iDreamPost
android-app
ios-app

సొంత పార్టీలోనే నమ్మకాల్లేవా..!

  • Published Aug 29, 2020 | 7:47 AM Updated Updated Aug 29, 2020 | 7:47 AM
సొంత పార్టీలోనే నమ్మకాల్లేవా..!

ఎంత సమర్ధులైనా రాజకీయంలో ఎదుటివారి విమర్శలకు ఎదురొడ్డాల్సి ఉంటుంది. అటువంటిది ఏమాత్రం చిన్నపాటి లోటు కన్పించినా ప్రత్యర్ధుల వాగ్భాణాల ముందు తప్పించుకు తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రత్యర్ధి పార్టీల నుంచి అయితే ఏదోలా తప్పించుకోవచ్చు, కానీ సొంత పార్టీ నాయకుల నుంచే విమర్శలు ఎదురవుతుంటే మాత్రం సదరు నాయకుడి పరిస్థితి జాలికలిగించక మానదు.

ఏపీలో ఒక వెలుగు వెలిగిన టీడీపీ ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలోనే నడుస్తోంది. తన తరువాత తన కుమారుడికి పగ్గాలు అప్పగిస్తానన్న సంకేతాలిచ్చే విధంగా ఎమ్మెల్సీ నుంచి నేరుగా మంత్రి పదవిలో కూర్చోబెట్టేసారు లోకేష్‌ను. అయితే సామర్ధ్యం ఉంటే చీపురుపుల్లతోనైనా యుద్ధం చేయొచ్చు. కానీ ఏకంగా మంత్రి పదవి ఇచ్చినప్పటికీ ఏపీ రాజకీయాల్లోనూ, తన సొంత పార్టీలోనూ లోకేష్‌ మార్కు ముద్ర మాత్రం కన్పించలేదు. చేసిన ప్రయత్నం కూడా ఒక సామాజికవర్గానికి అనుకూలంగానే ఉన్నారన్న తప్పుడు సంకేతాలనే జనంలోకి ఇచ్చింది.

ముఖ్యంగా తాను ఆకట్టుకోవాల్సిన యువనాయకత్వాన్ని దగ్గర చేసుకోవడంలో విజయవంతమైన దాఖలాల్లేవు. పార్టీలో సీనియర్‌ నేతల వారసులను పిలిచి పార్టీ ఇవ్వడం వరకు సక్సెస్‌ అయితే అయ్యుండొచ్చు గాక, వారిని క్షేత్రస్థాయిలో నిలబెట్టి ప్రజల్లో పార్టీ మైలేజ్‌ని పెంచే ప్రయత్నాలకు చురుకందించలేకపోయారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీలో పార్టీ ఉనికికే ముప్పు ఏర్పడే పరిస్థితులు ఎదురవుతున్న నేపథ్యంలో మరింత ముందుకురుకి పార్టీ శ్రేణుల్లో నైతికసై్థ్యర్యం నింపాల్సిన లోకేష్‌ కనీసం జూమ్‌లోనూ, ఫోన్‌లోనూ కూడా సొంత పార్టీ నేతలకు అందుబాటులోకి రావడం లేదన్న ఆరోపణలు జోరుగా విన్పిస్తున్నాయి.

చంద్రబాబే నయం కనీసం ముఖమైనా చూపిస్తున్నారు.. ఆయన కొడుకు లోకేష్‌ మాత్రం అదికూడా చూపించడం లేదని సొంత పార్టీ నేతల నుంచే నస మొదలైంది. అదే సమయంలో యువతతరం నాయకులెవరూ కూడా లోకేష్‌కు దగ్గరైన దాఖలాల్లేవు. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ పరిస్థితి ఏంటన్న డైలమా ఆ పార్టీ నేతల్లో నెలకొంది. సోషల్‌ మీడియా, ట్వీట్ల ద్వారా రాష్ట్రంలో కనీసం పది శాతం ప్రజలకు కూడా చేరువ కాలేమన్నది ఆ పార్టీ సీనియర్ల విశ్లేషణ. జనానికి చేరువకాకుండా ఎంత సేపూ ట్వీట్లు చేసుకుంటూ కూర్చుంటే ఇక అంతేనని వారు నిర్వేదానికి గురవుతున్నట్లు సమాచారం.

అయితే త్వరలోనే ఏదో ఒక యాత్రతో ప్రజల్లో తిరిగేందుకు లోకేష్‌ సిద్ధమవుతున్నారన్న లీకులిస్తున్నారు. ఇదీ కూడా ఎప్పుడూ వారి చుట్టూ ఉండే కోటరీయే బైటకు వదులుతోంది. ఈ లీకులకు కూడా క్షేత్రస్థాయి పార్టీ నాయకుల నుంచి పెద్దగా రిప్లై వస్తున్న దాఖాలల్లేవు. ఈ నేపథ్యంలో అసలు ఏదో ఒక యాత్ర చేస్తే ఎంత వరకు జనంలోకి వెళతాము? సొంత పార్టీలోనే ఎందరు సహకరిస్తారు? ప్రజలు ఆదరిస్తారా? లేదా? ఇటువంటి అనేకానేక సందేహాలు పార్టీ నాయకత్వాన్ని చుట్టుముడుతున్నాయని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో లోకేష్, ఆయన తండ్రి చంద్రబాబుల ముందు వెనువెంటనే ఉన్న లక్ష్యం ‘సొంత పార్టీ నాయకుల్లో నమ్మకం పెంచుకోవడమే’ నంటున్నారు.