గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాల మండల ఎంపీపీ ఎన్నిక వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీ పదవి కోసం తెలుగుదేశం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. దుగ్గిరాల మండలంలో మొత్తం 18 ఎంపీటీసీ సభ్యులు స్థానాలు ఉండగా అందులో తొమ్మిది తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో జనసేన 8 స్థానాల్లో వైసీపీ గెలుపొందాయి.. సాధారణంగా మెజారిటీ స్థానాలు వచ్చాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఎంపీపీ స్థానాన్ని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కుల సమస్య తలనొప్పిగా మారింది. టిడిపి నుంచి గెలిచిన తొమ్మిది మందిలో జబీన్ ఒక్కరే బీసీ కావడంతో ఆమె మీదే నమ్మకం పెట్టుకోగా ఇప్పుడు ఆ పదివిని కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తెలుగుదేశం పార్టీ ఎంపీపీ అభ్యర్థిగా ఉన్న జబీన్ బీసీ కుల ధ్రువీకరణ పత్రం కోసం దరఖాస్తు చేయగా ఆమె బీసీ కాదని చెబుతూ దాన్ని మండల అధికారులు తిరస్కరించారు. దీంతో ఎంపీపీ పదవి కోసం అధికార పార్టీ నేతలు ఏదో చేస్తున్నారని ప్రచారం మొదలు పెట్టిన టిడిపి అండ్ కో ఈ విషయం మీద కలెక్టర్ను ఆశ్రయించడమే కాక కోర్టును కూడా ఆశ్రయించడంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. కోర్టు కూడా వారం రోజుల పాటు ఎంపీపీ ఎన్నిక వాయిదా వేయాలని ఆదేశించింది. అయితే కలెక్టర్ మాత్రం కుల ధ్రువీకరణ పత్రం విషయంలో మండల అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. జబీన్ బీసీ కాదని కలెక్టర్ వివేక్ యాదవ్ తాజాగా నివేదిక ఇచ్చారు. దుగ్గిరాల తహసీల్దార్, తెనాలి సబ్ కలెక్టర్ ఇచ్చిన నివేదికతో పాటు జబీన్ ను స్వయంగా విచారించిన కలెక్టర్ 38 పేజీల నివేదికను జబీన్ కు,హైకోర్టుకు పంపించారు. జబీన్ ఇంటి పేరు షేక్ కాబట్టి… ఆమె బీసీ-ఈ కేటగిరిలోకి రాదని స్పష్టం చేశారు.
జబీన్ సమర్పించిన ధృవ పత్రాల ప్రకారం కూడా ఆమె వెనుకబడిన వర్గాల జాబితాలోకి రారని కలెక్టర్ వివేక్ నివేదికలో పేర్కొన్నారు. జబీన్ పదో తరగతి సర్టిఫికెట్, ఓటర్ లిస్ట్, ఆమె ఎంపీటీసీగా నామినేషన్ వేసిన పత్రాలు కూడా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు నివేదికలో కలెక్టర్ పేర్కొన్నారు. జబీన్ బీసీ కాదని కలెక్టర్ శుక్రవారం నివేదిక పంపడంతో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. జబీన్ కి బీసీ కుల ధృవీకరణ పత్రం మంజూరైతే కనుక ఎంపీపీ పదవి, వైస్ ఎంపీపీ పదవి అలాగే కో ఆప్షన్ పదవులు కూడా తెలుగుదేశం పార్టీకి దక్కుతాయని భావించారు. కానీ ఇప్పుడు కలెక్టర్ కీలక నిర్ణయం తో అసలు ఏం జరగబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. అయితే తెలుగుదేశం పార్టీ నేతలు మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని కూడా ప్రచారం జరుగుతోంది, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
Also Read : Nara Lokesh – లేఖతో బయట పడిన డొల్లతనం