iDreamPost
android-app
ios-app

డ్రెస్‌ కోడ్‌పై బలవంతం వ‌ద్దు : హిజాబ్‌ పై కర్ణాటక హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

డ్రెస్‌ కోడ్‌పై బలవంతం వ‌ద్దు : హిజాబ్‌ పై కర్ణాటక హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు

హిజాబ్‌ వివాదం ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సోష‌ల్ మీడియాలో దీనిపై చ‌ర్చోప‌చ‌ర్చ‌లు సాగుతున్నాయి. మ‌రోవైపు కళాశాల విద్యార్థులు హిజాబ్ ధరించడంపై ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు నేడు విచారించింది. డ్రెస్‌ కోడ్‌పై ఎవరినీ బలవంతం చేయొద్దన్న న్యాయస్థానం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరచుకోవచ్చని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. 

మతపరమైన దుస్తుల కోసం పట్టుబట్టకూడదని తీర్పువచ్చేవరకు, క్లాస్ రూంలలో విద్యార్ధులు హిజాబ్‌లు, కాషాయ కండువాలు ధరించవద్దని సూచించింది. కాగా ముస్లిం యువతులు పాఠశాలలు, కళాశాలల్లో హిజాబ్ ధరించడంపై కర్ణాటకలో వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం కోర్టులో ఉండగా.. మరో వైపు ఇదే అంశంపై రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఇటీవల ముస్లిం మహిళలు హిజాబ్‌ ధరించడంపై అవగాహన కల్పించడానికి ఫిబ్రవరి 1న ప్రపంచ హిజాబ్ దినోత్సవాన్ని నిర్వహించారు. దీని తర్వాత హిజాబ్‌ వివాదం మరింత పెరిగింది. చాలామంది ముస్లిం మహిళలు హిజాబ్‌కు అనుకూలంగా ప్రదర్శనలు చేస్తున్నారు.

విచారణను వాయిదా వేయడానికి ముందు చీఫ్ జస్టిస్ రితు రాజ్ అవస్థి మాట్లాడుతూ.. ఈ సమస్య కోర్టులో పెండింగులో ఉన్నంత వరకు విద్యార్థులెవరూ తమ మతాచారాలకు అనుగుణంగా దుస్తులు ధరించరాదని స్పష్టం చేశారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ కోసం కోర్టు నిన్న చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ ఎస్ దీక్షిత్, జస్టిస్ జైబున్నీసా ఎం ఖాజీలతో త్రిసభ్య బెంచ్‌ను ఏర్పాటు చేసింది.

క‌ర్ణాట‌క‌లో హిజాబ్ వివాదం గతేడాది డిసెంబరులో మొదటిసారి వెలుగుచూసింది. ఉడుపిలోని ప్రభుత్వ కళాశాల విద్యార్థినులు హిజాబ్ ధరించి వచ్చారు. దీనికి నిరసనగా కొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి కళాశాలకు వచ్చారు. రెండు రోజుల క్రితం ఈ గొడవ మరింత ముదిరి హింసాత్మకంగా మారడంతో ప్రభుత్వం మూడు రోజులపాటు విద్యాసంస్థలకు  సెలవులు ప్రకటించింది.

Also Read : హిజాబ్‌ అంటే ఏమిటి..? క‌ర్ణాట‌క‌లో వివాదం ఎందుకు.?