iDreamPost
android-app
ios-app

మరోసారి తెర మీదికి సోమశిల -సిద్దేశ్వరం బ్రిడ్జి

  • Published Jun 09, 2021 | 8:07 AM Updated Updated Jun 09, 2021 | 8:07 AM
మరోసారి తెర మీదికి సోమశిల -సిద్దేశ్వరం బ్రిడ్జి

వైఎస్సార్ హామీ నెరవేరేందుకు ఆసన్నమైన సమయం. తెలంగాణా , రాయలసీమలను కలుపుతో మరో వారధికి అంతా సిద్ధం. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వారధికి ఎట్టకేలకు మోక్షం కలుగుతోంది. తెలంగాణా, రాయలసీమను కలుపుతు మరో వంతెన సిద్ధమవుతోంది. హైదరాబాద్, తిరుపతి మధ్య దాదాపుగా 90కిలోమీటర్ల ప్రయాణం కలిసివచ్చేందుకు అనువుగా కృష్ణా నదిపై బ్రిడ్జి, జాతీయ రహదారి అభివృద్ధికి అంతా రెడీ చేశారు. దాంతో సోమశిల వద్ద కృష్ణమ్మను దాటేందుకు సుదీర్ఘకాలంగా పడవలపై ప్రయాణిస్తున్న వారి కష్టాలు తీరుతాయని అంతా భావిస్తున్నారు. గతంలో పలు ప్రమాదాల్లో అనేక మంది ప్రాణాలు కూడా కోల్పోయిన చరిత్ర ఉంది. ముఖ్యంగా 2007లో జరిగిన పడవ ప్రమాదం కారణంగా ఒకేసారి 61 మంది జలసమాధి అయ్యారు. లక్ష్మీ నరసింహస్వామి జాతరకు వచ్చిన వారు మరణించడంతో ఇది అప్పట్లో పెద్ద స్థాయిలో విషాదం నింపింది.

ఆ ఘటన తర్వాత నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్పందించారు. కృష్ణానదిపై వంతెన నిర్మాణానికి హామీ ఇచ్చారు. నిధులు కూడా మంజూరు చేశారు. నిర్మాణానికి అనుగుణంగా కొంత ప్రయత్నం కూడా జరిగింది. ముఖ్యంగా అటు నందికొట్కూరు , ఇటు కొల్హాపూర్ నియోజకవర్గాల మధ్య నిర్మించే ఈ వంతెన మూలంగా అనేక ప్రయోజనాలున్నాయి. నిత్యం వందల మంది రాకపోకలు సాగించే ప్రాంతంలో వంతెన ఎంతో ఉపయోగపడుతుంది. అంతేగాకుండా హైదరాబాద్ నుంచి తిరుపతి, చిత్తూరు , చెన్నై ప్రయాణాలకు కూడా దగ్గరి దారి అవుతుంది. పెద్ద స్థాయిలో ప్రయోజనాలున్న మార్గాన్ని అభివృద్ధి చేసే విషయంలో వైఎస్సార్ తర్వాత ప్రభుత్వాలు ప్రధాన్యతనివ్వలేదు. ఆ తర్వాత తెలంగాణ ఆవిర్భావంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడ వంతెన విషయంలో ఆవశ్యాన్ని గుర్తించారు. త్వరలోనే నిర్మిస్తామని ఆయన కూడా హామీ ఇచ్చారు.

చివరకు 2018లో భారతమాల ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వమే ఈ వంతెన, జాతీయ రహదారి అభివృద్ధి బాధ్యతను తీసుకుంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడంతో మరోసారి ఆశలు చిగురించాయి. ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రయత్నాలు ముమ్మరం అయ్యాయి. త్వరలోనే ఈ వంతెన నిర్మాణం కార్యరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది. నాగర్ కర్నూలు మీదుగా నంధ్యాలకి ఈ వంతెన ద్వారా రవాణా చాలా సులువుగా మారుతుంది. ఇప్పటికే ఆళ్లగడ్డ రహదారి అభివృద్ధి చేసి ఉండడంతో దానికి అనుసంధానం చేస్తే అందరికీ మేలు కలుగుతుంది.

కేంద్ర ఉపరితల రవాణా శాఖ నుంచి 165 కిలోమీటర్ల మేర రోడ్డు అభివృద్ధికి అనుమతి వచ్చింది. ఇది సోమశిల ప్రాంత వాసుల చిరకాల కోరిక నెరవేందుకు మార్గం సుగమం చేస్తోంది. అందులో 85 కిలోమీటర్లు తెలంగాణా పరిధిలోనూ, ఏపీలో 80 కిలోమీటర్లు అభివృద్ధి చేస్తారు. వంతెన నిర్మాణం కూడా అందులో భాగంగానే జరుగుతుంది. సుమారుగా రూ. 1200 కోట్లు నిర్మాణ వ్యయంగా అంచనా వేస్తున్నారు. వంతెనకే రూ. 600 కోట్లు వరకూ ఖర్చవుతుందని ప్రాధమిక లెక్క. వంతెన నిర్మాణం కూడా ఆధునిక పద్ధతిలో పర్యాటకులను ఆకర్షించేలా ఉండాలని ప్రభుత్వం ఆశిస్తోంది ఇప్పటికే హైదరాబాద్ దుర్గం చెరువు హ్యాంగిగ్ బ్రిడ్జి అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే కృష్ణా నది మీదుగా కట్టబోయే వంతెన కాబట్టి దానికి అనుగుణంగా పటిష్టమైన పద్ధతిలో ఆకర్షణీయంగా ఉండేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. తెలంగాణా, రాయలసీమ జిల్లాలను అనుసంధానం చేసే ఈ వంతెన నిర్మాణం పూర్తయితే అనేక ప్రయోజనాలతో పాటు స్థానికుల కష్టాల నుంచి గట్టెక్కినట్టే అవుతుందని చెప్పవచ్చు.

Also Read : జ‌గ‌న్ త్రిముఖ విధానాలే కార‌ణం