iDreamPost
iDreamPost
ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు పాలనా కాలం నుంచి ప్రత్యక్ష పాత్ర కోసం తహతహలాడుతున్న ఆంధ్రజ్యోతి సంస్థ యజమాని ఇటీవల తన ధోరణి కొనసాగిస్తున్నారు. ప్రజల్లో విశ్వసనీయత లేకున్నా వితండ వాదనలు సాగిస్తూ జగన్ ప్రభుత్వంపై విష ప్రచారానికి పూనుకుంటున్నారు. అందులో భాగంగానే ఏకంగా వ్యక్తిగతంగా జగన్, ఆయన క్యాబినెట్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న అంజద్ బాషా మీద గురిపెట్టి ప్రసారం చేసిన కథనం కలకలం రేపింది. ఏకంగా కరోనా విషయంలో నిరాధార కథనాలపై పలు అంక్షలున్నప్పటికీ అడ్డగోలుగా వ్యవహరించింది. దాంతో ఏబీఎన్ చానెల్ దుష్ప్రచారంపై నేరుగా డిప్యూటీ సీఎం ఫిర్యాదు చేశారు. కడప జిల్లా ఎస్పీ అన్బు రాజన్ ని కలిసి డిప్యూటీ సీఎం రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఆయన ఇచ్చిన ఫిర్యాదుతో ఇప్పుడు కేసు నమోదు చేశారు. విచారణకు పిలిచే అవకాశం ఉందని సమాచారం.
ఏబీఎన్ చానెల్ తమపై ఉద్దేశ పూర్వకంగానే దుష్ప్రచారం చేసిందని విమర్శించారు. ముస్లీంల రిజర్వేషన్ల అంశంపై కేసు కోసం సీఎం అనుమతితో తాను మార్చి 2న ఢిల్లీ వెళ్లినట్టు వివరించారు. కానీ ఏబీఎన్ మాత్రం దానిని వక్రీకరించి మార్చి 15, 16 తేదీల్లో ఢిల్లీ వెళ్లి నిజాముద్దీన్ మర్కాజ్ లో పాల్గొన్నట్టు కథనం అల్లేసిందని మండిపడ్డారు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రొటోకాల్ ఉంటుందని.. ప్రతి ఒక్కటి రికార్డయి ఉంటుందని తెలిసినప్పటికీ వివరణ లేకుండా వార్త ప్రసారం చేయడంతో ఆందోళన చెందాల్సి వచ్చిందన్నారు. ఏబీఎన్ చానెల్ తనపై లేనిపోని ప్రచారం చేసినందుకు గాను పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. క్రిమినల్ చర్యలు కూడా తీసుకోవాలని ఆయన కోరారు.
ఈ కేసు ఇప్పుడు ఏబీఎన్ మెడకు చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. వాస్తవానికి డిప్యూటీ సీఎం స్థానిక ఎన్నికల నేపథ్యంలో మార్చి 5 నుంచి కడపలోనే ఉన్నారు. అంతేగాకుండా ఆయన జమాత్ కి వెళ్లి నేరుగా వచ్చి సీఎంని కలిసారని కూడా ఆ కథనం మరింత మసాల కోసం జోడించడం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఏబీఎన్ నిరాధర కథనం చట్టం ముందు దోషిగా నిలబెట్టబోతోంది. ప్రభుత్వం తో పాటుగా అంజద్ బాషా కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఏబీఎన్ వార్తాంశం సదరు సంస్థనను చిక్కుల్లో నెట్టినట్టే కనిపిస్తోంది. అడ్డగోలుగా వార్తలు రాస్తే చివరకు చట్టపరమైన చిక్కులు ఎదర్కోవాల్సిందేనని అనడానికి ఈ వ్యవహారం ఓ ఉదాహరణగా మారబోతోంది. పోలీసులు కూడా కేసు నమోదు చేసి విచారణకు సన్నద్దమవుతున్న వేళ నోటీసులు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది.