iDreamPost
android-app
ios-app

అందుబాటులోకి DRDO 2G – ఔషధం

అందుబాటులోకి DRDO 2G – ఔషధం

కరోనా రోగుల చికిత్స కు DRDO-రెడ్డి లాబారోటరీస్ అభివృద్ధి చేసిన ‘ఔషధం’ 2-DG ‘(DRDO 2G) వచ్చే వారం నుంచి మార్కెట్లో లభించనుంది. ఇప్పటికే డీజీసీఐ అప్రూవల్ పొందిన ఈ ఔషధం ద్వారా కరోనా సోకిన రోగుల చికిత్స వేగం పెరిగే అవకాశం ఉంది. 10,000 మోతాదుల మొదటి బ్యాచ్ వచ్చే వారం నుంచి అందుబాటులోకి రానుంది. డీఆర్‌డీఓ అధికారులు ఈ సమాచారం ధృవీకరించారు.

భవిష్యత్తులో ఔషధ వినియోగం కోసం ఉత్పత్తిని వేగవంతం చేసే పని జరుగుతోందని డిఆర్‌డిఓ అధికారులు తెలిపారు. ఈ ఔషధాన్ని డాక్టర్ అనంత్ నారాయణ్ భట్ సహా DRDO శాస్త్రవేత్తల బృందం తయారు చేసింది. ఇదిలా ఉంటే ఇప్పటికే కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె. సుధాకర్ DRDO క్యాంపస్‌ను సందర్శించారు. కోవిడ్ యుద్ధంలో గేమ్ చేంజర్ గా మారే 2DG మందు గురించి DRDO శాస్త్రవేత్తలు మంత్రికి వివరించారు.

ఇటీవలే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో, “రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO) అభివృద్ధి చేసిన 2-DG కరోనా యుద్ధంలో ఒక పెద్ద మైలురాయి అని పేర్కొన్నారు. అంటువ్యాధులను ఎదుర్కోవడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనితో, ఆసుపత్రులలో చేరిన రోగులు వేగంగా కోలుకుంటారని వైద్య ఆక్సిజన్‌పై ఆధారపడటం కూడా తగ్గుతుందని పేర్కొన్నారు.

2DG ఔషధాన్ని సృష్టించిన DRDO శాస్త్రవేత్తలు
ఏప్రిల్ 2020 లో, INMAS-DRDO శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారి కోసం ప్రయోగశాలలో తయారు చేసిన ఔషధంపై అనేక పరీక్షలను నిర్వహించారు. ఈ ఔషధం SARS-COV-2 వైరస్ కు వ్యతిరేకంగా సమర్థవంతంగా పనిచేస్తుందని వైరల్ లోడ్ పెరగకుండా నిరోధిస్తుందని కనుగొన్నారు. 2-డిజి రెండో దశ క్లినికల్ ట్రయల్స్ మే 2020 లో కోవిడ్ రోగులపై అనుమతి పొందాయి. 2020 మే నుండి అక్టోబర్ వరకు నిర్వహించిన రెండవ దశ పరీక్షలు ఔషధాన్ని సురక్షితం అని కనుగొన్నారు. రోగుల రికవరీలో గణనీయమైన మెరుగుదల చూపించాయి. ఫేజ్ -2 లో 110 మంది రోగులపై ప్రయత్నించారు.

ఈ ఔషధం విజయవంతమైన ఫలితాల ఆధారంగా, 2020 నవంబర్‌లో DCGI ఈ ఔషధానికి 3వ దశ క్లినికల్ ట్రయల్స్‌ను అనుమతించింది. ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులోని 27 కోవిడ్ ఆసుపత్రులలో 2020 డిసెంబర్ నుండి 2021 మార్చి మధ్య 220 మంది రోగులపై 3వ దశ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి.

దీని తరువాత, ఔషధం మూడవ దశ క్లినికల్ ట్రయల్ పూర్తి డేటాను DCGI కి సమర్పించారు. రోగులలో మంచి ఫలితాలు కనిపించాయి. ఇదే విధమైన ధోరణి 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న రోగులలో కనిపించడం విశేషం.