Idream media
Idream media
లాసినైర్ , ఫ్రాన్స్‌లో ఒక హంతకుడు. 32 ఏళ్ల వయసులో 1836లో గిలెటిన్ యంత్రం కింద తల నరికి శిక్ష విధించారు. జైలుని అతను క్రిమినల్ యూనివర్సిటీ అని పిలిచాడు. జైల్లో ఉన్నప్పుడు నేర మనస్తత్వంపై ఒక పుస్తకం రాసాడు. అది ఎవరికీ గుర్తు లేదు కానీ , తర్వాత రష్యన్ రచయిత డాస్టోయిస్కో రాసిన గొప్ప నవల Crime and punishment కి ఇదే ప్రేరణ.
అనుకోకుండా హత్యలు చేసిన వ్యక్తి ఎంత భయాన్ని, నరకాన్ని అనుభవిస్తాడో ఆ నవల చెబుతుంది. దృశ్యం సినిమాలో అనుకోని పరిస్థితుల్లో జరిగిన హత్య నుంచి కుటుంబాన్ని హీరో ఎలా కాపాడుకుంటాడో చూపించారు.
దృశ్యం-2 దీనికి కొనసాగింపు. ఈ మధ్య వరుసగా థియేటర్‌లో అరిగిపోయిన తుక్కు కథల్ని చూసిన ప్రేక్షకులకి OTTలో ఇది రిలీఫ్. అంతేకాదు మన తెలివికి పరీక్ష కూడా. హత్య కేసుని తిరగతోడతారని మనకి తెలుసు. అయితే పోలీసులు ఏం చేసారు? హీరో ఎలా ఎదుర్కున్నాడు. ఇది కథ.
బిగినింగ్‌లో సాగతీతగా కొన్ని సీన్స్ వస్తుంటాయి. అవన్నీ మూలకథకి లింక్ చేయడమే దర్శకుడి గొప్పతనం. మోహన్‌లాల్ అద్భుతంగా నటించాడు. అంటే అతిశయోక్తి, ఎందుకంటే ఆయన ఎపుడూ అద్భుతంగానే నటిస్తాడు.
సీక్వెల్స్ చాలాసార్లు నిరాశపరుస్తాయి. కథ మనకి తెలుసు. ఒకసారి చూసిన కథకి కొనసాగింపుగా కొత్తగా చెప్పాలి. చాలా మంది పార్ట్ వన్ కి వచ్చిన పేరుని క్యాష్
చేసుకోవాలని చూస్తారు. డైరెక్టర్ జీతూ జోసఫ్ దానికి మించి తీసాడు. కథలో ఒక్కో సీన్‌ని ఇటుకల్లా పేర్చుకుంటూ పోయాడు. పోలీస్టేషన్‌లో శవం వుందని అందరికీ తెలుసు (పార్ట్ వన్ క్లైమాక్స్) . తెలిసిన విషయంలోనే ఆడియన్స్‌కి షాకిచ్చాడు. కథ బిగువుగా వుంటే సినిమా అటోమేటిగ్గా బావుంటుందని మళ్లీ రుజువైంది.
నేరం చేసిన వాళ్లకి బతికినంత కాలం శిక్షే! ఈ పాయింట్‌తో దృశ్యం-3 వచ్చినా రావచ్చు.