Idream media
Idream media
కళత్తూరు నారాయణ స్వామి రాజకీయాల్లో తలపండిన నేత. వరుసగా రెండు దఫాలుగా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అంతేకాదు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. వయస్సు డెబ్బై పైనే. అయినప్పటికీ యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాళ్లకు దండం పెట్టారట. పార్టీ అధ్యక్షుడనో, ముఖ్యమంత్రి అనో కాదు.. జగన్ ప్రవేశ పెట్టిన ఓ పథకానికి ఫిదా అయి అలా చేయాలనిపించిందని నారాయణస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఏ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.. ఆ పథకం ఏంటి.. దాని ప్రయోజనాలు ఏంటి.. దాని వల్ల రాష్ట్రంలో వచ్చిన మార్పులేంటి అనేది ఓ సారి పరిశీలిస్తే..
తాడేపల్లిలో జరిగిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ప్రజా ప్రతినిధులతో కలిసి ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఓట్ల కోసం మాల, మాదిగల్లో చీలికలు తీసుకుని వచ్చారని ఆరోపించారు.. తమ సమస్యలు పరిష్కారించాలనే గెజిటెడ్ ఉద్యోగులు మనల్ని ఇక్కడకు పిలిచారన్న ఆయన.. అమ్మ ఒడి పథకం లక్ష్యాలను చూసి ఉప్పొంగిపోయాను. అప్పుడే నేను సీఎం వైఎస్ జగన్ పాదాలకు దండం పెట్టాను.. అంబేద్కర్ ఆశయాలను ముఖ్యమంత్రి తు.చ. తప్పకుండా ఆచరిస్తున్నారని వెల్లడించారు.
ఇదే ఆ పథకం గొప్పతనం..
పేదింటి బిడ్డల అమ్మలకు ఆర్థికంగా చేయూతనందించేందుకు సరిగ్గా రెండేళ్ల క్రితం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి, ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివించే పిల్లలకు అమ్మ ఒడి వర్తిస్తుందని ప్రకటించారు. నాటి నుంచీ ఆర్థిక సాయం కింద ఏడాదికి రూ.15,000 ఆర్థిక సహాయం అందిస్తోంది ఏపీ సర్కారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యార్థులందరికీ ఈ పథకం వర్తిస్తోంది. దాదాపు ఇరవై అయిదు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే ఖర్చు చేసింది.
బడి వయసు పిల్లలంతా వంద శాతం చదువుకునేలా చేయడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం. ఓటు హక్కు లేని పిల్లలను ఏ ప్రభుత్వమూ పట్టించుకోకపోయినా జగన్ మాత్రం అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం పథకం లో మార్పులు చేసుకుంటూ వస్తున్నారు. అమ్మ ఒడి కింద నగదుకు బదులుగా తల్లులు కోరుకుంటే ల్యాప్‌టాప్‌లు ఇస్తామని ప్రకటించారు. పథకంలో కొత్త ఆప్షన్‌ను చేర్చి 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు దీన్ని వర్తింప చేయనున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ స్కూళ్ల నుంచి సర్కారు బడులకు..
స్కూలు ఫీజులు కట్టలేక తమ పిల్లలను కూలి పనులకు పంపుతున్న పరిస్థితులను 3,648 కిలోమీటర్లు సాగిన నా పాదయాత్రలో చూశా. ఇలాంటి పరిస్థితులను మార్చేందుకే అమ్మఒడి పథకాన్ని తెచ్చాం.. అని ప్రకటించిన జగన్ విద్యావ్యవస్థను సమూలంగా మార్చేశారు. ఫలితంగా దాదాపు ఐదు లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. కోవిడ్ సమయంలో కూడా అమ్మఒడి పారదర్శకంగా ఇస్తుండటంతో తమ పిల్లలను వారి మేనమామ చూసుకుంటాడన్న నమ్మకం అక్కచెల్లెమ్మల్లో పెరిగింది. పిల్లలు బడికి రాకపోతే వెంటనే తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్ వెళ్లేలా కూడా జగన్ చర్యలు తీసుకున్నారు. మూడో రోజు వలంటీర్ నేరుగా ఇంటికి వచ్చి పిల్లల యోగ క్షేమాలను విచారిస్తున్నారు. పిల్లలను బడికి పంపే బాధ్యత తల్లిదండ్రులదైతే తీసుకొచ్చే బాధ్యతను గ్రామ సచివాలయానికి అనుసంధానంగా ఉన్న ఉద్యోగులు, వలంటీర్లు, పేరెంట్స్ కమిటీతో పాటు టీచర్లకు అప్పగించారు.
రేపటి బాలల కోసం జగన్ తీసుకుంటున్న ఇటువంటి శ్రద్ధే బహుశా.. నారాయణ స్వామి లాంటి పెద్దలకు, ఎందరో ప్రముఖులకు, రాష్ట్ర ప్రజలకు జగన్ పై ఆదరాభిమానాలు, గౌరవం పెరిగేందుకు కారణం కావొచ్చు.
Also Read : మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ఇప్పుడు ఏం చేస్తున్నారు?