iDreamPost
android-app
ios-app

డ్రైవరుకి షాకిచ్చిన కీరవాణి – Nostalgia

డ్రైవరుకి షాకిచ్చిన కీరవాణి – Nostalgia

1990లో క్షణక్షణం సినీమా షూటింగ్ రోజులవి. అన్నపూర్ణ స్టూడియోలో సంగీత దర్శకుడు కీరవాణి గారి సిట్టింగు జరుగుతోంది. తను ఒక అర్జెంట్ పనిమీద బయటకు వెళ్లేందుకు కారు కావాలని ఆ సినిమాకి చీఫ్ అసోసియేట్ గా పని చేస్తున శివనాగేశ్వరరావుని అడిగారట. ఆయన ప్రోడక్షన్ కారును, డ్రైవరుని ఏర్పాటు చేసారట.

బయటకు వెళ్లిన కీరవాణి 10 నిమిషాల్లో వచ్చేసి మ్యూజిక్ సిట్టింగులోకి వెళ్లిపోయారు. నేరుగా కీరవాణినే అడగగలిగినా శివనాగేశ్వరరావు డ్రైవర్ని పిలిచి “ఎక్కడికి తీసుకెళ్లావు?” అని అడిగారు. దానికి డ్రైవరు, “ఈయన చాలా తేడాగా ఉన్నారు సర్” అని బదులిచ్చాడట.

వివరంగా చెప్పమని అడిగితే, “బయటికి వెళ్లగానే ఒక బస్ స్టాప్ దగ్గర ఆపమన్నారండి. ఆపాను. ఆయన దిగారు. బస్ స్టాపులో ఒక నిమిషం నిలబడ్డారు. మళ్లీ కారెక్కారు. పోనీయమన్నారు. ఇంకొంచెం దూరమెళ్ళాక మళ్లీ ఒక బస్ స్టాప్ దగ్గర ఆపమన్నారు. మళ్లీ అక్కడ కూడా దిగి ఒక నిమిషం నిలబడి మళ్లీ కారెక్కి పోనీయమన్నారు. మూడో బస్ స్టాప్ దగ్గర మళ్లీ ఆపమని సీన్ రిపీట్ చేసారు. అక్కడినుంచి వెనక్కి వెళ్లిపోదాం పద అన్నారండి. నాకేమీ అర్థం కాలేదు” అని చెప్పాడట.

“నువ్వు మ్యాటర్ ఏంటో ఆయన్ని ఎందుకు అడగలేదు?” అని డ్రైవర్ని అడిగారట శివనాగేశ్వరరావు. “చొరవ తీసుకుని అడగడానికి భయమేసిందండీ” అని చెప్పాడట.

సస్పెన్స్ ఆపుకోలేక శివనాగేశ్వరరావు నేరుగా కీరవాణి దగ్గరకెళ్లి, డ్రైవర్ చెప్పిన మ్యాటర్ చెప్పి విషయం ఏంటని అడిగారట.

దానికి కీరవాణి పకపకా నవ్వి, “నేను కొత్త చెప్పులు కొనుక్కున్నానండి. పాతవి పాడవలేదు. వాటిని ఎవరికన్నా ఇవ్వాలనిపించింది. సాధారణంగా బస్ స్టపుల్లో రాత్రుళ్లు కొందరు పడుకుంటారు కదా. అలాంటి వాళ్ల దగ్గర వదిలేస్తే వాళ్లు వాడుకుంటారు కదా అని బయలుదేరాను. మొదటి రెండు బస్ స్టాపులకి పైకప్పు సరిగ్గా లేదు. కాబట్టి అక్కడెవరూ పడుకోరు అని తేల్చుకున్నాను. మూడోది బాగుంది. అక్కడ రాత్రి మనుషులెవరో పడుకుంటున్నారన్న ఆనవాళ్లు కూడా కనపడ్డాయి. కాబట్టి సాయంత్రం వెళ్ళేటప్పుడు చెప్పులు అక్కడ వదిలేయొచ్చని డిసైడ్ అయ్యాను” అని చెప్పారట.

అదన్నమాట మ్యాటరు. ఇంత కాంప్లికేటెడ్ గా అనిపిస్తున్న ఈ సంఘటనలో మనం గుర్తించాల్సింది కీరవాణి గారి దయా హృదయం. మనలో ఎంతమంది ఇంత తీవ్రంగా ఆలోచిస్తాం చెప్పండి. గొప్పవాళ్ల ఆలోచనలు కూడా గొప్పగానే ఉంటాయి మరి.