iDreamPost
iDreamPost
ఇటీవల చాలా మంది బయట పానీపూరి తినడానికి ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ముఖ్యంగా యువత పానీపూరి బాగా తింటుంది. పానీపూరి మంచిది కాదు, దానికి ఎలాంటి నీళ్లు వాడతారో, నీట్ నెస్ లేకుండా అమ్ముతారు, చేతులతో అందరికి ఆ పానీపూరీని ఇస్తారు అంటూ చాలా విమర్శలు ఉన్నా పానీపూరి తినడం మాత్రం మానరు జనాలు. గతంలో పలుమార్లు పానీపూరి తిని అస్వస్థతకి గురయిన సంఘటనలు ఉన్నాయి.
అయితే ఈ సారి ఏకంగా పానీపూరి తిని 90 మంది అస్వస్థతకి గురయ్యారు. మధ్యప్రదేశ్ లోని మండలా జిల్లాలో ఓ జాతర జరుగుతుండగా అక్కడికి వచ్చిన ప్రజలు చాలా మంది ఆ జాతరలో అమ్మే పానీపూరి తిన్నారు. శనివారం రాత్రి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఆ జాతరకు వచ్చిన వారిలో చాలా మంది పానీపూరి తిన్నారు. ఆ తర్వాత ఎవరింటికి వారు వెళ్లిపోయారు. శనివారం రాత్రి నాడు చాలా మంది కడుపునొప్పి, వాంతులతో తీవ్ర ఇబ్బందులకు గురయి ఆసుపత్రుల్లో చేరారు.
దాదాపు 90 కంటే ఎక్కువ మంది ఇలా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. వైద్యులు వారికి ట్రీట్ మెంట్ చేసి ఫుడ్ పాయిజన్ అని తేల్చారు. పానీపూరి తినడం వల్లే ఇది జరిగిందని తెలుసుకోవడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలంగా మారంది. ఈ నేపథ్యంలో అక్కడి ప్రాంతానికి ఎంపీ అయిన కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. ఆదివారం నాడు స్థానికంగా ఉన్న ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు.