కనకపు సింహాసనమున శునకమును కూర్చుండబెట్టి అనే పద్యం వినే ఉంటారు. గుజరాత్ లోని ఓ ఊరివాళ్ళు నిజంగానే తమ గ్రామంలోని వీధి కుక్కలను సింహాసనంపై కూర్చోబెట్టినంత పని చేస్తున్నారు. ఈ ఊరి పేరు కుష్కాల్. బనస్ కాంతా జిల్లా పాలన్ పూర్ తాలూకాలో ఉందీ గ్రామం. ఇక్కడి శునకాలు నిజంగానే కోటీశ్వరుల్లా రాజ భోగాన్ని అనుభవిస్తున్నాయి. వీటి పేరిట ఐదు కోట్ల రూపాయల విలువ చేసే పొలం ఉంది మరి!
స్వాతంత్ర్యం రాక ముందు పాలన్ పూర్ నవాబుల అధీనంలో ఉండేది. వాళ్ళు కుష్కాల్ గ్రామానికి కొంత వ్యవసాయ భూమిని కానుకగా ఇచ్చారు. అయితే మనుషులు ఏదో రకంగా సంపాయించుకోగలరు, కానీ వీధి కుక్కలకు తిండి ఎవరు పెడతారని ఆలోచించిన గ్రామస్థులు వాటి కోసమని 12 ఎకరాలకు పైగా పొలాన్ని కేటాయించారు. ఇప్పుడా భూమి విలువ 5 కోట్ల రూపాయలు! టెక్నికల్ గా ఈ భూమి కుక్కల పేరిట లేకపోయినా దీనిపై వచ్చే ఆదాయం మొత్తాన్ని కుక్కల సంక్షేమానికే వినియోగిస్తారు.
ఈ ఊర్లో 700 జనాభా ఉంటే కుక్కలు 150 దాకా ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటీ ఆకలితో నకనకలాడకుండా గ్రామస్థులు జాగ్రత్తలు తీసుకుంటారు. వీటికి తిండి పెట్టడానికి ఒక అరుగు లాంటి దాన్ని కట్టించారు. వంట చేసి వడ్డించడానికి ప్రత్యేకమైన పాత్రలుంటాయి. గ్రామస్థులంతా కలిసే వీధి కుక్కల కోసం ఆరోగ్యకరమైన ఆహారాన్ని వండి పెడతారు. లడ్డూలు, స్వీట్లు కూడా పెడుతుంటారు. ఈ ప్రపంచంలో మనుషులతో పాటు జంతువులు కూడా స్వేచ్ఛగా బతికేలా చూడ్డమే తమ కర్తవ్యమని కుష్కాల్ గ్రామస్థులు చెబుతుంటారు.