iDreamPost
android-app
ios-app

‘గద్దె’ చెప్పారు.. నమ్మాలంతే..!

‘గద్దె’ చెప్పారు.. నమ్మాలంతే..!

రాజకీయ నేతలు పరిస్థితికి తగినట్లుగా మాట్లాడుతుంటారని అంటుంటారు. కొంతమంది నేతల మాటలు వింటే.. అది నిజమేననిపిస్తోంది. నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌ చూపించి పదోన్నతి పొందిన కేసులో ఎన్టీవో సంఘం మాజీ నేత, టీడీపీ ఎమ్మెల్సీ పర్చూరు అశోక్‌బాబుని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. గంటల వ్యవధిలోనే బెయిల్‌పై అశోక్‌బాబు విడుదలయ్యారు. చంద్రబాబు మొదలు టీడీపీ నేతలు అందరూ పరామర్శ పేరుతో అశోక్‌బాబు ఇంటికి వెళ్లి, బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై విమర్శలు, అశోక్‌బాబుపై సానుభూతి చూపుతూ ఆయన గత చరిత్రను ఏకరువు పెడుతున్నారు.

ఈక్రమంలోనే విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కూడా అశోక్‌బాబును పరామర్శించిన తర్వాత.. మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితికి తగినట్లు వ్యాఖ్యలు చేశారు. ‘‘అశోక్‌బాబును అరెస్ట్‌ చేసినందుకు ఏపీ ప్రజలు సిగ్గుపడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీ హక్కుల కోసం అశోక్‌బాబు చేసిన పోరాటాన్ని ఎవరూ మరువలేదు..’’ అంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ అశోక్‌బాబు విరోచిత పోరాటాన్ని గుర్తు చేశారు. వాస్తవాలను పక్కనబెట్టి ప్రస్తుత పరిస్థితికి తగినట్లుగా రామ్మోహన్‌.. అశోక్‌బాబుపై పొగడ్తల వర్షం కురిపించినా వాస్తవాలు ఏమిటో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు బాగా తెలుసు.

రాష్ట్రాన్ని విభజించవద్దు అంటూ 2014కు ముందు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగింది. ఎన్జీవో సంఘం అధ్యక్షుడుగా ఉన్న అశోక్‌బాబు.. ఆ ఉద్యమ సమయంలో ప్రతి వేదికపై కనిపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా గళం విప్పారు. ఇది పైకి కనిపించిన అజెండా. కానీ 2019 ఎన్నికలకు ముందు అశోక్‌బాబు తన ఉద్యోగానికి రాజీనామా చేయడం, ఆ వెంటనే అయన్ను టీడీపీ శాసనమండలి సభ్యుడుగా పంపించడం తర్వాత.. సమైక్యాంధ్ర ఉద్యమంలో అశోక్‌బాబు పోషించిన పాత్రపై సందేహాలు మొదలయ్యాయి. ఎమ్మెల్సీ అయిన తర్వాత.. ఓ టీవీ డిబేట్‌లో ఆ రోజు తాను లేకపోతే టీడీపీ గెలిచేది కాదంటూ మనసులోని మాటను, 2014 ఎన్నికల్లో వ్యవహరించిన తీరును అశోక్‌బాబు బయటపెట్టారు. అసలు విషయాలు అశోక్‌బాబునే వెల్లడించడంతో రాష్ట్ర విభజన సమయంలో ఆయన ఏపీ హక్కుల కోసం పోరాడలేదని, ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేశారని స్పష్టమైంది. ఈ విషయాలు తెలిసే గద్దె రామ్మోహన్‌.. అశోక్‌బాబు గొప్పతనం గురించి మాట్లాడుతున్నారా..? లేదా..? అనేదే సందేహం.

తప్పుడు సర్టిఫికెట్‌ పెట్టి.. పదోన్నతి పొంది ప్రభుత్వాన్నే అశోక్‌బాబు మోసం చేశారు. ప్రజల సొమ్మును జీతం రూపంలో తీసుకున్నారు. ఇలాంటి పనిచేసిన వారిని అరెస్ట్‌ చేస్తే ప్రజలు ఎందుకు సిగ్గుపడతారో గద్దె రామ్మోహన్‌ చెప్పాలి. మోసం చేసిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోకపోతే, వారి నుంచి జరిగిన నష్టాన్ని రికవరీ చేయకపోతే ప్రజలు సిగ్గుపడతారు గానీ.. గద్దె రామ్మోహన్‌ ఊహించినట్లు ఏమీ జరగదు.

Also Read : అరెస్ట్‌ అవగానే అనారోగ్యం వస్తుందేమిటి..!?