iDreamPost
android-app
ios-app

ఈటలను గెలిపించేందుకే రేవంత్‌ ‘ప్రమాదకరం’ వ్యాఖ్యలు చేశారా..?

ఈటలను గెలిపించేందుకే రేవంత్‌ ‘ప్రమాదకరం’ వ్యాఖ్యలు చేశారా..?

21వ శాతాబ్ధంలో రాజకీయాలు కొంత పుంతలు తొక్కడం ఆరంభమైన తర్వాత.. రాజకీయ నేతల మాటలకు, చేతలకు అర్థాలే మారిపోతున్నాయి. ప్రత్యర్థిని ఎదుర్కొవడానికి అవసరమైతే.. బలమైన పోటీదారుడుకు మద్ధతు తెలపాలనే విధానం ప్రస్తుత రాజకీయాల్లో కనిపిస్తోంది. ఆ మద్ధతు కూడా పరోక్షంగా ఇస్తేనే స్వామి కార్యం, స్వకారం సిద్ధిస్తుంది. ప్రస్తుతం జరిగే హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఇదే విధానాన్ని అవలంభిస్తున్నట్లున్నారు.

ఈ రోజు హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరు వెంకట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ను ఉద్దేశించి రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో ఒకవేళ ఈటల రాజేందర్‌ గెలిస్తే.. బండి సంజయ్‌కు ప్రమాదమని, ఆ తర్వాత జి.కిషన్‌ రెడ్డికే ప్రమాదకరమన్నారు రేవంత్‌ రెడ్డి. బండి సంజయ్‌ ఎంపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు. కిషన్‌ రెడ్డి.. కేంద్ర మంత్రివర్గంలో కేబినెట్‌ హోదాలో మంత్రిగా పని చేస్తున్నారు. ఇద్దరు నేతలు కూడా ఆరెస్సెస్ మూలాలు కలవారు, తెలంగాణ బీజేపీలో బలమైన స్థితిలో ఉన్నారు.

Also Read : టీడీపీ ఆ పని మానేసిందట.. ఆ విషయం మరచిపోయిందట..

అయితే రేవంత్‌ రెడ్డి..ఈటల రాజేందర్‌ గెలుపును వీరిద్దరికి ముడిపెట్టడడం వెనుక లక్ష్యం ఏమిటి..? అసలు రేవంత్‌ రెడ్డి ఏం చెప్పదలుచుకున్నారు. ఈటల రాజేందర్‌ ఉప ఎన్నికల్లో గెలిస్తే.. అసెంబ్లీకి వెళతారు..? అలాంటి ఈటల వల్ల బండి సంజయ్‌కు, కిషన్‌ రెడ్డికి ప్రమాదం ఎలా ఉంటుంది..? అనే ప్రశ్నలు తలెత్తక మానవు. కానీ ఇక్కడ రేవంత్‌ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే.. ఈటల రాజేందర్‌ బలమైనోడు అని పరోక్షంగా చెప్పాడు. ఈటల రాజేందర్‌ ఉప ఎన్నికల్లో గెలిస్తే.. ఆ తర్వాత బీజేపీలో శక్తివంతమైన నేతగా ఎదుగుతారని, రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్‌ తెలంగాణ బీజేపీలో భవిష్యత్‌లో ప్రధాన నాయకుడిగా ఎదుగుతారని తాను చెప్పాల్సిన మాటలను.. బీజేపీలోని ఇద్దరు ముఖ్యనేతలతో ముడిపెట్టి చెప్పారు రేవంత్‌ రెడ్డి.

కాంగ్రెస్, బీజేపీల ఉమ్మడి ప్రత్యర్థి టీఆర్‌ఎస్‌. ఇరు పార్టీలు వేరైనా.. వారి లక్ష్యం మాత్రం కేసీఆరే. టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి.. అధికారంలోకి రావాలని ఇరు పార్టీల నేతలు లక్ష్యాలు పెట్టుకున్నారు. ప్రస్తుతం రేవంత్, ఈటల రాజేందర్‌లు ఇద్దరూ కేసీఆర్‌ లక్ష్యంగా రాజకీయాలు చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ ఉప ఎన్నికల్లో గెలిచి.. అసెంబ్లీకి వెళితే కేసీఆర్‌కు పక్కలో బెల్లం మాదిరిగా తయారవుతారనడంలో సందేహం లేదు. 19 ఏళ్లు టీఆర్‌ఎస్‌లో ఉంటూ.. మొన్నటి వరకు మంత్రిగా ఉన్న ఈటలకు కేసీఆర్‌ బలాలు, బలహీనతలు, ప్రభుత్వంలోని లొసుగులపై పూర్తి అవగాహన ఉంటుంది. అది కేసీఆర్‌ ప్రభుత్వాన్ని శాసన సభలో ఇరుకునపెట్టేందుకు ఉపయోగపడుతుంది.

Also Read : ఇక ఈటల కూడా బీజేపీ ‘కీలక’ నేత.. స్పెషల్ స్టేటస్

అందుకే ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్‌ గెలవాలనే రేవంత్‌ రెడ్డి కోరుకుంటున్నట్లున్నారు. అందుకే ఈటల సొంత నియోజకవర్గంలోని ప్రజలకు.. మీ నాయకుడు బలమైనోడు, గెలిస్తే బీజేపీలో బండి సంజయ్, కిషన్‌ రెడ్డిల కన్నా గొప్ప స్థానానికి వెళతాడని పరోక్షంగా చెబుతున్నారు. తమ ఎమ్మెల్యే ఒక జాతీయ పార్టీలో ఉన్నత స్థానానికి వెళితే.. ఆ నియోజకవర్గ ప్రజలకే మేలు జరుగుతుంది కదా. ఆ అవకాశం వదులుకోవద్దనే రేవంత్‌ చెప్పదలుచుకున్నట్లు ఆయన వ్యాఖ్యల ద్వారా అర్థమవుతోంది. మరి రేవంత్‌ ‘ప్రమాదకరం’ వ్యాఖ్యల వెనుక పరమార్థం హుజురాబాద్‌ ఓటర్లకు అర్థమైందా..? లేదా..? అనేది తెలియాలంటే నవంబర్‌ 2 వరకు ఆగాలి.