమా షూటింగ్ ల విభాగాల్లో సంస్కరణలు ప్రవేశపెట్టబోతున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ ఇప్పటికే పేర్కొంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో మొదటి స్థానాన్ని కచ్చితంగా పదిలం చేసుకోవాలని చూస్తోంది.