iDreamPost
android-app
ios-app

అక్కడ మగవాళ్ళు స్త్రీల వేషం వేసి గర్భా, దాండియా ఆడతారు.. ఎందుకో తెలుసా?

  • Published Oct 08, 2024 | 5:31 PM Updated Updated Oct 08, 2024 | 5:31 PM

Navratri Durga Puja: భారతదేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఓ రాష్ట్రంలో మాత్రం ఈ ఉత్సవాలకు ప్రత్యేక సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పురుషులు స్త్రీల దుస్తులు ధరించి గర్బా, దాండియా నృత్యం చేస్తుంటారు.

Navratri Durga Puja: భారతదేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి.ఓ రాష్ట్రంలో మాత్రం ఈ ఉత్సవాలకు ప్రత్యేక సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. పురుషులు స్త్రీల దుస్తులు ధరించి గర్బా, దాండియా నృత్యం చేస్తుంటారు.

అక్కడ మగవాళ్ళు స్త్రీల వేషం వేసి గర్భా, దాండియా ఆడతారు.. ఎందుకో తెలుసా?

దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. సాధారణంగా నవరాత్రి ఉత్సవాల్లో దుర్గామాత పూజతో పాటుగా దాండి, గర్భా నృత్యాలు జోరుగా నిర్వహిస్తుంటారు. సౌత్ లో కంటే నార్త్ లో ఎక్కువగా ఈ తరహా నృత్య ప్రదర్శనలు జరుగుతుంటాయి. గుజరాతీ గర్బా చాలా ఫేమస్.. ఇక్కడ చిన్న పిల్లల నుంచి వృద్దుల వరకు ఎంతో ఉత్సాహంగా నృత్యం చేస్తుంటారు. అయితే నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఓ విశిష్టమైన ఆచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఆచారంలో పురుషులు స్త్రీల మాదిరిగా చీరలు కట్టుకొని, అందంగా అలంకరించుకొని గర్బా డ్యాన్స్ చేస్తారు. దీనికి ఓ కారణం కూడా ఉందని అక్కడవాళ్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ కారణం ఏంటీ? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

దేవీ నవరాత్రుల సందర్భంగా గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ పాతబస్తీలో ప్రత్యేక సంప్రదాయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. షాపూర్ ప్రాంతంలో సాధు మాత గలి, అంబా మాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో ఎనిమిదో  రోజు రాత్రి పురుషులు స్త్రీల వేషధారణలో నృత్యాలు చేయడం సంప్రదాయంగా కొనసాగుతుంది.  ఈ ఆచారం 200 సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తుంది. బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషులు 1000 మంది ఉన్నారు. వారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా స్త్రీల మాదిరి చీరలు, గాజులు ధరించి అందంగా ముస్తాబై గుడి, వీధుల్లో గర్బా, దాండియా నృత్యం చేస్తారు. ఇది 200 ఏళ్లనాటి శాపం అని.. దాన్ని గౌరవించటానికి గార్బా అనే జానపద నృత్యం చేస్తారని స్థానికులు చెబుతున్నారు. దీని వెనుక ఒక చరిత్ర ఉందని అంటారు.

మొఘలులు భారత దేశాన్ని పాలించే సమయంలో ఓ మొఘల్ రాజు దృష్టి సాదుబేన్ అనే మహిళపై పడింది. అప్పటికే ఆమె వివాహిత.. ఒక బిడ్డను కలిగి ఉంది. అయినా మొఘల్ రాజు కామవాంఛతో ఆమెను తనతో తీసుకువెళ్లే ప్రయత్నం చేశాడు. అప్పుడు తనను రక్షించాలని బారోట్ కమ్యూనిటీకి చెందిన పురుషుల సహాయం అర్థించింది. కానీ మొఘల్ రాజు, సైన్యాన్ని చూసి బారోట్ కమ్యూనిటీ పురుషులు ఆమెను రక్షించడానికి ముందుకు రాలేదు. దీంతో ఆమె బిడ్డ మృతి చెందింది. ఈ క్రమంలోనే కోపోద్రిక్తురాలైన సాదుబెన్, బారోట్ కమ్యూనిటీ పురుషులను భావి తరాలు పిరికిపందలుగా మారతారని శపించిందట. ఆ తర్వాత ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని అంటారు.

సాదుబెన్ శాపానికి భయపడిన బారోట్ వర్గీయులు ఆమెను ఆత్మను ప్రసన్నం చేసుకోవడానికి.. శాప విముక్తి కోసం ఆమె పేరిట అహ్మదాబాద్ లో ఆలయాన్ని నిర్మించారు. ఈ శాప విముక్తి కోసం నవరాత్రులలో చీర కట్టుకొని గర్బ నృత్యం చేస్తారు. దీనిని షేరి గర్బా అంటారు. ఈ సంప్రదాయ నృత్యాన్ని తిలకించేందుకు పట్టణ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యల్లో ప్రజలు తరలి వస్తుంటారు. సాధారణంగా స్త్రీ మాదిరిగా చీరలు, గాజులు, అలంకరణ చేసుకున్న వారిని చిన్న చూపు చూస్తుంటారు. కానీ, బారోట్ కమ్యూనిటీకిచెందిన పురుషులు దీన్ని మహిళల పట్ల మర్యాద, గౌరవానికి చిహ్నంగా భావిస్తుంటారు. షేరీ గర్బా నృత్యం చేయడం వల్ల మంచి ఆరోగ్యం కరమైన బిడ్డలు పుడతారని..కోరిన కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు.